Learjet 45 : అజిత్ పవార్ ప్రాణాలు తీసిన విమానం ఖరీదు ఎంతో తెలుసా? మెయింటెనెన్స్‌కే కోట్లు ఖర్చు
మెయింటెనెన్స్‌కే కోట్లు ఖర్చు

Learjet 45 : మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురవ్వడం, అందులో ఉన్న ఆరుగురు మరణించడం దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ల్యాండింగ్ సమయంలో ఈ ఘోరం జరిగింది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ ప్రయాణించిన ఆ విమానం ఏంటి? దాని ఖరీదు ఎంత? మెయింటెనెన్స్‌కు ఎంత ఖర్చవుతుంది? అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
అజిత్ పవార్ ప్రయాణించిన విమానం పేరు బాంబార్డియర్ లియర్ జెట్ 45. ఇది కెనడాకు చెందిన బాంబార్డియర్ ఏరోస్పేస్ కంపెనీ తయారు చేసిన మీడియం సైజ్ బిజినెస్ జెట్. భారత్ లో దీనిని ఢిల్లీకి చెందిన వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థ నిర్వహిస్తోంది. సుమారు 16 ఏళ్ల క్రితం తయారైన ఈ విమానం, కేవలం కార్పొరేట్ దిగ్గజాలు, వీఐపీల ప్రయాణాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఇందులో ఇద్దరు పైలట్లు కాకుండా, 8 మంది ప్రయాణికులు అత్యంత విలాసవంతంగా ప్రయాణించవచ్చు.
లియర్ జెట్ విమానాల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంటాయి. దీని కొత్త, అప్‌గ్రేడ్ చేసిన మోడల్ ధర సుమారు 10 మిలియన్ డాలర్లు (అంటే సుమారు రూ.80 కోట్లకు పైగా) ఉంటుంది. ఒకవేళ సెకండ్ హ్యాండ్ విమానం కావాలంటే 2.5 నుంచి 4.5 మిలియన్ డాలర్లు (రూ.20 - 35 కోట్లు) ఖర్చవుతుంది. కేవలం విమానం కొనడమే కాదు, దీనిని మెయింటైన్ చేయడం కూడా చాలా ఖరీదైన వ్యవహారం. ఏటా దీని సర్వీసింగ్, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ కోసం రూ.5 నుంచి 6 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఎవరైనా ఈ విమానాన్ని అద్దెకు తీసుకోవాలంటే గంటకు సుమారు రూ.2.5 లక్షల నుంచి 4 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విమానం గంటకు 852 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. సముద్ర మట్టానికి సుమారు 51,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలిగే సామర్థ్యం దీనికి ఉంది. ఇందులో వాతావరణాన్ని ముందే పసిగట్టే వెదర్ రాడార్, విమానాలు ఒకదానికొకటి గుద్దుకోకుండా హెచ్చరించే ట్రాఫిక్ అలర్ట్ అండ్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నప్పటికీ, బుధవారం జరిగిన ప్రమాదం నుంచి అజిత్ పవార్‌ను కాపాడలేకపోయాయి.
లియర్ జెట్ 45 విమానం ప్రమాదానికి గురవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2023 సెప్టెంబర్ లో ముంబై విమానాశ్రయంలో ఒక లియర్ జెట్ భారీ వర్షం కారణంగా క్రాష్ ల్యాండింగ్ అయింది. అదృష్టవశాత్తూ అప్పుడు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ 2008లో మెక్సికోలో జరిగిన ప్రమాదంలో అక్కడి హోమ్ సెక్రటరీతో సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ప్రమాదాలు మరియు సాంకేతిక లోపాల కారణంగానే కంపెనీ 2021లో దీని ఉత్పత్తిని నిలిపివేసింది. అయినప్పటికీ పాత విమానాలను సర్వీసింగ్ చేస్తూ గాలిలో ఎగురనిస్తుండటం ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తోంది.

