Home Loan : వడ్డీ రేట్లు పెంచని సర్కార్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

Home Loan : సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకూడదని నిర్ణయించింది. గత ఏడాది ఉన్న 7.10 శాతం వడ్డీ రేటునే ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులకు భారీగా ఆర్థిక ప్రయోజనం కలగనుంది.
ఏమిటీ హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలన్నా, కొత్త ఫ్లాట్ కొనాలన్నా లేదా ఉన్న ఇంటిని మరమ్మతు చేయించుకోవాలన్నా ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక రుణ సదుపాయమే ఈ హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్. సాధారణ బ్యాంక్ లోన్ల కంటే ఇది చాలా తక్కువ వడ్డీకి లభిస్తుంది. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తుంది. ఈ వడ్డీ రేటు ఏప్రిల్ 1, 2026 నుంచి మార్చి 31, 2027 వరకు అమల్లో ఉంటుంది.
బ్యాంకుల కంటే తక్కువ వడ్డీ
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో బ్యాంకులు ఇస్తున్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8 శాతం నుంచి 9 శాతం పైగానే ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం 7.10 శాతానికే ఈ రుణాన్ని ఇస్తోంది. అంటే బ్యాంకులతో పోలిస్తే సుమారు 1 నుంచి 2 శాతం వరకు వడ్డీ తక్కువగా ఉంటుంది. ఇది ఉద్యోగులపై నెలవారీ ఈఎంఐ భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అందుకే చాలా మంది కేంద్ర ఉద్యోగులు ప్రైవేట్ బ్యాంకులకు వెళ్లడం కంటే ఈ హెచ్‌బీఏ వైపే మొగ్గు చూపుతున్నారు.
నిర్ణయం వెనుక ఉన్న కారణం ఇదే
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఏప్రిల్ 9, 2026న జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం ఆధారంగా గృహనిర్మాణ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ వడ్డీ రేట్లను సమీక్షిస్తారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులకు ఊరటనివ్వాలని ప్రభుత్వం భావించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇదే 7.10 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల మధ్యతరగతి కేంద్ర ఉద్యోగులు తమ సొంతింటి కలని అతి తక్కువ ఖర్చుతోనే సాకారం చేసుకోవచ్చు.

