Hormuz Strait Crisis: హోర్ముజ్ జలసంధి బంద్.. ప్రపంచ దేశాలకు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

Hormuz Strait Crisis: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సైనిక వివాదం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ రెండు దేశాల మధ్య చోటుచేసుకున్న తాజా క్షిపణి దాడుల ప్రభావం ఇప్పుడు అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై తీవ్రంగా పడుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా ముడి చమురు రవాణా అయ్యే అత్యంత కీలకమైన సముద్ర మార్గం హోర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేసింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఒక సంచలన ప్రకటన చేశారు. హోర్ముజ్ జలసంధిని అమెరికా తన పూర్తి నియంత్రణలోకి తీసుకోవాలని భావిస్తోందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఈ వ్యాపార రవాణా మార్గానికి అమెరికా రక్షణ కల్పిస్తున్నందుకు గాను ప్రపంచ దేశాల నుంచి భారీగా నష్టపరిహారం వసూలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఫాక్స్ న్యూస్ లైవ్ టాక్ షోలో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. ఈ సముద్ర రవాణా మార్గంపై తన వ్యూహాన్ని బయటపెట్టారు. "భవిష్యత్తులో ఈ జలమార్గాన్ని మేమే స్వాధీనం చేసుకుని, బహుశా మా ఆధ్వర్యంలోనే దీనిని నడిపిస్తాం. ఈ నౌకా రవాణా మార్గానికి అమెరికా రక్షకుడిగా మారుతుంది. మేము దీనిని జలసంధి రక్షక దేవదూత అని పిలవవచ్చు. కానీ, ఈ రక్షణ సేవలకు ప్రతిఫలంగా ప్రపంచ దేశాలు మాకు ఖచ్చితంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మార్గాన్ని ఉపయోగించుకునే ప్రపంచంలోని సంపన్న దేశాలు అమెరికాకు ఆర్థికంగా పరిహారం చెల్లించాలని, ఎటువంటి లాభం లేకుండా అమెరికా ఇంతటి భారీ భద్రతా బాధ్యతలను ఉచితంగా మోయలేదని ఆయన కుండబద్దలు కొట్టారు.
తమ సముద్ర పరిధిలో అనధికారికంగా నౌకలు తిరుగుతున్నాయనే కారణాన్ని చూపుతూ ఇరాన్ శనివారం ఈ జలసంధిని మూసివేయడంతో వివాదం రాజుకుంది. ఆ ప్రాంతంలో పూర్తిస్థాయిలో శాంతి, స్థిరత్వం ఏర్పడే వరకు కొత్త నౌకలకు ఎటువంటి పర్మిట్లు ఇచ్చేది లేదని టెహ్రాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి తోడు సోమవారం ఇరాన్‌కు చెందిన శక్తివంతమైన సైనిక విభాగం రివల్యూషనరీ గార్డ్స్ అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా తన సైనిక జోక్యాన్ని తక్షణమే నిలిపివేస్తేనే ఇక్కడి నుంచి వాణిజ్య నౌకల ప్రయాణానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ అమెరికా తన మొండివైఖరిని వీడకపోతే.. అంతర్జాతీయ చమురు, గ్యాస్ రంగాలు మరింత తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
అమెరికా, ఇరాన్ దళాల మధ్య క్షిపణులు, డ్రోన్ల దాడులు సోమవారం నాటికి మరింత తీవ్రరూపం దాల్చాయి. గల్ఫ్ రీజియన్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై తాము విజయవంతంగా దాడులు చేశామని, హోర్ముజ్ జలసంధిని తమ ఆధీనంలో ఉంచుకున్నామని ఇరాన్ ప్రకటించింది. ఈ తాజా ఘర్షణలతో గత వారం రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అంతేకాకుండా గతనెలలో ఇరు దేశాల మధ్య కుదిరిన 60 రోజుల తాత్కాలిక శాంతి ఒప్పందానికి ఈ దాడులతో పూర్తిగా తెరపడింది. చర్చలు ముగిసేవరకు ఇరుపక్షాలు శాంతిని పాటించాలనే కండిషన్‌ను ఇరాన్ ఉల్లంఘించిందని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "వారితో ఇదివరకే ఒక పక్కా డీల్ కుదిరింది. కానీ వారు ఎప్పటిలాగే దాన్ని బ్రేక్ చేశారు. మేము వారితో ఇప్పటికే 10 సార్లు ఒప్పందాలు చేసుకున్నాం, కానీ ప్రతిసారీ వారు మోసం చేస్తూనే ఉన్నారు. అందుకే ఈసారి వారిపై అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయి" అని ట్రంప్ హెచ్చరించారు.

