EPFO : సొంత ఇల్లు కొనడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. ఈ కలను నిజం చేసుకోవడానికి చాలామంది తమ ఏళ్ల తరబడి దాచుకున్న పొదుపును, పెట్టుబడులను ఉపయోగిస్తారు. ఉద్యోగుల భవిష్య నిధి (EPF)లో జమ అయిన భారీ నిధులను చూసినప్పుడు, హోమ్ లోన్ భారాన్ని లేదా డౌన్ పేమెంట్‌ను తగ్గించుకోవడానికి పీఎఫ్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చని చాలామంది భావిస్తారు. ఈపీఎఫ్‌ఓ కూడా ఇల్లు కొనడానికి పార్షియల్ విత్ డ్రాకు అనుమతిస్తుంది. అయితే ఇది నిజంగా తెలివైన ఆర్థిక నిర్ణయమేనా అంటే.. ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ అస్సలు కాదని స్పష్టం చేస్తున్నారు. పీఎఫ్ డబ్బులను ముట్టుకునే ముందు కనీసం రెండు సార్లు ఆలోచించాలని హెచ్చరిస్తున్నారు.

ఈపీఎఫ్‌ఓ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం.. కనీసం 5 సంవత్సరాల నిరంతర సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగి ఇల్లు లేదా ప్లాట్ కొనడానికి, లేదా ఇంటి నిర్మాణం కోసం తన పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు తీసుకోవచ్చు. స్థలం కొనడానికి గరిష్టంగా 24 నెలల బేసిక్ పే ప్లస్ డిఎ, సిద్ధంగా ఉన్న ఇల్లు లేదా ఫ్లాట్ కొనడానికి 36 నెలల బేసిక్ పే ప్లస్ డిఎ వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. హౌసింగ్ సొసైటీ ద్వారా ఇల్లు కొనుగోలు చేస్తే మొత్తం కార్పస్‌లో 90 శాతం వరకు తీసే వెసులుబాటు ఉంది. కాగితంపై ఈ నిబంధనలు ఎంతో సౌకర్యవంతంగా కనిపించినప్పటికీ, భవిష్యత్తు ఫైనాన్షియల్ ప్లానింగ్ దృష్ట్యా ఇది తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.

కాంపౌండింగ్ చక్రవడ్డీ నష్టం, రిటైర్మెంట్ భద్రత

ఈపీఎఫ్ అనేది రిటైర్మెంట్ నిధి, అత్యవసర పరిస్థితికి వాడే సేవింగ్స్ అకౌంట్ కాదు. పీఎఫ్ ప్రస్తుతం సంవత్సరానికి 8.25 శాతం చక్రవడ్డీతో సురక్షితమైన, పూర్తిగా టాక్స్-ఫ్రీ రిటర్న్‌లను ఇస్తుంది. ఉదాహరణకు 30 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న ఉద్యోగి ఇల్లు కొనడానికి పీఎఫ్ నుంచి రూ.5 లక్షలు తీశారనుకుంటే, ఆ డబ్బు అలాగే మరో 25 ఏళ్లు పీఎఫ్‌లోనే ఉంటే 8.25 శాతం చక్రవడ్డీ చక్రంతో రిటైర్మెంట్ సమయానికి రూ.36 లక్షల నుంచి రూ.38 లక్షలుగా మారేది. అంటే ఈ రోజు తీసే రూ.5 లక్షల వల్ల భవిష్యత్తులో ఏకంగా రూ.37 లక్షల కంటే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ఇది మీ వృద్ధాప్య ఆర్థిక భద్రతను తీవ్రంగా దెబ్బతీస్తుంది.

హోమ్ లోన్ టాక్స్ బెనిఫిట్స్ మిస్ కావడం

పీఎఫ్ నుంచి డబ్బులు తీసి హోమ్ లోన్ మొత్తాన్ని తగ్గించుకోవడం వల్ల లభించే పన్ను ప్రయోజనాలు తగ్గిపోతాయి. సెక్షన్ 24(b) కింద హోమ్ లోన్ వడ్డీ చెల్లింపులపై ఏడాదికి రూ.2 లక్షల వరకు, అలాగే సెక్షన్ 80C కింద అసలు చెల్లింపుపై రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. హోమ్ లోన్ ద్వారా వచ్చే టాక్స్ బెనిఫిట్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే, లోన్ యొక్క ప్రభావవంతమైన వడ్డీ రేటు 6.5 శాతం నుండి 7 శాతానికి తగ్గుతుంది. కానీ పీఎఫ్ ఇచ్చే వడ్డీ రేటు 8.25 శాతం. కాబట్టి పీఎఫ్ డబ్బు తీసి లోన్ తగ్గించుకోవడం గణితపరంగా కూడా నష్టదాయకమే.

ఇంటి కొనుగోలుకు ఉన్న మెరుగైన ప్రత్యామ్నాయాలు

సొంత ఇంటి కోసం పీఎఫ్ ఫండ్‌ను నాశనం చేయకుండా ఇతర మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం. డౌన్ పేమెంట్ కోసం మీ వద్ద ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD), రికరింగ్ డిపాజిట్లు (RD) లేదా లిక్విడ్/డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఉపయోగించండి. ప్రారంభంలో తక్కువ డౌన్ పేమెంట్ చెల్లించి హోమ్ లోన్ కాలాన్ని పెంచుకోవడం, ఆదాయం పెరిగే కొద్దీ ప్రీ-పేమెంట్ చేయడం మంచి వ్యూహం. బంగారం లేదా ఉపయోగించని పాత ఆస్తులను విక్రయించడం ద్వారా కూడా నిధులు సమీకరించవచ్చు. అవసరమైతే 1-2 ఏళ్లు ఇంటి కొనుగోలును వాయిదా వేసి, ఎస్‌ఐపీ (SIP)ల ద్వారా డౌన్ పేమెంట్ కార్పస్‌ను తయారు చేసుకోవడం తెలివైన పని.

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story