Home Buying Checklist: ఇల్లు కొనేముందు ఈ లిస్ట్ తప్పక చూడండి.. లేదంటే జీవితాంతం పశ్చాత్తాపపడవచ్చు
లేదంటే జీవితాంతం పశ్చాత్తాపపడవచ్చు

Home Buying Checklist: ప్రతి ఒక్కరి జీవితంలో సొంత ఇల్లు కొనాలనేది ఒక పెద్ద కల. ఈ రోజుల్లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల, చాలా మంది తమ జీవిత కాలపు సంపాదనను పెట్టుబడిగా పెడుతున్నారు, లేదా హోమ్ లోన్ తీసుకుంటున్నారు. అయితే కొత్త ఇల్లు కొనే ఉత్సాహంలోనూ, ఆనందంలోనూ చాలా మంది కొన్ని కీలకమైన తప్పులు చేస్తుంటారు. ఈ చిన్న పొరపాట్లు భవిష్యత్తులో వారికి ఆర్థిక సమస్యలు, పశ్చాత్తాపాన్ని మిగులుస్తాయి. అందుకే మీరు ఇల్లు కొనే ప్లాన్‌లో ఉంటే, ఉత్తమ డీల్ పొందడానికి, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఈ ముఖ్యమైన చెక్‌లిస్ట్‌ను తప్పక పాటించాలి.
1. మీ బడ్జెట్‌కు తగ్గ లోన్ ఎంచుకోండి
ఇల్లు కొనేటప్పుడు అత్యంత ముఖ్యమైన నిర్ణయం హోమ్ లోన్ ఎంపిక చేసుకోవడం. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా ఉండటానికి ఈ విషయాలు పాటించాలి. లోన్ తీసుకునే ముందు, మీ ఆర్థిక పరిస్థితి, నికర ఆదాయం ఎంత ఉందో సరిగ్గా లెక్కించాలి. మీ ఆదాయానికి అనుగుణంగానే లోన్ మొత్తం, EMIని నిర్ణయించుకోవాలి. ఎక్కువ EMI ఎంచుకుంటే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. లోన్ మొత్తాన్ని ఎన్ని సంవత్సరాలలో తిరిగి చెల్లించాలనే దానిపై చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇది పూర్తిగా మీ ప్రస్తుత, భవిష్యత్తు ఆదాయంపై ఆధారపడి ఉంటుంది.
2. ఆర్థిక స్తోమతను బట్టి ఇంటిని ఎంచుకోండి
అందమైన, విలాసవంతమైన ఇల్లు కొనాలనే కోరిక సహజమే, కానీ మీ ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకోవడం ముఖ్యం. ఖరీదైన మరియు విలాసవంతమైన ఇళ్లను ఎంచుకునే ముందు, భవిష్యత్తులో ఆ మొత్తాన్ని చెల్లించగల సామర్థ్యం మీకు ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి. మీ చెల్లింపు సామర్థ్యాన్ని మించిన ఇళ్లను కొనుగోలు చేయకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది.
3. సరైన లొకేషన్, సౌకర్యాలను తనిఖీ చేయండి
ఇంటి విలువ కేవలం నిర్మాణాన్ని బట్టి మాత్రమే కాదు.. అది ఉన్న ప్రాంతాన్ని బట్టి కూడా నిర్ణయించబడుతుంది. మీ ఇంటి నుంచి ఆసుపత్రులు, పాఠశాలలు, మార్కెట్‌లు వంటి ప్రాథమిక సౌకర్యాలు ఎంత దూరంలో ఉన్నాయో తప్పక తెలుసుకోవాలి. సరైన లొకేషన్ ఆధారంగానే ఆస్తి విలువ కూడా నిర్ణయించబడుతుంది. భవిష్యత్తులో ఆ ఇంటి విలువ పెరగడానికి లొకేషన్ కీలకం.
4. అత్యవసర నిధి సిద్ధం చేసుకోండి
ఇంటిని కొనే అతి పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, ఎమర్జెన్సీ ఫండ్‌ను సిద్ధం చేసుకోవడం చాలా తెలివైన పని. ఇల్లు కొనే ముందు కనీసం 6 నెలల కాలానికి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేయాలి. ఇందులో మీ నెలవారీ ఖర్చులు,హోమ్ లోన్ EMI మొత్తం కూడా కలిసి ఉండాలి. భవిష్యత్తులో ఉద్యోగం కోల్పోవడం వంటి ఏదైనా ఆర్థిక సమస్య వస్తే, ఈ నిధి సహాయంతో మీరు మీ ఆర్థిక అవసరాలను, ముఖ్యంగా EMI చెల్లింపులను సులభంగా నిర్వహించవచ్చు.
5. ఇతర ప్రాపర్టీలతో పోల్చండి
మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ధరలపై స్పష్టత పొందడానికి ఈ చర్య తప్పనిసరి. మీరు కొనాలనుకుంటున్న ఇంటి చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రాపర్టీల ధరలతో పోల్చాలి. ఈ పోలిక ద్వారా మీకు ఇంటి ధర గురించి స్పష్టమైన సమాచారం లభిస్తుంది. తద్వారా మీరు సరైన కొనుగోలు నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. బెస్ట్ డీల్ పొందవచ్చు.

