IDBI Bank Sale : ఐడీబీఐ బ్యాంక్ డీల్ క్యాన్సిల్? కోటక్ బ్యాంక్ వెనకడుగుకు అసలు కారణం ఇదే
కోటక్ బ్యాంక్ వెనకడుగుకు అసలు కారణం ఇదే

IDBI Bank Sale : ఐడీబీఐ బ్యాంక్ విక్రయ వ్యవహారం ఇప్పుడు దేశీయ బ్యాంకింగ్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ బ్యాంక్‌ను కొనుగోలు చేసే రేసులో అందరికంటే ముందు వరుసలో ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ అనూహ్యంగా వెనక్కి తగ్గడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ డీల్ ఎందుకు కుదరలేదు? కోటక్ బ్యాంక్ ఎందుకు వెనకడుగు వేసింది? అనే ప్రశ్నలకు ఆ బ్యాంక్ సీఈఓ అశోక్ వాసాని స్వయంగా సమాధానమిచ్చారు. అసలు మ్యాటర్ అంతా ధర దగ్గరే ఆగిపోయిందని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వ అంచనాలు ఆకాశంలో ఉంటే, మార్కెట్ వాస్తవాలు నేల మీద ఉన్నాయని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
డీల్ ఎందుకు కుదిరినట్టు కాదు?
ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ చాలా కాలంగా సాగుతోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ దీని కోసం అన్ని రకాల అర్హతలను కూడా పూర్తి చేసుకుంది. కానీ, తుది బిడ్డింగ్ సమయానికి కోటక్ వెనక్కి తగ్గింది. దీనిపై సీఈఓ అశోక్ వాసాని మాట్లాడుతూ.. "బ్యాంక్ విలువను ప్రభుత్వం చాలా ఎక్కువగా అంచనా వేసింది. వాస్తవానికి ఆ బ్యాంక్ కండిషన్ కు, ప్రభుత్వం ఆశిస్తున్న ధరకు పొంతన లేదు. అంత భారీ రేటు పెట్టి కొనుగోలు చేయడం వ్యాపారపరంగా లాభదాయకం కాదు" అని స్పష్టం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే, వస్తువు నాణ్యత కంటే రేటు మరీ ఎక్కువగా ఉండటంతో కోటక్ బ్యాంక్ ఈ బేరం వదులుకుంది.
ప్రభుత్వం మొండి పట్టు - తగ్గని రేటు
మరోవైపు, ఐడీబీఐ బ్యాంక్ ధరను తగ్గించడానికి కేంద్ర ఆర్థిక శాఖ అస్సలు ఇష్టపడటం లేదు. బ్యాంక్ ప్రస్తుతం లాభాల్లో ఉందని, అన్ని ఆర్థిక సూచీలు బాగున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. కాబట్టి విలువను తగ్గించే ప్రసక్తే లేదని సంకేతాలిస్తోంది. అయితే, ప్రాథమిక బిడ్డింగ్ లో వచ్చిన ఆఫర్లు ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వ్ ప్రైస్ కంటే చాలా తక్కువగా ఉండటం గమనార్హం. అంటే అమ్మేవాడు కోటి రూపాయలు అడుగుతుంటే, కొనేవాడు పది లక్షలు కూడా ఇవ్వనంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది.
ఫలితాలు ఇచ్చిన షాక్
ఐడీబీఐ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన మార్చి 2026 త్రైమాసిక ఫలితాలు కూడా ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 5% తగ్గి రూ.1,943 కోట్లకు పరిమితమైంది. లాభాల్లో ఈ క్షీణత డీల్ మరింత క్లిష్టంగా మారడానికి కారణమైంది. అదే సమయంలో ఐడీబీఐని కొనుగోలు చేయాలనుకున్న కోటక్ బ్యాంక్ లాభాలు మాత్రం 13.4% పెరిగి రూ. 4,026 కోట్లకు చేరాయి. అంటే పటిష్టంగా ఉన్న కోటక్ బ్యాంక్, బలహీనంగా ఉన్న ఐడీబీఐని భారీ ధర పెట్టి కొనడం వల్ల తమ బ్యాలెన్స్ షీట్ దెబ్బతింటుందని భావించి ఉండవచ్చు.
ముందున్న పరిణామాలు ఏంటి?
కోటక్ బ్యాంక్ తప్పుకోవడంతో ఇప్పుడు ప్రభుత్వం ఇతర కొనుగోలుదారుల కోసం వేట మొదలుపెట్టాలి. కానీ, దేశంలోని ఇతర ప్రధాన బ్యాంకులు కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం తన మొండి పట్టు వీడి ధరను తగ్గించకపోతే, ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ మరికొంత కాలం వాయిదా పడక తప్పదు. మరి భవిష్యత్తులో ఈ డీల్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

