Income Tax : కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఏప్రిల్ వచ్చిందంటే కేవలం కొత్త జీతాలు, ఖర్చులే కాదు.. ట్యాక్స్ బాధ్యతలు కూడా మొదలవుతాయి. చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా, భారీ జరిమానాలు కట్టకుండా ఉండాలంటే ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించిన కీలక డెడ్ లైన్ల గురించి ఇప్పుడే తెలుసుకోవడం ఉత్తమం. ట్యాక్స్ ఫైలింగ్ అనేది ఒక క్యాలెండర్ లాంటిది, ప్రతి నెలా మనకు ఒక పనిని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆర్థిక సంవత్సరం మొదలైన ఏప్రిల్ నెలలోనే టీడీఎస్ సర్టిఫికెట్ల జారీ, మార్చి నెలకు సంబంధించిన పన్ను జమ వంటి పనులను పూర్తి చేయాలి. ఇక మే నెలలో గత నెలకు సంబంధించిన టీడీఎస్, టీసీఎస్ వివరాలను ఫైల్ చేయాల్సి ఉంటుంది. జూన్ నెల మరింత కీలకం. ఎందుకంటే జూన్ 15 లోపు అడ్వాన్స్ ట్యాక్స్ మొదటి విడతను చెల్లించాలి. ఈ పనులను సకాలంలో పూర్తి చేస్తే, మిగిలిన సంవత్సరం ప్రశాంతంగా గడిచిపోతుంది.

సాధారణ ఉద్యోగులకు, చిన్న ట్యాక్స్ పేయర్లకు జూలై అత్యంత కీలకమైన నెల. జూలై 31వ తేదీయే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆఖరి గడువు. ఆడిట్ అవసరం లేని ప్రతి ఒక్కరూ ఈ తేదీ లోపే తమ రిటర్న్స్‌ను దాఖలు చేయాలి. ఒకవేళ ఏవైనా బకాయిలు ఉంటే వాటిని కూడా వడ్డీ పడకుండా ఇప్పుడే చెల్లించడం మేలు. లేకపోతే భారీ పెనాల్టీలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో అడ్వాన్స్ ట్యాక్స్ తదుపరి విడతలను చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే వ్యాపారాలు చేస్తూ భారీ ఆదాయాన్ని ఆర్జిస్తారో వారికి ఇది చాలా ముఖ్యం. ఇక ఎవరికైతే ఆడిట్ అవసరమో (బిజినెస్ ఆడిట్ కేసులు), వారికి ఐటీఆర్ ఫైలింగ్ గడువు సాధారణంగా అక్టోబర్ 31 వరకు ఉంటుంది. అలాగే అంతర్జాతీయ లావాదేవీలు ఉన్నవారికి ప్రత్యేక గడువులు వర్తిస్తాయి.

ఏదైనా కారణం వల్ల జూలైలో ఐటీఆర్ ఫైల్ చేయలేకపోతే, డిసెంబర్ 31 వరకు లేట్ రిటర్న్ లేదా రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. అయితే దీనికి పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఇక ట్యాక్స్ ఆదా చేయడానికి పెట్టుబడులు పెట్టాలనుకుంటే, మార్చి 31వ తేదీనే ఆఖరి అవకాశం. కాబట్టి నెలవారీగా పన్ను క్యాలెండర్‌ను అనుసరిస్తే, ఆర్థికంగా చిక్కులు రాకుండా పక్కా ప్లానింగ్‌తో ఉండవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story