Mega Deal : హెల్త్‌కేర్ రంగంలో బిగ్ డీల్.. $1.5 బిలియన్లతో మెడికవర్ ఇండియాను కొనుగోలు చేయనున్న KKR
ఇండియాను కొనుగోలు చేయనున్న KKR

Mega Deal : ప్రపంచప్రసిద్ధ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ KKR భారత్‌లో తన హెల్త్‌కేర్ సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా స్వీడన్‌కు చెందిన ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ మెడికవర్ ABకి చెందిన భారతీయ ఆసుపత్రుల నెట్‌వర్క్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. గత మూడేళ్ల కాలంలో భారతీయ ఆసుపత్రుల రంగంలో KKR చేపడుతున్న మూడవ అతిపెద్ద డీల్ ఇది కావడం విశేషం. ఈ భారీ కొనుగోలు ప్రకటనకు సంబంధించిన అధికారిక వివరాలు ఈ వారంలోనే వెలువడే అవకాశముంది.
రూ.14,000 కోట్ల భారీ డీల్ వివరాలు
అందుతున్న వివరాల ప్రకారం.. ఈ కొనుగోలు ఒప్పందం కోసం KKR సంస్థ దాదాపు రూ.13,000 కోట్ల నుంచి రూ.14,000 కోట్లను (సుమారు 1.5 బిలియన్ డాలర్లు) వెచ్చించనుంది. ఈ మొత్తంతో ప్రస్తుతం ఉన్న వాటాదారుల వద్ద ఉన్న షేర్లన్నింటినీ కైవసం చేసుకుంటుంది. దీనితో పాటు వ్యాపార విస్తరణ, అధునాతన వైద్య పరికరాల ఏర్పాటు మరియు కంపెనీపై ఉన్న పాత అప్పులను తగ్గించుకోవడానికి అదనంగా మరో రూ.3,000 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల వరకు కొత్త పెట్టుబడిగా పెట్టనుంది.
తెలుగు రాష్ట్రాల్లో మెడికవర్ నెట్‌వర్క్ ప్రొఫైల్
భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మెడికవర్ హాస్పిటల్స్‌కు బలమైన నెట్‌వర్క్ ఉంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి మొత్తం 26 ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. వీటిలో 6,000 కంటే ఎక్కువ బెడ్‌ల సామర్థ్యం ఉంంది. దాదాపు 1,250 మందికి పైగా నిపుణులైన వైద్యులు మల్టీస్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తున్నారు. క్యాన్సర్ కేర్ సెంటర్లతో పాటు మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక ఆసుపత్రులను కూడా ఈ సంస్థ నిర్వహిస్తోంది.
2017 నుంచి మెడికవర్ భారత్‌లో ప్రయాణం
మెడికవర్ సంస్థ 2017లో హైదరాబాద్‌లోని సహృదయ హెల్త్‌కేర్ లో వాటాలను కొనుగోలు చేయడం ద్వారా మాక్స్‌క్యూర్ ఆసుపత్రుల నెట్‌వర్క్‌ను దక్కించుకుని భారత్‌లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి నిరంతరం కొత్త ఆసుపత్రులను అందుబాటులోకి తెస్తూ నెట్‌వర్క్‌ను పెంచుకుంటూ వచ్చింది. ఇటీవల సికింద్రాబాద్‌లో 300 పడకల సామర్థ్యంతో కూడిన నూతన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను కూడా ప్రారంభించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఆదాయం 13 శాతం పెరిగి 217.25 మిలియన్ డాలర్లకు చేరింది. అయినప్పటికీ విస్తరణ ఖర్చులు, అప్పుల భారం వల్ల కంపెనీకి 23.69 మిలియన్ డాలర్ల నికర నష్టం నమోదైంది.
భారత్‌లో పెరుగుతున్న వైద్య సేవల డిమాండ్
KKR గతంలోనే బేబీ మెమోరియల్ హాస్పిటల్, హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ వంటి ప్రముఖ హాస్పిటల్ గ్రూప్‌లలో వాటాలను సొంతం చేసుకుంది. భారత్‌లో మెరుగైన వైద్యంపై ప్రజలకు అవగాహన పెరగడం, హెల్త్ ఇన్సూరెన్స్ పరిధి విస్తరించడం, సూపర్ స్పెషాలిటీ సేవలకు భారీ డిమాండ్ ఏర్పడటంతో ఆస్పత్రుల రంగంలో పెట్టుబడులకు అపరిమితమైన అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ కారణంగానే KKR ఇండియన్ హెల్త్‌కేర్ రంగంలో తన పట్టును మరింత బలపరుచుకుంటోంది.

