కుప్పకూలిన షేర్లు.. ఒక్కరోజే 15 శాతం డౌన్

IDBI Bank : కేంద్ర ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంక్ విక్రయ ప్రక్రియను నిలిపివేయాలని భావిస్తున్నట్లు వార్తలు రావడంతో సోమవారం స్టాక్ మార్కెట్‌లో ఆ బ్యాంక్ షేర్లు భారీగా కుప్పకూలాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఐడీబీఐ బ్యాంక్ షేర్ ధర దాదాపు 15 శాతం మేర పడిపోయి ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. బ్యాంక్ ప్రైవేటీకరణ కోసం ఇప్పటివరకు వచ్చిన బిడ్లను రద్దు చేసి, విక్రయ ప్రక్రియను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం, పొటెన్షియల్ కొనుగోలుదారులు వేసిన ఆర్థిక బిడ్లు ప్రభుత్వం నిర్ణయించిన ఫ్లోర్ ప్రైస్ (కనీస ధర) కంటే చాలా తక్కువగా ఉండటమేనని తెలుస్తోంది.

ఈ బ్యాంక్ ప్రైవేటీకరణ కథ 2021లో మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ, ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు, మేనేజ్‌మెంట్ కంట్రోల్ బదిలీకి అప్పట్లోనే ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి 45.48 శాతం, ఎల్‌ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. ఈ రెండు సంస్థలు కలిసి సుమారు 94 శాతానికి పైగా వాటాను విక్రయించి, బ్యాంక్‌ను పూర్తిగా ప్రైవేట్ పరంచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ తాజా పరిణామాలతో ఈ ప్రక్రియ మళ్ళీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది.

ఈ విక్రయంలో పాల్గొనడానికి కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, ఎమిరేట్స్ ఎన్‌బిడి వంటి దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపినట్లు సమాచారం. అయితే, మన దేశానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్ మాత్రం తాము ఈ రేసులో లేమని గతంలోనే స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వం తనకున్న 30.48 శాతం వాటాను అనుకున్నట్లుగా విక్రయించి ఉంటే, ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.30,215 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చేవి. కానీ బిడ్ల ధర ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే, 2026-27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న రూ.80,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ, అసెట్ మానిటైజేషన్ లక్ష్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఐడీబీఐ విక్రయం అనేది బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటీకరణకు ఒక కీలకమైన పరీక్షగా భావించారు. అయితే, సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఎన్‌ఎస్‌ఈ (NSE) లో బ్యాంక్ షేర్ ధర రూ. 78.42 కి పడిపోయింది. ఇది గత ఏడాది మార్చిలో నమోదైన 52 వారాల కనిష్ట స్థాయి రూ. 71.90 కి అతి చేరువలో ఉండటం గమనార్హం.

PolitEnt Media

PolitEnt Media

Next Story