Credit Card: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా?..ఈ ఒక్క తప్పు చేస్తే జేబు ఖాళీ
ఈ ఒక్క తప్పు చేస్తే జేబు ఖాళీ

Credit Card: ఉద్యోగులకు, నెలాఖరులో చేతిలో డబ్బులు లేక ఇబ్బందిపడే వారికి క్రెడిట్ కార్డ్ ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ టూల్. అత్యవసర సమయంలో లేదా పెద్ద మొత్తం లో షాపింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి. అయితే చాలామంది క్రెడిట్ కార్డులపై పడే భారీ వడ్డీ రేట్లను చూసి భయపడి వాటికి దూరంగా ఉంటారు. ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి వీటిని వాడుతూనే, ఒక్క రూపాయి కూడా అదనంగా కట్టకుండా ఉండే మార్గాలు మన చేతుల్లోనే ఉన్నాయి.
45 నుంచి 50 రోజుల గ్రేస్ పీరియడ్‌ను వాడండి
బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 45 నుంచి 50 రోజుల వరకు వడ్డీ లేని సమయాన్ని (గ్రేస్ పీరియడ్) అందిస్తాయి. ఈ వ్యవధిలో మనం ఎంత డబ్బు వాడుకున్నా దానికి ఎలాంటి వడ్డీ పడదు. ప్రతి నెలా బిల్లింగ్ సైకిల్ పూర్తయిన తర్వాత ఇచ్చే గడువు తేదీలోగా మనం వాడిన మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలి. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే బ్యాంక్‌కు ఒక్క పైసా కూడా అదనంగా కట్టాల్సిన అవసరం ఉండదు. ఇది మీ సిబిల్ స్కోరును కూడా మెరుగుపరుస్తుంది.
మినిమం డ్యూ ట్రాప్‌లో పడకండి
చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు మినిమం డ్యూ (కనీస చెల్లింపు) మాత్రమే కట్టడం. బిల్లు వచ్చినప్పుడు బ్యాంకులు మొత్తం బిల్లులో కేవలం 5 శాతం మాత్రమే కట్టే వెసులుబాటు ఇస్తాయి. చాలామంది ఈ ఆప్షన్ ఎంచుకుని హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఇక్కడే పెద్ద ముప్పు దాగి ఉంది. మినిమం అమౌంట్ చెల్లిస్తే లేట్ ఫీజు పడకపోవచ్చు, కానీ మిగిలిన బకాయి మొత్తంపై బ్యాంకులు వార్షికంగా 30 నుంచి 40 శాతం వరకు ఆకాశాన్నంటే వడ్డీలను వసూలు చేస్తాయి.
సమయపాలనతోనే వడ్డీ రహిత ప్రయోజనాలు
క్రెడిట్ కార్డును వడ్డీ లేకుండా వాడాలంటే నెలకు సంబంధించిన బిల్లును ఆఖరి తేదీ వరకు ఆగకుండా 2-3 రోజుల ముందే చెల్లించడం మంచిది. ప్రతి నెలా బిల్లు గడువు తేదీని క్యాలెండర్‌లో గుర్తుపెట్టుకుని లేదా ఆటో-పే ఆప్షన్ పెట్టుకుని పూర్తి బిల్లును చెల్లించాలి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే క్రెడిట్ కార్డ్ అనేది అప్పుల ఊబిగా కాకుండా మీ ఆర్థిక అవసరాలకు కొండంత అండగా నిలుస్తుంది.

