Credit Card: టాప్ అండ్ పే సర్వీస్ ఎలా పనిచేస్తుంది? కాంటాక్ట్‌లెస్ పేమెంట్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

Credit Card: ప్రస్తుత డిజిటల్ కాలంలో నగదు రహిత లావాదేవీలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఏ దుకాణానికైనా వెళితే క్యాష్ ఇవ్వడం లేదా కార్డ్‌ను మెషిన్లో స్వైప్ చేసి పిన్ నంబర్ ఎంటర్ చేయడం జరిగేది. కానీ ఇప్పుడు పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. కేవలం కార్డ్‌ను పేమెంట్ మెషిన్ దగ్గరకు తీసుకువెళ్లగానే చిటికెలో లావాదేవీ పూర్తవుతుంది. ఈ సులభమైన విధానాన్నే ట్యాప్ అండ్ పే లేదా కాంటాక్ట్‌లెస్ పేమెంట్ అని పిలుస్తారు. దీని ద్వారా క్షణాల వ్యవధిలో పేమెంట్స్ పూర్తి చేయవచ్చు. అయితే ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, ఖాతా నుంచి డబ్బులు ఎలా కట్ అవుతాయనే విషయాలు చాలామందికి తెలియదు.
ఎన్ఎఫ్సీ టెక్నాలజీ పనిచేసే విధానం
ఈ ట్యాప్ అండ్ పే సర్వీస్ వెనుక ముఖ్యంగా ఎన్ఎఫ్సీ అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది బ్లూటూత్ లాంటి వైర్లెస్ విధానమే అయినప్పటికీ, కేవలం అతి తక్కువ దూరంలో ఉన్న డివైజ్‌ల మధ్య మాత్రమే డేటాను పంపుతుంది. మీ కాంటాక్ట్‌లెస్ కార్డ్ లోపల ఒక చిన్న చిప్ అలాగే యాంటెన్నా అమర్చి ఉంటాయి. దుకాణదారుడు మెషిన్లో బిల్లు అమౌంట్ ఎంటర్ చేసి యాక్టివేట్ చేయగానే మెషిన్ రేడియో సిగ్నల్స్‌ను విడుదల చేస్తుంది. మీరు కార్డ్‌ను మెషిన్‌కు కేవలం రెండు నుంచి నాలుగు సెంటీమీటర్ల దూరంలో ఉంచగానే, కార్డ్ చిప్ ఆ సిగ్నల్స్‌ను గ్రహించి సమాచారాన్ని పంచుకుంటుంది.
పిన్ నంబర్ లేకుండా డబ్బులు ఎలా కట్ అవుతాయి?
చాలామందికి పిన్ ఎంటర్ చేయకుండా డబ్బులు ఎలా వెళ్తాయనే సందేహం ఉంటుంది. ఈ సిస్టమ్‌లో భద్రత కోసం ప్రతి ట్రాన్సాక్షన్‌కు ఒక కొత్త కోడ్ జనరేట్ అవుతుంది. ఆ కోడ్ మెషిన్ ద్వారా నేరుగా బ్యాంకుకు చేరుతుంది. ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉందా లేదా అని సిస్టమ్ చెక్ చేసుకున్న తర్వాత లావాదేవీకి అంగీకరిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం భారతదేశంలో రూ.5,000 వరకు ఎలాంటి పిన్ నంబర్ అవసరం లేకుండానే ట్యాప్ అండ్ పే ద్వారా చెల్లింపులు చేయవచ్చు. అంతకంటే ఎక్కువ మొత్తానికి మాత్రం కచ్చితంగా పిన్ నంబర్ కొట్టాల్సి ఉంటుంది.
సోషల్ మీడియాలో కొన్నిసార్లు పాకెట్లో కార్డ్ ఉంటే ఎవరో మెషిన్ పెట్టి డబ్బులు కాజేస్తారని ప్రచారం జరుగుతుంటుంది. అయితే ఎన్ఎఫ్సీ టెక్నాలజీ చాలా తక్కువ దూరంలో మాత్రమే పనిచేస్తుంది కాబట్టి అంత సులభంగా డబ్బులు తీయడం సాధ్యం కాదు. ప్రతి చెల్లింపునకు బ్యాంకు అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా పేమెంట్ మెషిన్ కూడా రిజిస్టర్డ్ మర్చంట్ బ్యాంకు ఖాతాతోనే అనుసంధానమై ఉంటుంది. అయినప్పటికీ వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.
వాడేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు
ఈ సేవలను ఉపయోగించే సమయంలో కొన్ని ప్రాథమిక విషయాలను దృష్టిలో పెట్టుకోవడం మంచిది. ఎప్పుడైనా పేమెంట్ చేసేటప్పుడు మీ కళ్ల ముందే లావాదేవీ జరిగేలా చూసుకోండి. ప్రతీ ట్రాన్సాక్షన్ పూర్తయిన తర్వాత వచ్చే ఎస్ఎంఎస్ లేదా మొబైల్ నోటిఫికేషన్‌ను పరిశీలించండి. కార్డ్ ట్యాప్ చేయడానికి ముందే మెషిన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న అమౌంట్‌ను సరిచూసుకోండి. ఒకవేళ కార్డ్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వాలి. మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా కాంటాక్ట్‌లెస్ లిమిట్‌ను తగ్గించుకోవచ్చు లేదా అవసరం లేకపోతే ఈ సర్వీస్‌ను తాత్కాలికంగా ఆఫ్‌లో ఉంచుకోవచ్చు.

