Credit Card: పెరుగుతున్న నిత్యావసర ధరలు, సరిపోని ఆదాయంతో చాలామంది దైనందిన అవసరాల కోసం క్రెడిట్ కార్డులపై ఆధారపడుతున్నారు. సరైన ప్రణాళిక లేకుండా వాడేసి, బిల్లులు సకాలంలో చెల్లించక క్రెడిట్ కార్డ్ అప్పుల ఊబిలో దారుణంగా చిక్కుకుంటున్నారు. ఈ భారం నుంచి బయటపడేందుకు సులువైన, సమర్థవంతమైన మార్గాలు మీ కోసం. క్రెడిట్ కార్డ్ బాకీలను సకాలంలో చెల్లించకపోవడమే అసలు సమస్యకు కారణమవుతోంది. గడువు తేదీ మరచిపోవడం వల్ల సాధారణ బాకీకి చక్రవడ్డీ, లేట్ ఫీజులు తోడై కొండంత భారంగా మారుతాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ముందుగా పేమెంట్ రిమైండర్లు సెట్ చేసుకోవడం చాలా అవసరం. ఫోన్‌లో అలారమ్‌లు లేదా ఆటో-పే ఆప్షన్లను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ప్రతి నెలా బిల్లు గడువు తేదీ దాటకుండా సులువుగా చెల్లించవచ్చు. ఇది అదనపు వడ్డీ భారం పడకుండా మిమ్మల్ని కాపాడుతుంది.

చిన్న అప్పులను ముందుగా ఖాళీ చేయండి

ఆర్థిక నిపుణులు సూచించే స్నోబాల్ పద్ధతి క్రెడిట్ కార్డ్ బాకీలను తీర్చడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మీకున్న పలు రకాల అప్పుల్లో అత్యంత చిన్న బాకీలను ముందుగా పూర్తిగా తీర్చివేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఒక అప్పు పూర్తిగా తీరిపోగానే మానసికంగా ఎంతో ఉపశమనం లభిస్తుంది. అదే ఉత్సాహంతో మిగిలిన పెద్ద క్రెడిట్ కార్డ్ బాకీలను ఒక్కొక్కటిగా చెల్లిస్తూ రావచ్చు. ఈ పద్ధతి అప్పుల భారాన్ని క్రమంగా తగ్గిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.

ఆదాయం రావడమే ఆలస్యం

ప్రతి నెలా జీతం లేదా ఆదాయం చేతికి రాగానే చేయాల్సిన మొదటి పని బడ్జెట్ తయారు చేసుకోవడం. అత్యవసర ఖర్చులు ఏవి, వాయిదా వేయదగిన లేదా అనవసర ఖర్చులు ఏవో స్పష్టమైన జాబితా రాసుకోవాలి. అనవసర వ్యయాలను పూర్తిగా అదుపు చేస్తూ ఆదా చేసిన డబ్బును నేరుగా క్రెడిట్ కార్డ్ బాకీలు తీర్చడానికే కేటాయించాలి. సరైన ఆర్థిక ప్రణాళిక ఉంటే ఎంతటి పెద్ద అప్పునైనా క్రమపద్ధతిలో సులువుగా తగ్గించుకోవచ్చు.

డిజిటల్ పేమెంట్లు ఆపి.. నగదు వాడటం అలవాటు చేసుకోండి

కార్డులు, యూపీఐ ద్వారా సులువుగా స్కానింగ్ చేసే సదుపాయం ఉండటంతో మనకు తెలియకుండానే ఎక్కువ ఖర్చు చేసేస్తుంటాం. ఈ అలవాటుకు చెక్ పెట్టడానికి కొంతకాలం పాటు అన్ని రకాల డిజిటల్, కార్డ్ లావాదేవీలను పక్కన పెట్టండి. చేతిలో ఉన్న ప్రత్యక్ష నగదుతోనే చెల్లింపులు చేయడం ప్రారంభించండి. చేతి నుంచి నోట్లు బయటకు వెళ్తున్నప్పుడు ఖర్చు చేసే విధానంపై నియంత్రణ వస్తుంది. ఇది మీ వ్యయాన్ని గణనీయంగా తగ్గించి, మిగిలిన సొమ్మును అప్పుల విముక్తి కోసం ఉపయోగపడేలా చేస్తుంది.

Next Story