SIP Investment : నెలకు రూ.7,000తో రూ.1.30 కోట్లు..కోటీశ్వరులు కావాలంటే ఇది తెలుసుకోండి
కోటీశ్వరులు కావాలంటే ఇది తెలుసుకోండి

SIP Investment : భారతీయ పెట్టుబడిదారులు ఎప్పుడూ మంచి పెట్టుబడి అవకాశాల కోసం చూస్తుంటారు. కొందరు సురక్షితమైన మార్గాలను ఎంచుకుంటే, మరికొందరు మార్కెట్ రిస్క్‌లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. మీరు చిన్న చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టి భవిష్యత్తులో పెద్ద మొత్తాన్ని కూడబెట్టాలని ప్లాన్ చేస్తుంటే.. మీరు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ గురించి తప్పక పరిశీలించాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో సుదీర్ఘ కాలం పాటు కొద్దికొద్దిగా పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు కోట్లాది రూపాయల ఫండ్‌ను సృష్టించవచ్చు. ముఖ్యంగా స్టెప్-అప్ ఎస్‌ఐపిలో నెలకు రూ.7,000 పెట్టుబడితో రూ.1.30 కోట్ల ఫండ్‌ను ఎలా సృష్టించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్ స్టెప్-అప్ SIP అంటే ఏమిటి?
స్టెప్-అప్ ఎస్‌ఐపి అంటే, మీరు ప్రతి సంవత్సరం మీ నెలవారీ ఎస్‌ఐపి మొత్తాన్ని సుమారుగా 10 శాతం వరకు పెంచడం. అంటే కాలంతో పాటు మీ పెట్టుబడి మొత్తం పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఫండ్‌లో జమ అయ్యే మొత్తం పెరుగుతుంది. సాధారణ SIP తో పోలిస్తే స్టెప్-అప్ SIP ద్వారా మీకు ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ SIP లో సగటున సుమారు 12 శాతం వరకు రాబడి లభించవచ్చు. మార్కెట్ కదలికలను బట్టి ఈ రాబడి మారవచ్చు. అయితే, స్టెప్-అప్ ఎస్‌ఐపి ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో పెట్టుబడి మొత్తం పెరుగుతూ ఉండటం వల్ల సాధారణ ఎస్‌ఐపి కంటే మెరుగైన రాబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
రూ.1.30 కోట్ల కార్పస్ ఫండ్ లెక్కలు
మీరు నెలకు రూ.7,000 తో స్టెప్-అప్ ఎస్‌ఐపిని 20 సంవత్సరాల పాటు కొనసాగిస్తే మీ మొత్తం పెట్టుబడి సుమారుగా రూ.48.11 లక్షలు అవుతుంది. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉండి, మీరు సగటున 12 శాతం వార్షిక రాబడిని పొందినట్లయితే, 20 సంవత్సరాల తర్వాత మీ వద్ద సుమారు రూ.1.30 కోట్ల కార్పస్ ఫండ్ ఉండే అవకాశం ఉంది. అంటే, మీ నికర రాబడి సుమారు రూ.82.30 లక్షల వరకు ఉండవచ్చు.
స్టెప్-అప్ ఎలా చేయాలి?
స్టెప్-అప్ ఎస్‌ఐపి ప్రకారం మీరు మొదటి సంవత్సరం నెలకు రూ.7,000 పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత రెండో సంవత్సరం నుంచి ఈ మొత్తాన్ని 10 శాతం పెంచి, నెలకు రూ.7,700 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం మీ నెలవారీ పెట్టుబడిని 10% పెంచుకుంటూ పోతే, 20 సంవత్సరాల లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.

