Dharmendra Pradhan Asset : ధర్మేంద్ర ప్రధాన్ ఆస్తులు ఎంతంటే.. ఆయన భార్య దగ్గర ఉన్న బంగారం ఎంతో తెలుసా?
ఆయన భార్య దగ్గర ఉన్న బంగారం ఎంతో తెలుసా?

Dharmendra Pradhan Asset : కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పరీక్ష వివాదాల నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనల కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంలోనే ఆయన ఆస్తుల గురించి చర్చ నడుస్తొంది. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ నివేదికల ప్రకారం.. ధర్మేంద్ర ప్రధాన్, ఆయన కుటుంబం మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.6.92 కోట్లుగా నమోదైంది. అయితే ఈ కుటుంబానికి రూ.53.38 లక్షల వరకు అప్పులు కూడా ఉన్నాయి.
ఆర్థిక సంవత్సరం 2022-23 ఆదాయ వివరాలను పరిశీలిస్తే.. ధర్మేంద్ర ప్రధాన్ వార్షిక ఆదాయం రూ. 12.75 లక్షలుగా ఉండగా, ఆయన భార్య మృదులా ఠాకూర్ వార్షిక ఆదాయం రూ.49.92 లక్షలుగా నమోదైంది. దీని ప్రకారం కుటుంబ మొత్తం ఆదాయంలో భార్య సంపాదన పందేం గెలిచిందని చెప్పవచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబం తమ వద్ద ఉన్న నగదును వివిధ ఆర్థిక మార్గాల్లో పెట్టుబడిగా పెట్టింది. బ్యాంక్ డిపాజిట్ల విషయానికి వస్తే, కుటుంబ సభ్యుల పేరు మీద వివిధ బ్యాంక్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లలో కలిపి మొత్తం రూ.2.47 కోట్లు నిల్వ ఉన్నాయి.
అలాగే, ఎస్‌బీఐ, ఐసిఐసిఐ వంటి మ్యూచువల్ ఫండ్లలో దాదాపు రూ. 80.40 లక్షలు పెట్టుబడి పెట్టగా, వివిధ రకాల ఎల్‌ఐసీ మరియు ఇతర బీమా పాలసీలలో మొత్తం రూ. 67.72 లక్షల వరకు ఇన్వెస్ట్ చేశారు. స్థిరాస్తుల విషయానికొస్తే, ధర్మేంద్ర ప్రధాన్ స్వరాష్ట్రమైన ఒడిశాతో పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పలు ఆస్తులు ఉన్నాయి. ఒడిశాలోని అంగుల్ జిల్లాలో రూ. 12 లక్షల విలువైన వ్యవసాయ భూమి, అలాగే రూ. 20.50 లక్షల విలువ చేసే వ్యవసాయేతర భూమి ఆయన పేరిట ఉన్నాయి. నివాస గృహాల విషయానికి వస్తే, ధర్మేంద్ర ప్రధాన్, ఆయన భార్య పేరు మీద కలిపి సుమారు రూ. 1.98 కోట్ల విలువైన నివాస ఆస్తులు ఉన్నాయి. ఇందులో ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఒక ఫ్లాట్, ఒడిశాలోని భువనేశ్వర్/తాల్చేర్‌లో ఇల్లు భాగమై ఉన్నాయి.
ఆస్తుల పట్టికలో వాహనాలు, బంగారం, వెండి వివరాలు కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. వాహనాల విభాగానికి వస్తే.. ధర్మేంద్ర ప్రధాన్ పేరిట 2011 మోడల్ హోండా సిటీ కారు ఉండగా, ఆయన భార్య పేరు మీద వ్యాపార అవసరాల కోసం కొన్ని కమర్షియల్ వాహనాలు (లారీలు) రిజిస్టర్ అయి ఉన్నాయి. బంగారం, వెండి విషయానికొస్తే ధర్మేంద్ర ప్రధాన్ వద్ద 200 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి ఉండగా, ఆయన భార్య మృదులా ఠాకూర్ వద్ద 500 గ్రాముల బంగారం (అరకిలో ఆభరణాలు), 10 కిలోల వెండి ఉన్నాయి. కాగా ధర్మేంద్ర ప్రధాన్ పేరు మీద పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంకుల్లో కలిపి రూ. 31.38 లక్షల వరకు రుణాలు నిలిచి ఉన్నాయి.

