Pakistan Economy : అప్పు లేనిదే గడవదు.. ఐఎంఎఫ్ కాళ్ళ వేళ్ళ పడి నిధులు తెచ్చుకున్న పాకిస్థాన్!
ఐఎంఎఫ్ కాళ్ళ వేళ్ళ పడి నిధులు తెచ్చుకున్న పాకిస్థాన్!

Pakistan Economy : ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) మరోసారి ఊపిరి పోసింది. అప్పుల ఊబిలో ఉన్న ఆ దేశానికి 1.2 బిలియన్ డాలర్ల నిధులను విడుదల చేసేందుకు ఐఎంఎఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తాజా పరిణామం పాక్ ఆర్థిక వ్యవస్థకు ఒక చిన్నపాటి ఊరటనిచ్చే అవకాశం ఉంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్‌ను ఆదుకునేందుకు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సుమారు 1.2 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించింది. ఇందులో ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) కింద ఒక బిలియన్ డాలర్లు, అలాగే వాతావరణ మార్పుల వంటి సమస్యల కోసం రెజాలియన్స్ అండ్ సస్టైనబిలిటీ ఫెసిలిటీ (RSF) కింద మరో 210 మిలియన్ డాలర్లు విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 2024లో అంగీకరించిన 7 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీలో ఇది ఒక భాగం. ఈ నిధులు వచ్చే వారమే పాక్ చేతికి అందనున్నాయి.
పెరగనున్న విదేశీ మారక నిల్వలు
ఈ నిధులు వచ్చి చేరితే పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలు 17 బిలియన్ డాలర్లకు పైగా చేరుతాయని అంచనా. అయితే, ఈ అప్పు ఊరికే రాలేదు. పాక్ ప్రభుత్వం తన పాత ఆర్థిక లక్ష్యాలకు కట్టుబడి ఉండాలని, కఠినమైన బడ్జెట్ నియమాలను పాటించాలని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. ఇప్పటికే దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగినా.. ఐఎంఎఫ్ షరతుల కారణంగా ప్రభుత్వం పన్నులు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది.
నిధుల విడుదలకు ముందు సమీక్ష
జులై-డిసెంబర్ 2025 కాలానికి గాను పాకిస్థాన్ ఆర్థిక పనితీరును ఐఎంఎఫ్ ప్రతినిధులు క్షుణ్ణంగా పరిశీలించారు. అంతర్జాతీయ నిల్వలను మెరుగుపరచడం, ప్రభుత్వ బడ్జెట్ నియంత్రణ వంటి అంశాల్లో పాక్ సాధించిన పురోగతి పట్ల ఐఎంఎఫ్ బోర్డు సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (FBR) ఆశించిన స్థాయిలో పన్నులను వసూలు చేయలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తమైంది. రిటైల్ వ్యాపారుల నుంచి రావాల్సిన ఆదాయం ఐఎంఎఫ్ లక్ష్యాల కంటే తక్కువగా ఉండటంతో ఈ లోటును పూడ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది.
తట్టుకునేందుకు కఠిన సంస్కరణలు
ఐఎంఎఫ్ షరతులలో భాగంగా పాక్ ప్రభుత్వం ఇప్పటికే పెట్రోలియం ఉత్పత్తులపై సుంకాలను పెంచింది. అలా గ్రీన్ టాక్సానమీ వంటి విధానాలను అవలంబిస్తూ పర్యావరణ పరిరక్షణకు కూడా నిధులు కేటాయిస్తోంది. పాక్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం పాటు ఆర్థిక వృద్ధిని సాధించేందుకు కఠినమైన సంస్కరణలను అమలు చేస్తామని ఐఎంఎఫ్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా మధ్యప్రాచ్య యుద్ధాల ప్రభావం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

