ఫ్రీగా సిబిల్ స్కోర్ చెక్ చేయడం ఎలా?

CIBIL Score : మీరు ఎప్పుడైనా లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసినట్లయితే.. కచ్చితంగా సిబిల్ స్కోర్ గురించి విని ఉంటారు. చాలా మందికి దీని గురించి అవగాహన ఉండదు. దీనిని ఉచితంగా ఎలా చెక్ చేసుకోవాలో తెలియదు. అయితే, మీ సిబిల్ స్కోర్‌ను ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కేవలం మీ మొబైల్ ద్వారా కొన్ని నిమిషాల్లో సులభంగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. సిబిల్ స్కోర్ అంటే ఏమిటి, అది ఎందుకు ముఖ్యమో, ఉచితంగా ఎలా చెక్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

సిబిల్ స్కోర్ అనేది మూడు అంకెల సంఖ్య. ఇది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఇది మీ క్రెడిట్ హిస్టరీని తెలియజేస్తుంది. గతంలో మీరు తీసుకున్న లోన్లను, EMI లను సమయానికి కట్టారా, క్రెడిట్ కార్డులను ఎలా ఉపయోగించారు వంటి మీ ఆర్థిక ప్రవర్తనపై ఈ స్కోర్ ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోర్‌ను మంచిదిగా పరిగణిస్తారు. మీకు స్కోర్ ఎక్కువగా ఉంటే, లోన్ లేదా క్రెడిట్ కార్డు త్వరగా మంజూరయ్యే అవకాశం ఉంటుంది, అంతేకాకుండా వడ్డీ రేట్లు కూడా తక్కువగా లభిస్తాయి.

మీరు మీ సిబిల్ స్కోర్‌ను ఉచితంగా చెక్ చేసుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. సిబిల్ అధికారిక వెబ్‌సైట్‌లో సంవత్సరానికి ఒకసారి ఉచితంగా మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ PAN కార్డు నంబర్, పుట్టిన తేదీ , ఈమెయిల్ ఐడీ వంటి ప్రాథమిక వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వివరాలు ధృవీకరించబడిన తర్వాత, మీ క్రెడిట్ రిపోర్ట్, స్కోర్ కనిపిస్తాయి.

చాలా బ్యాంకులు (ఉదాహరణకు, మీ సొంత బ్యాంక్), కొన్ని ఫైనాన్షియల్ యాప్‌లు ఎప్పుడైనా ఉచితంగా సిబిల్ స్కోర్‌ను చెక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. దీనివల్ల మీరు మీ స్కోర్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

మీరు లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు, బ్యాంకులు ముందుగా మీ సిబిల్ స్కోర్‌ను చూస్తాయి. స్కోర్ ఎక్కువగా ఉంటే, మీరు నమ్మదగిన రుణగ్రహీత అని బ్యాంకుకు అర్థమవుతుంది. స్కోర్ తక్కువగా ఉంటే రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు భావిస్తారు. మంచి స్కోర్ ఉండటం వల్ల తక్కువ వడ్డీ రేట్లు, ఎక్కువ క్రెడిట్ లిమిట్, మెరుగైన లోన్ డీల్స్ పొందడానికి అవకాశం లభిస్తుంది. లోన్ త్వరగా మంజూరవడానికి కూడా ఇదే ప్రధాన కారణం.

స్కోర్‌ను ప్రభావితం చేసే అంశాలు

* మీ స్కోర్‌ను ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యమైనది పేమెంట్ హిస్టరీ

* మీరు EMI లు లేదా క్రెడిట్ కార్డు బిల్లులు ఆలస్యం చేస్తే స్కోర్ తగ్గుతుంది.

* క్రెడిట్ లిమిట్‌ను ఎక్కువగా ఉపయోగించడం (ఉదాహరణకు 50% కంటే ఎక్కువ), ఒకేసారి ఎక్కువ లోన్ల కోసం అప్లై చేయడం లేదా పాత క్రెడిట్ కార్డులను అకస్మాత్తుగా మూసివేయడం వంటివి కూడా స్కోర్‌ను తగ్గిస్తాయి.

* బిల్లులను సకాలంలో చెల్లించడం, బాధ్యతగా క్రెడిట్‌ను ఉపయోగించడం స్కోర్‌ను క్రమంగా మెరుగుపరుస్తాయి.

స్కోర్‌ను మెరుగుపరుచుకునే మార్గాలు

* లోన్ అవసరం పడే కంటే ముందే మీ సిబిల్ స్కోర్‌పై దృష్టి పెట్టడం చాలా మంచిది.

* సమయానికి చెల్లింపులు: ఎప్పుడూ బిల్లులు, EMI లను చివరి తేదీ కంటే ముందే చెల్లించండి.

* క్రెడిట్ లిమిట్: క్రెడిట్ కార్డు లిమిట్‌లో 30% కంటే తక్కువ మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నించండి.

* ఒకేసారి చాలా లోన్ల కోసం అప్లై చేయకుండా ఉండండి.

* ఎప్పటికప్పుడు మీ సిబిల్ స్కోర్, క్రెడిట్ రిపోర్ట్‌ను చెక్ చేసుకుంటూ ఉండండి. అందులో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేయించుకోండి.

PolitEnt Media

PolitEnt Media

Next Story