Wedding Cost: భారతదేశంలో పెళ్లి అంటే కేవలం ఇద్దరి కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల భారీ వేడుక. ఈ కారణంగానే చాలామంది ముందుగా ఒక నిర్ణీత బడ్జెట్ రాసుకుంటారు. అయితే పెళ్లి తేదీ దగ్గర పడే కొద్దీ అనూహ్యమైన ఖర్చులు పుట్టుకొస్తాయి. నివేదికల ప్రకారం చూస్తే పెళ్లి వాస్తవ ఖర్చు ప్రారంభ అంచనాల కంటే ఇరవై నుంచి ముప్పై ఐదు శాతం వరకు ఎక్కువగా మారుతోంది. వెండర్ల కండిషన్లు, ఆఖరి నిమిషంలో పెరిగే అతిథుల తాకిడి, ద్రవ్యోల్బణం ఇవన్నీ బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. ఉదాహరణకు ఒక జంట పందొమ్మిది లక్షల బడ్జెట్ వేసుకుంటే చివరికి ఇరవై ఐదు లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది.

బడ్జెట్‌ను గుల్ల చేసే 7 దాగుడుమూత ఖర్చులు

పెళ్లి ప్లానింగ్ సమయంలో అందరూ వేదిక, భోజనం, బట్టలు, బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ అసలు సమస్య చిన్న చిన్న ఖర్చుల వల్ల వస్తుంది. అలంకరణకు వాడే పూల ధరలు సీజన్‌ను బట్టి భారీగా పెరుగుతాయి. ఒక రోజు తేడాతో పూల రేట్లు రెట్టింపు కావడం ఖర్చును విపరీతంగా పెంచుతుంది. అలాగే క్యాటరింగ్ బిల్లులో జీఎస్‌టీ, సర్వీస్ చార్జీలు, లైవ్ కౌంటర్లు, అదనపు ప్లేట్లు అన్నీ కలిసి బడ్జెట్‌ను భారీగా పెంచేస్తాయి. ఫోటోగ్రఫీలో డ్రోన్ షాట్లు, ప్రీమియం ఆల్బమ్‌లు, సోషల్ మీడియా రీల్స్ వంటి అదనపు హంగులు జేబుకు చిల్లు పెడతాయి.

అతిథుల తాకిడి, బంధువుల అంచనాలు

పెళ్లి ఖర్చులు విపరీతంగా పెరగడానికి అతిథుల నిర్వహణ కూడా ఒక ప్రధాన కారణం. బంధువులు ఎక్కువ మంది వస్తే వారికి హోటల్ గదులు, కార్లు, విమాన ప్రయాణాలు, రవాణా ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. దీనివల్ల రవాణా ఖర్చు ఊహించిన దానికంటే రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల ఆశలు, సోషల్ మీడియాలో చూసే గ్రాండ్ వెడ్డింగ్స్ ప్రభావం కూడా మనపై పడుతుంది. అందరిలాగే తమ పెళ్లి కూడా అట్టహాసంగా జరగాలనే ఒత్తిడితో ఆర్థిక సామర్థ్యాన్ని మించి అప్పులు చేసి ఖర్చు పెడుతుంటారు.

పీక్ సీజన్ ధరల మంట

పెళ్లిళ్ల సీజన్లో క్యాటరర్లు, ఫోటోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులు, వేదికల డిమాండ్ ఆకాశాన్ని తాకుతుంది. సాధారణ రోజులతో పోలిస్తే ఈ సమయంలో వీరు తీసుకునే చార్జీలు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఆహార పదార్థాల ధరలు, మెయింటెనెన్స్ ఖర్చులు ఏటా పెరుగుతూనే ఉంటాయి. ఈ ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయకపోతే చేతిలో ఉన్న సొమ్ము క్షణాల్లో కరిగిపోతుంది. అందుకే ప్లానింగ్ సమయంలోనే ధరల పెరుగుదల కోసం ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని కేటాయించడం చాలా ముఖ్యం.

బడ్జెట్ అదుపులో ఉంచుకునే మార్గాలు

పెళ్లి అద్భుతంగా జరగాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ దానికోసం భవిష్యత్ పొదుపును మొత్తం ఖర్చు చేయడం తెలివైన పని కాదు. బడ్జెట్‌ను అదుపులో ఉంచుకోవడానికి కొన్ని సులభమైన పద్ధతులు పాటించవచ్చు. మొదట్లోనే అన్ని ఖర్చులకూ ఒక పక్కా లిమిట్ పెట్టుకోండి. వెండర్లతో మాట్లాడేటప్పుడు జీఎస్‌టీ, రవాణా అదనపు చార్జీల గురించి ముందే లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకోండి. గెస్ట్ జాబితాను ముందుగానే పరిమితం చేయండి. అత్యవసర ఖర్చుల కోసం పది నుంచి పదిహేను శాతం అదనపు మొత్తాన్ని పక్కన ఉంచండి. క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల జోలికి వెళ్లకుండా సొంత పొదుపు పరిధిలోనే వేడుకను ముగించడం శ్రేయస్కరం.

Next Story