Stock Market: విదేశీ ఇన్వెస్టర్లకు చెక్.. భారత మార్కెట్‌ను ఏలుతున్న దేశీ కుబేరులు
దేశీ కుబేరులు

Stock Market: భారత స్టాక్ మార్కెట్లో హై నెట్ వర్త్ ఇన్వెస్టర్లు (HNI) చరిత్ర సృష్టించారు. ఎన్ఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల్లో వారి పెట్టుబడుల విలువ ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయల మైలురాయిని తాకింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే 1.83 లక్షల కోట్ల రూపాయల మేర వారి సంపద పెరగడం దలాల్ స్ట్రీట్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారతదేశానికి చెందిన హై నెట్ వర్త్ ఇన్వెస్టర్ల ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఎన్నడూ లేని గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ప్రైమ్ డేటాబేస్ అందించిన నివేదిక ప్రకారం.. జూన్ త్రైమాసికం ముగిసే సమయానికి హెచ్ఎన్ఐల మొత్తం హోల్డింగ్స్ విలువ 22.55 శాతం పెరిగి రూ.9.92 లక్షల కోట్లకు చేరింది. మార్చి చివరినాటికి ఇది రూ.8.10 లక్షల కోట్లుగా ఉండేది. డిసెంబర్ 2025 లో నమోదైన రూ.9.56 లక్షల కోట్ల పాత రికార్డును ఇది తిరగరాసింది. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో హెచ్ఎన్ఐల వాటా 1.99 శాతం నుంచి 2.12 శాతానికి పెరిగింది. ఇది మార్చి 2022 తర్వాత నమోదైన అత్యధిక స్థాయి కావడం విశేషం.
రిలయన్స్‌ను వెనక్కి నెట్టిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
మార్కెట్ విలువ పరంగా చూస్తే, ధనిక ఇన్వెస్టర్లు అత్యధికంగా విశ్వసించిన స్టాక్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో వారి హోల్డింగ్ విలువ రూ.28,972 కోట్లుగా నమోదైంది. ఇన్నాళ్లూ అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఇది అధిగమించింది. రిలయన్స్‌లో హెచ్ఎన్ఐల పెట్టుబడుల విలువ రూ.24,383 కోట్లుగా ఉంది. టైటాన్ కంపెనీ రూ.23,744 కోట్లతో మూడో స్థానాన్ని దక్కించుకోగా, ఆ తర్వాత స్థానాల్లో ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా బ్యాంక్ నిలిచాయి. బీఎస్ఈ, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, సుజ్లాన్ ఎనర్జీ, బజాజ్ ఫిన్‌సర్వ్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు టాప్ 10 జాబితాలో నిలిచి ఈ వర్గం ఇన్వెస్టర్ల వద్ద ఉన్న మొత్తం ఈక్విటీ విలువలో 17 శాతం వాటాను ఆక్రమించాయి.
పడిపోతున్నా ఇన్ఫోసిస్ వైపే మొగ్గు
గడిచిన త్రైమాసికంలో హెచ్ఎన్ఐలు అత్యధికంగా కొనుగోలు చేసిన షేరుగా ఇన్ఫోసిస్ నిలిచింది. ఈ ఐటీ దిగ్గజం షేరు ధర 20 శాతం మేర పడిపోయినప్పటికీ, ధనిక ఇన్వెస్టర్లు తగ్గకుండా రూ.2,859 కోట్ల విలువైన 2.44 కోట్లకు పైగా షేర్లను తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో పాటు గొద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లను భారీగా కొనుగోలు చేశారు. మరోవైపు, కేవలం త్రైమాసికంలోనే 49 శాతం దూసుకెళ్లిన సుజ్లాన్ ఎనర్జీలో రూ. 977 కోట్ల పెట్టుబడులు పెట్టడంతో, అందులో వారి హోల్డింగ్ విలువ రూ.11,109 కోట్లకు పెరిగింది.
వారీ ఎనర్జీస్‌లో లాభాల స్వీకరణ
ధనికులు లాభాల స్వీకరణ దిశగా అడుగులు వేసిన కంపెనీల్లో వారీ ఎనర్జీస్ అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో హెచ్ఎన్ఐలు దాదాపు రూ.2,031 కోట్ల విలువైన వాటాలను విక్రయించారు. ఎస్జీ మార్ట్, విప్రో, బీఎస్ఈ షేర్ల నుంచి కూడా పెట్టుబడులను కొంతమేర ఉపసంహరించుకున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, వోడాఫోన్ ఐడియాలో రూ.456 కోట్ల విలువైన షేర్లను విక్రయించినప్పటికీ, ఆ స్టాక్ ఏకంగా 70 శాతం మేర ర్యాలీ చేయడంతో హెచ్ఎన్ఐల వద్ద ఉన్న ఆ కంపెనీ హోల్డింగ్ విలువ రూ.10,894 కోట్లకు ఎగబాకింది.

