EPFO : పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. మీ డబ్బుతో ఈపీఎఫ్ఓ ఎలా సంపాదిస్తుందో తెలుసా?
మీ డబ్బుతో ఈపీఎఫ్ఓ ఎలా సంపాదిస్తుందో తెలుసా?

EPFO : ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ తమ భవిష్యత్తుకు భరోసానిచ్చే అతిపెద్ద పొదుపు మార్గం ఉద్యోగుల భవిష్యత్ నిధి(EPF). తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం 2025-26 కు గానూ పీఎఫ్ ఖాతాదారులకు 8.25 శాతం వడ్డీ రేటును యథాతథంగా కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడో ఏడాది కూడా వడ్డీ రేటులో ఎలాంటి మార్పు చేయకపోవడం విశేషం. దేశంలోని దాదాపు 7.8 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు ఇది ఇతర సాధారణ పొదుపు పథకాల కంటే ఎంతో ఉత్తమమైన రిటర్న్స్ అందిస్తోంది. అయితే అసలు ఈ వడ్డీ రేట్లను ఈపీఎఫ్ఓ ఎలా లెక్కిస్తుంది? మన జీతం నుంచి కట్ అయ్యే పీఎఫ్ డబ్బును ప్రభుత్వం ఎక్కడ దాస్తుంది? దాని ద్వారా వచ్చే లాభాలు ఎలా పంచుతారనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
పీఎఫ్ వడ్డీ రేటును ఎవరు డిసైడ్ చేస్తారు?
పీఎఫ్ ఖాతాదారులకు ఎంత వడ్డీ ఇవ్వాలనే అత్యున్నత నిర్ణయాన్ని ఈపీఎఫ్ఓకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) తీసుకుంటుంది. ఈ బోర్డు మొదట ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ బాండ్లు, స్టాక్ మార్కెట్ ఆధారిత ఈటీఎఫ్ల నుంచి సంస్థకు ఎంత లాభం వచ్చిందో లెక్కిస్తుంది. ఆ తర్వాతే ఒక వడ్డీ రేటును ప్రతిపాదిస్తూ కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక పంపుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన వెంటనే ఆ వడ్డీ డబ్బులు నేరుగా ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ అవుతాయి. ఈ వడ్డీని ఏడాదికి ఒకసారి మాత్రమే ఖాతాలో వేసినప్పటికీ, దీని లెక్కింపు మాత్రం ప్రతి నెల మీ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగానే జరుగుతుంది.
ఈపీఎఫ్ఓ దగ్గరికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?
ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగి తన బేసిక్ శాలరీ, కరువు భత్యం (DA) నుంచి 12 శాతాన్ని పీఎఫ్ అకౌంట్ లో జమ చేస్తారు. అంతే మొత్తాన్ని సదరు కంపెనీ యజమాని కూడా ఉద్యోగి ఖాతాలో వేయాల్సి ఉంటుంది. వీటితో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ స్కీమ్ కోసం కూడా కంపెనీలు కొంత కాంట్రిబ్యూషన్ ఇస్తాయి. ఇలా వచ్చే డబ్బులు, పాత పెట్టుబడుల మెచ్యూరిటీ నిధులు, వడ్డీలు, డివిడెండ్ల రూపంలో ఈపీఎఫ్ఓకు భారీగా నిధులు అందుతాయి. ఉదాహరణకు గత ఆర్థిక సంవత్సరం 2024-25 లోనే ఈపీఎఫ్ఓకు ఏకంగా 3.35 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
మన పీఎఫ్ డబ్బులను ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు?
కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్దేశించిన కఠినమైన నిబంధనల ప్రకారమే పీఎఫ్ నిధులు పెట్టుబడిగా మారుతాయి. మొత్తం నిధులలో సింహభాగం అంటే 45% నుండి 65% వరకు అత్యంత సురక్షితమైన ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతారు. అలాగే 20% నుంచి 45% వరకు డెట్, బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తారు. షార్ట్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్లలో 5% వరకు, అలాగే మంచి రిటర్న్స్ కోసం స్టాక్ మార్కెట్ ఆధారిత ఈటీఎఫ్ (ETF) లలో 5% నుంచి 15% వరకు పెట్టుబడి పెడతారు. మార్చి 2025 నాటికి ఈపీఎఫ్ఓ మొత్తం పెట్టుబడి నిధి విలువ అక్షరాలా 28.37లక్షల కోట్ల రూపాయలకు చేరడం విశేషం.
ఈ భారీ నిధులను మేనేజ్ చేసేది ఎవరు?
ఇంత పెద్ద మొత్తంలో ఉన్న డబ్బును సక్రమంగా నిర్వహించడానికి ఈపీఎఫ్ఓ దేశంలోని ప్రముఖ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల సేవలను ఉపయోగించుకుంటుంది. డేటా అండ్ డెట్ పోర్ట్‌ఫోలియోను ఎస్‌బీఐ ఫండ్ మేనేజ్‌మెంట్, యూటీఐ ఏఎంసీ సంస్థలు చూసుకుంటాయి. అదేవిధంగా ఈక్విటీ, స్టాక్ మార్కెట్ పెట్టుబడులను ఎస్‌బీఐ, యూటీఐ సంస్థలతో పాటు నిప్పన్ లైఫ్ ఇండియా ఏఎంసీ, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ ఏఎంసీలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈపీఎఫ్ఓ మొదట 2015 లో కేవలం 5 శాతంతో ఈటీఎఫ్ పెట్టుబడులను ప్రారంభించి, ఆ తర్వాత 2017 లో దాని పరిమితిని 15 శాతానికి పెంచింది.
భవిష్యత్తులో పెట్టుబడి విధానం మారుతుందా?
మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈపీఎఫ్ఓ తన ఇన్వెస్ట్‌మెంట్ పాలసీలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. మార్చి 2025 నాటికి ఈపీఎఫ్ఓ స్టాక్ మార్కెట్ లో పెట్టిన అసలు పెట్టుబడి సుమారు 10 శాతంగా ఉంది. రాబోయే రోజుల్లో షేర్ మార్కెట్ నుంచి వచ్చే లాభాలను బట్టి ఈ పరిమితిని గరిష్టంగా 15 శాతానికి పెంచే అవకాశం ఉంది. ఖాతాదారులకు ప్రతి ఏటా మెరుగైన వడ్డీ రేట్లు అందించడంతో పాటు, భవిష్యత్తు అవసరాల కోసం సంస్థ దగ్గర తగినంత అదనపు నిధులు నిల్వ ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యమని ఈపీఎఫ్ఓ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

