Loans : దీపావళి గిఫ్ట్.. హోమ్ లోన్, కార్ లోన్ రేట్లు తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
హోమ్ లోన్, కార్ లోన్ రేట్లు తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

Loans : మన దేశంలోనే పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పండుగల ముందు తమ కస్టమర్‌లకు గొప్ప గిఫ్ట్ ఇచ్చింది. బ్యాంకు, లోన్‌లపై తీసుకునే వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో ఇల్లు, కారు కొనడానికి లేదా ఇతర అవసరాలకు లోన్ తీసుకోవడం ఇప్పుడు చాలా సులభం, చవకగా మారింది. ఈ నిర్ణయం వల్ల కొత్తగా లోన్ తీసుకునే వారికే కాకుండా, ఇప్పటికే లోన్ తీసుకున్న పాత వారికి కూడా డబ్బు ఆదా అవుతుంది.
ఎంత వడ్డీ తగ్గింది?
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాళ్ళు తమ MCLR (రుణాలపై కనీస వడ్డీ రేటు) ను 0.15 శాతం వరకు తగ్గించారు. MCLR అనేది, ఏ లోన్ కూడా ఇంతకంటే తక్కువ వడ్డీకి ఇవ్వడానికి వీలు లేని కనీస రేటు. ఈ రేటు తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ వంటి వాటి వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి. అక్టోబర్ 7, 2025 నుంచి ఈ కొత్త రేట్లు మొదలయ్యాయి.
తగ్గిన కొత్త వడ్డీ రేట్లలో కొన్ని చూద్దాం :
ఒక నెల లోన్: పాత రేటు 8.55% నుంచి 8.40% కి తగ్గింది (0.15% తగ్గింపు).
మూడు నెలల లోన్: పాత రేటు 8.60% నుంచి 8.45% కి తగ్గింది (0.15% తగ్గింపు).
ఒక సంవత్సరం లోన్: చాలా లోన్‌లు దీనిపై ఆధారపడి ఉంటాయి. ఇది 8.65% నుంచి 8.55% కి తగ్గింది.
మీ EMIపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?
బ్యాంకు MCLR తగ్గించినప్పుడు మీ లోన్‌పై కట్టే నెలవారీ వాయిదా (EMI) తగ్గుతుంది. అయితే, ఈ తగ్గిన వడ్డీ రేటు మీకు వెంటనే వర్తించదు. మీ లోన్ తదుపరి రీసెట్ తేదీ నాడు మాత్రమే ఈ కొత్త రేటు అమలవుతుంది. ఉదాహరణకు, మీ హోమ్ లోన్ వడ్డీ రేటులో 0.10% తగ్గినా, అది మీకు పెద్ద మొత్తం ఆదా చేయడంలో సహాయపడుతుంది.
MCLR అంటే ఏంటి?
MCLR అనేది మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. ఏ బ్యాంకు అయినా తన లోన్ వడ్డీ రేట్లను నిర్ణయించడానికి దీనిని ఒక ప్రామాణికంగా తీసుకుంటుంది. ఈ రేటును లెక్కించేటప్పుడు బ్యాంకు తన ఖర్చులను, ఆర్బీఐ రెపో రేటును, ఇతర అంశాలను లెక్కలోకి తీసుకుంటుంది. ఆర్బీఐ రెపో రేటు మార్చినప్పుడు బ్యాంకులు కూడా MCLR ను మారుస్తాయి.
