Health Report: ట్రీట్‌మెంట్ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడుతున్న భారతీయులు.. షాకింగ్ రిపోర్ట్
ఎంత డబ్బైనా ఖర్చు పెడుతున్న భారతీయులు.. షాకింగ్ రిపోర్ట్

Health Report: మన దేశంలో ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని FICCI, EY-Parthenon సంయుక్తంగా విడుదల చేసిన ఒక కొత్త నివేదిక స్పష్టం చేసింది. ఈ సర్వే ప్రకారం దాదాపు 90% మంది రోగులు నాణ్యమైన, సర్టిఫైడ్ ట్రీట్‌మెంట్ కోసం కొంచెం ఎక్కువ డబ్బు చెల్లించడానికి కూడా వెనకాడటం లేదట. అలాగే, 83% మంది రోగులు సరైన ఆరోగ్య నిర్ణయాలు తీసుకోవడానికి ఆసుపత్రులు, వైద్యుల గురించిన ఖచ్చితమైన సమాచారం అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు. ఈ నివేదికలో భారత్‌లోని ఆరోగ్య వ్యవస్థకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు, సవాళ్లు వెల్లడయ్యాయి.
భారతదేశంలో రోగుల ప్రధాన ఆందోళన సరైన వైద్య నిర్ణయం తీసుకోవడం. సర్వేలో పాల్గొన్న 83% మంది రోగులు, ఆసుపత్రుల రేటింగ్, చికిత్స ఫలితాలు వంటి నమ్మకమైన సమాచారం అందుబాటులో ఉండాలని కోరారు. ఇది వారికి సరైన ఆసుపత్రిని ఎంచుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఈ రోగుల్లో సుమారు 90% మంది సర్టిఫైడ్ క్వాలిటీ ఉన్న చికిత్స కోసం కొంచెం ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ గణాంకాలు భారతీయ రోగులు వైద్యం నాణ్యతకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియజేస్తున్నాయి.
ఈ రిపోర్ట్ ప్రకారం, ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కొంతవరకు సమర్థవంతంగానే ఉంది, కానీ ఇప్పటికీ నిర్మాణపరమైన, ఆర్థికపరమైన సవాళ్లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా, భారత్‌లో ఆసుపత్రుల్లో బెడ్‌ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. 2000 సంవత్సరం తర్వాత తలసరి ఆసుపత్రి బెడ్‌ల సామర్థ్యం రెట్టింపు అయినప్పటికీ, ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. అంతర్జాతీయంగా ఒక ఆసుపత్రిలో సగటున 100 కంటే ఎక్కువ బెడ్‌లు ఉంటే, భారత్‌లో మాత్రం సగటున 25-30 బెడ్‌లు మాత్రమే ఉన్నాయని నివేదిక వెల్లడించింది.
భారత ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి, చౌకగా అందించడానికి ఒక ఆచరణాత్మకమైన ప్రణాళికను ఈ నివేదిక సూచించింది. దేశంలో ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి, సరైన చికిత్సను ఎంచుకోవడానికి వీలుగా, జాతీయ స్థాయిలో ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫ్రేమ్‌వర్క్‌లో కనీస నాణ్యత ప్రమాణాలు నిర్ణయించాలి. అప్పుడే రోగులు సురక్షితమైన వైద్య ఎంపికలను ఎంచుకోగలుగుతారు.
ఆరోగ్య సేవలకు చెల్లింపుల విషయంలో కూడా భారత్‌లో పెద్ద సమస్య ఉంది. నివేదిక ప్రకారం, భారతదేశంలో టాప్-5 పేయర్స్ (బీమా కంపెనీలు లేదా ఇతర చెల్లింపు సంస్థలు) మొత్తం ఆరోగ్య సంరక్షణ ఖర్చులలో కేవలం 40% మాత్రమే భరిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇదే భాగస్వామ్యం దాదాపు 80% వరకు ఉంటుందట. అంటే, భారతదేశంలో ప్రజలు తమ వైద్య ఖర్చుల కోసం సొంతంగా ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఈ అధ్యయనం దేశవ్యాప్తంగా 40 నగరాల్లోని 250 ఆసుపత్రులలో జరిగింది. ఇందులో సుమారు 75,000 బెడ్‌లను పరిగణనలోకి తీసుకున్నారు. అంతేకాకుండా, 1,000 మందికి పైగా రోగుల సర్వే, 100 మందికి పైగా వైద్యులు, కంపెనీల సీఎక్స్ఓలు, పెట్టుబడిదారులతో చర్చలు జరిపిన తర్వాత ఈ నివేదికను రూపొందించారు.
