ఈ చిన్న ట్రిక్‎తో చేసేయండి

Aadhaar : భారతదేశంలో గుర్తింపు కార్డు అనగానే మొదట గుర్తుకు వచ్చేది ఆధార్. ఇందులో మన వేలిముద్రలు, కంటిపాప స్కాన్ వంటి అత్యంత కీలకమైన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. అయితే, ఆధార్ కార్డును కేవలం భౌతిక పత్రంగానే కాకుండా, డిజిటల్ ధృవీకరణ కోసం కూడా వాడుతుంటాం. ఈ ధృవీకరణ జరగాలంటే ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటిపి రావడం చాలా ముఖ్యం. మన ఇంట్లో అందరికీ ఆధార్ కార్డులు ఉంటాయి, కానీ అందరికీ వేర్వేరు నంబర్లు ఇవ్వకపోవచ్చు. అటువంటప్పుడు ఎవరి కార్డుకు ఏ నంబర్ లింక్ అయిందనే విషయంలో తరచూ గందరగోళం ఏర్పడుతుంటుంది.

మీ ఆధార్‌కు ఏ మొబైల్ నంబర్ లింక్ అయి ఉందో తెలుసుకోవడానికి మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ముందుగా ఆధార్ అధికారిక వెబ్‌సైట్ uidai.gov.in లోకి వెళ్లాలి. అక్కడ My Aadhaar విభాగంలో Aadhaar Services అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని కింద ఉండే Verify Email/Mobile Number అనే లింక్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, మీరు ఏ మొబైల్ నంబర్ అయితే లింక్ అయి ఉంటుందని అనుకుంటున్నారో ఆ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఒకవేళ ఆ నంబర్ కరెక్ట్ అయితే, మీకు ఓటిపి వస్తుంది. ఒకవేళ ఆ నంబర్ తప్పు అయితే, ద రికార్డ్స్ డు నాట్ మ్యాచ్ అని చూపిస్తుంది.

కేవలం మొబైల్ నంబర్ మాత్రమే కాదు, మీ ఈమెయిల్ ఐడీని కూడా ఇదే పద్ధతిలో వెరిఫై చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో ఆధార్‌కు సంబంధించిన మోసాలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి, మీ ఆధార్‌కు మీ నంబర్ మాత్రమే లింక్ అయి ఉందో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం చాలా అవసరం. ఒకవేళ మీ మొబైల్ నంబర్ గనుక ఆధార్‌కు లింక్ అయి ఉండకపోతే, మీరు సమీపంలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి బయోమెట్రిక్ ఇచ్చి కొత్త నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చిన్న పని పూర్తి చేయడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు లేదా బ్యాంకింగ్ సేవలు పొందేటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు.

PolitEnt Media

PolitEnt Media

Next Story