Health Insurance: చాలామంది ఉద్యోగుల వద్ద కంపెనీ ఇచ్చే కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో పాటు స్వయంగా కొనుగోలు చేసిన మరో వ్యక్తిగత పాలసీ కూడా అందుబాటులో ఉంటుంది. ఆకస్మిక అనారోగ్య సమస్యలు తలెత్తి ఆసుపత్రిలో చేరినప్పుడు వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతుంటాయి. అలాంటప్పుడు పెద్ద మొత్తంలో వచ్చే బిల్లును చెల్లించడానికి ఈ రెండు పాలసీలను ఎలా ఉపయోగించుకోవాలనే సందేహం చాలామందిలో కలుగుతుంది. ఒకే ఆసుపత్రి ఖర్చు కోసం రెండు వేర్వేరు కంపెనీల నుంచి పూర్తిగా రెండుసార్లు డబ్బులు క్లెయిమ్ చేయడం సాధ్యం కాదు. కానీ మొదటి పాలసీ ద్వారా అందని మిగిలిన మొత్తాన్ని రెండో పాలసీ ద్వారా రీయింబర్స్‌మెంట్ రూపంలో పొందవచ్చు.

క్లెయిమ్ ప్రాసెస్ చేసే సరైన పద్ధతి

భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(IRDAI) నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఎన్ని పాలసీలైన కలిగి ఉండవచ్చు. అయితే ఏకకాలంలో రెండు చోట్ల నుంచి పూర్తి లాభం పొందడానికి కుదరదు. ముందుగా మీ ప్రధాన పాలసీ లేదా మొదటి ప్రాధాన్యతనిచ్చే ఇన్సూరెన్స్ సంస్థ వద్ద క్లెయిమ్ ఫైల్ చేయాలి. ఆ మొదటి కంపెనీ నుంచి బిల్లు సెటిల్ అయిన తర్వాత వచ్చే అప్రూవల్ లెటర్ అలాగే డిశ్చార్జ్ సమ్మరీ జిరాక్స్ కాపీలను భద్రపరచుకోవాలి. ఆ తర్వాత మిగిలిన బిల్లు మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి ఆ సెటిల్మెంట్ పత్రాలతో పాటు రెండో ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించాలి.

మొదటి కంపెనీ ఆలస్యం చేస్తే ఏం చేయాలి?

కొన్ని సందర్భాల్లో మొదటి ఇన్సూరెన్స్ సంస్థ క్లెయిమ్ సెటిల్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీనివల్ల రెండో పాలసీ ద్వారా రావాల్సిన మొత్తం కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మొదటి కంపెనీ అధికారులను లేదా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ సిబ్బందిని ఎప్పటికప్పుడు సంప్రదించి ప్రక్రియ వేగవంతం అయ్యేలా చూడాలి. ఒకవేళ స్పందన రాకపోతే నేరుగా గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. రెండు పాలసీల ద్వారా ఆసుపత్రి బిల్లు భారాన్ని తగ్గించుకోవచ్చు గానీ, నిబంధనలను కచ్చితంగా పాటించడం చాలా ముఖ్యం.

Next Story