Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ నెలకు ఎంత సంపాదిస్తారు? ఆస్తుల విలువ ఎంత !
ఆస్తుల విలువ ఎంత !

Gyanesh Kumar: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ జీతం, సౌకర్యాల గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రాజధాని ఢిల్లీలో ప్రతిపక్షాల ఆందోళనల నడుమ అసలు ఎన్నికల కమిషనర్ జీతభత్యాలు ఎలా ఉంటాయి, వారికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సదుపాయాలు లభిస్తాయనే విషయాలు బయటకొచ్చాయి. ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉన్న అధికారికి నెలకు ఎంత జీతం వస్తుందో చూద్దాం.
నెలకు రూ.2.5 లక్షల వేతనం
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ మూల వేతనం నెలకు రూ.2,50,000గా ఉంది. ఇది కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి జీతంతో సమానం. 2023లో తీసుకొచ్చిన నూతన చట్టం ప్రకారం సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల వేతనాలను క్యాబినెట్ సెక్రటరీ జీతంతో సమానంగా సవరించారు. గతంలో ఇవి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనంతో సమానంగా ఉండేవి. ప్రస్తుతం కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వం వీరి జీతాలను నిర్ణయిస్తుంది.
జీతంతో పాటు రాజభోగాలు
కేవలం బేసిక్ సాలరీ మాత్రమే కాకుండా సీఈసీకి ఎన్నో రకాల ప్రయోజనాలు అందుతాయి. నెలకు రూ.34,000 ప్రత్యేక భత్యం, ఉచిత ప్రభుత్వ బంగ్లా, డ్రైవర్‌తో కూడిన ప్రత్యేక భద్రతా వాహనాలు లభిస్తాయి. వీటితో పాటు ఉచిత విద్యుత్, నీరు, టెలిఫోన్ సదుపాయాలు, కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్య సేవలు అందుతాయి. ఏడాదికి ఒకసారి కుటుంబ సమేతంగా పర్యటించడానికి ఎల్‌టీసీ సదుపాయంతో పాటు పదవీ విరమణ తర్వాత భారీ పెన్షన్ పొందుతారు.
కేరళ కేడర్ ఐఏఎస్ నుంచి సీఈసీ స్థాయికి!
జ్ఞానేష్ కుమార్ 1988 కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. 2024లో ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన, ఫిబ్రవరి 2025లో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో కాశ్మీర్ డివిజన్ జాయింట్ సెక్రటరీగా పనిచేసిన సమయంలోనే ఆర్టికల్ 370 రద్దు ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. అయోధ్య రామమందిర ట్రస్ట్ ఏర్పాటు వ్యవహారాలను కూడా ఆయన పర్యవేక్షించారు. ఐఐటీ కాన్పూర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ చదివారు.
రహస్యంగా ఆస్తుల వివరాలు
జ్ఞానేష్ కుమార్ మొత్తం నికర ఆస్తి విలువ ఎంత ఉందనేది అధికారికంగా ఎక్కడా వెల్లడి కాలేదు. ఆయన 2015 నుంచి 2023 వరకు సమర్పించిన ఆస్తుల వివరాలను ఇవ్వాలని సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా కోరినప్పటికీ, అది వ్యక్తిగత సమాచారమని DoPT పేర్కొంటూ తిరస్కరించడం వివాదాస్పదమైంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి ఆస్తుల వివరాలు బహిరంగంగా అందుబాటులో ఉండాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

