RBI : మన దేశ సంపద.. మన సొంత గల్లాపెట్టెలోకి వచ్చేసింది. దశాబ్దాల కాలంగా లండన్, న్యూయార్క్ వంటి విదేశీ బ్యాంకుల్లో భద్రంగా ఉన్న వందల టన్నుల భారతీయ బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కి రప్పించింది. మారుతున్న ప్రపంచ రాజకీయ పరిణామాలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో మన దేశ బంగారాన్ని మన గడ్డపైనే ఉంచుకోవాలని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయ్యింది.

ఏమిటీ ఆర్‌బీఐ ఆపరేషన్ గోల్డ్?

భారత రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం (అక్టోబర్ 2025 - మార్చి 2026), గడిచిన ఆరు నెలల్లోనే ఏకంగా 104.23 మెట్రిక్ టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి వెనక్కి తీసుకువచ్చారు. ప్రస్తుతం మన దేశం వద్ద మొత్తం 880.52 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఇందులో 77 శాతం అంటే సుమారు 680 టన్నుల బంగారం ఇప్పుడు మన దేశంలోనే సురక్షితంగా ఉంది. 2023 మార్చి వరకు దేశంలో కేవలం 37 శాతం బంగారం మాత్రమే ఉండేదని గమనిస్తే, ఆర్‌బీఐ ఎంత వేగంగా మన సంపదను వెనక్కి రప్పిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

విదేశాల నుంచి ఎందుకు వెనక్కి తెస్తున్నారు?

దీనికి ప్రధాన కారణం మారుతున్న అంతర్జాతీయ రాజకీయాలు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, పాశ్చాత్య దేశాలు రష్యాకు చెందిన విదేశీ ఆస్తులను ఫ్రీజ్ చేశాయి. అఫ్గానిస్థాన్ విషయంలోనూ ఇదే జరిగింది. అంటే మన సంపద వేరే దేశంలో ఉంటే, ఆ దేశం ఎప్పుడైనా రాజకీయ కారణాలతో దాన్ని వాడుకోకుండా అడ్డుకోవచ్చు. అందుకే మన బంగారం మన దగ్గరే ఉంటేనే అది మనది అనే సూత్రాన్ని భారత్ పాటిస్తోంది. ఆర్థిక సంక్షోభం వచ్చినా, యుద్ధాలు జరిగినా మన బంగారం మన కళ్ల ముందే ఉండాలనేది ఆర్‌బీఐ వ్యూహం. ఒక రకంగా ఇది దేశానికి స్ట్రాటజిక్ ఇన్సూరెన్స్ లాంటిది.

ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్

కేవలం భారత్ మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు తమ బంగారాన్ని విదేశీ బ్యాంకుల నుంచి వెనక్కి తీసుకుంటున్నాయి. ఫ్రాన్స్ దేశం 129 టన్నుల బంగారాన్ని న్యూయార్క్ నుంచి పారిస్‌కు తరలించింది. జర్మనీ కూడా తన 3,352 టన్నుల బంగారంలో భారీ భాగాన్ని వెనక్కి రప్పించే పనిలో ఉంది. పోలాండ్, చెక్ రిపబ్లిక్ వంటి దేశాలు కూడా ఇదే దారిలో ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచ వ్యాపార కేంద్రాలైన లండన్, న్యూయార్క్‌లలో బంగారం దాచుకోవడం ఫ్యాషన్‌గా ఉండేది, కానీ ఇప్పుడు ఆ నమ్మకం సడలిపోతోంది.

ఆర్థిక బలం పెరిగింది

మన విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా కూడా పెరుగుతోంది. మొత్తం 691.1 బిలియన్ డాలర్ల విదేశీ నిల్వల్లో, బంగారం వాటా 13.9 శాతం నుంచి 16.7 శాతానికి పెరిగింది. విదేశీ కరెన్సీల విలువ పడిపోయినా, బంగారం విలువ స్థిరంగా ఉంటుంది కాబట్టి, ఆర్‌బీఐ పసిడి నిల్వలను పెంచుకుంటూ పోతోంది. ఇప్పుడు ఆ నిల్వలను మన దేశ తిజోరీల్లోనే ఉంచడం వల్ల సేఫ్టీతో పాటు రవాణా ఖర్చులు, మేనేజ్‌మెంట్ ఫీజులు కూడా తప్పుతున్నాయి. మున్ముందు మరిన్ని టన్నుల బంగారం స్వదేశానికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story