8th Pay Commission : 8వ వేతన సంఘం గురించి చర్చ మొదలైనప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆశలు, అంచనాలు పెరిగిపోయాయి. ఉపాధ్యాయులు తమ బేసిక్ శాలరీని రూ.1.34 లక్షలు చేయాలని కోరుతుంటే, పోస్ట్‌మ్యాన్ సంఘాలు రూ.1.12 లక్షల డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచాయి. అసలు ఈ జీతాల పెంపు వెనుక ఉన్న లెక్కలేంటి? ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఈ జీతాలను ఖరారు చేస్తుంది? అనే ఆసక్తికర విషయాలను వివరంగా తెలుసుకుందాం.

ఉపాధ్యాయులు, పోస్ట్‌మ్యాన్ల డిమాండ్లు

8వ వేతన సంఘంపై ఉపాధ్యాయ సంఘాలు తమ ప్రతిపాదనలను ఇప్పటికే సిద్ధం చేశాయి. లెవల్ 6 లో ఉండే ఎంట్రీ లెవల్ టీచర్ల బేసిక్ శాలరీని రూ.1,34,500 చేయాలని వారు కోరుతున్నారు. మరోవైపు ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ (FNPO) కూడా తమ వాణిని వినిపించింది. ప్రస్తుతం 7వ వేతన సంఘం ప్రకారం రూ.18,000 గా ఉన్న లెవల్ 1 కనీస వేతనాన్ని రూ.69,000కు పెంచాలని, అలాగే పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డుల (లెవల్-5) బేసిక్ శాలరీని రూ.25,500 నుంచి ఏకంగా రూ.1.12 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తోంది.

జీతం ఎలా లెక్కించబడుతుంది?

సాధారణంగా పే కమిషన్ కొత్త జీతాలను లెక్కించేటప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‎ను ప్రధానంగా తీసుకుంటుంది. ఇది ఒక గుణకం లాంటిది.

* పాత బేసిక్ పే × ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ = కొత్త బేసిక్ పే.

* 7వ పే కమిషన్‌లో ఈ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. కానీ ఇప్పుడు ఉద్యోగ సంఘాలు దీనిని 3.68 నుంచి 3.83 వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌కు అంగీకరిస్తే, ఉద్యోగుల జీతాలు ఊహించని రీతిలో పెరుగుతాయి.

పే మ్యాట్రిక్స్, లెవల్స్

పాత పద్ధతిలో ఉన్న పే బ్యాండ్, గ్రేడ్ పే విధానాలకు బదులుగా ప్రభుత్వం ఇప్పుడు పే మ్యాట్రిక్స్‎ను అనుసరిస్తోంది. ఇందులో లెవల్-1 నుంచి లెవల్-18 వరకు విభాగాలు ఉంటాయి. లెవల్-1 అంటే గ్రూప్-డి స్థాయి ఉద్యోగులు కాగా, లెవల్-18 అంటే క్యాబినెట్ సెక్రెటరీ స్థాయి అధికారులు. ప్రతి లెవల్‌కు ఒక నిర్ణీత జీతాల పట్టిక ఉంటుంది. దీనివల్ల ఏ ఉద్యోగికి ఎంత జీతం వస్తుందో చాలా స్పష్టంగా తెలుస్తుంది.

భత్యాలు, ఇంక్రిమెంట్లు:

జీతం పెరగడానికి కేవలం బేసిక్ పే మాత్రమే సరిపోదు. దానికి ప్రభుత్వం ఇతర భత్యాలను కూడా జోడిస్తుంది:

* కరువు భత్యం (DA): పెరిగే ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చే భత్యం ఇది.

* ఇళ్ల అద్దె భత్యం (HRA): ఉద్యోగి పనిచేసే నగరం (X, Y, Z కేటగిరీలు) ఆధారంగా ఇది మారుతూ ఉంటుంది.

* రవాణా భత్యం (TA): ఆఫీస్ కు రావడానికి అయ్యే ఖర్చుల కోసం ఇచ్చేది.

ప్రస్తుతం ఏటా ఇచ్చే 3% ఇంక్రిమెంట్‌ను 6% నుంచి 7% శాతానికి పెంచాలని సంఘాలు కోరుతున్నాయి. దీనివల్ల ప్రతి సంవత్సరం వచ్చే జీతాల పెరుగుదల కూడా గణనీయంగా ఉంటుంది.

ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుంది?

కేవలం ఉద్యోగుల డిమాండ్లను మాత్రమే కాకుండా దేశ ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం, ఖజానాపై పడే భారాన్ని లెక్కించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. 2026లో అమలులోకి రానున్న ఈ కొత్త వేతన సవరణ లక్షలాది కుటుంబాల భవిష్యత్తును ప్రభావితం చేయనుంది. మరి ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటుందో వేచి చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story