Income Tax : దేశంలోని పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ అత్యంత కీలకమైన అప్‌డేట్ అందించింది. అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 సంవత్సరానికి గాను ఐటీఆర్-2 ఆన్‌లైన్ ఫైలింగ్ ఆప్షన్‌ను, ఎక్సెల్ యుటిలిటీని ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనితో అర్హులైన టాక్స్ పేయర్స్ అందరూ ఇప్పుడే తమ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసుకోవచ్చు. అయితే ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే నేరుగా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుండి నోటీసులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఐటీఆర్-2 ఫామ్ నింపడానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి ఆలస్యం చేయకుండా ఈ ఏడాది జూలై 31, 2026 లోపు తమ రిటర్న్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం డెడ్‌లైన్ పొడిగిస్తే తప్ప ఈ తేదీ లోపే ఫైలింగ్ ముగించడం మంచిది. చివరి నిమిషం వరకు ఆగితే పోర్టల్‌పై లోడ్ పెరిగి తప్పులు జరిగే అవకాశం ఉంటుంది, అలాగే రీఫండ్ రావడంలో కూడా లేట్ అవుతుంది. మీ టాక్స్ లయబిలిటీ సున్నా అయినప్పటికీ, మీ ఆదాయం గరిష్ట పరిమితి కంటే ఎక్కువ ఉంటే ఐటీఆర్ దాఖలు చేయడం చట్టప్రకారం తప్పనిసరి.

అసలు ఐటీఆర్-2 ఎవరెవరు ఫైల్ చేయాలి?

ఐటీఆర్-2 ఫామ్ అనేది వ్యాపారం లేదా సొంత వృత్తి ద్వారా ఆదాయం లేని వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాల కోసం ఉద్దేశించబడింది. సాధారణంగా జీతాలు తీసుకునే ఉద్యోగులు, పెన్షనర్లు, ఒకరి కంటే ఎక్కువ ఇళ్లు ఉండి అద్దె ఆదాయం వచ్చేవారు ఈ ఫామ్‌ను ఉపయోగించాలి. అలాగే షేర్లు లేదా ఆస్తులను అమ్మడం ద్వారా క్యాపిటల్ గెయిన్స్ పొందే లాంటి సంక్లిష్టమైన ఆదాయ వనరులు ఉన్నవారికి ఐటీఆర్-2 అవసరమవుతుంది.

పెట్టుబడిదారులు, షేర్ మార్కెట్ ట్రేడర్లకు ఇది ముఖ్యం

మీరు గత ఆర్థిక సంవత్సరంలో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ప్లాట్లు లేదా ఇళ్లను అమ్మి లాభాలు గడించి ఉంటే ఖచ్చితంగా ఐటీఆర్-2 మాత్రమే ఫైల్ చేయాలి. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వివరాలన్నింటినీ ఇందులో స్పష్టంగా చూపించాల్సి ఉంటుంది. అందుకే పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు చేసే వారికి, ఎక్కువ ఆస్తులు ఉన్న వారికి ఇది అత్యంత ముఖ్యమైన రిటర్న్ ఫామ్ అని చెప్పవచ్చు.

ఆదాయం రూ.50 లక్షలు దాటితే ఐటీఆర్-2 తప్పనిసరి

ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి మొత్తం వార్షిక ఆదాయం రూ.50 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, వారు ఐటీఆర్-1 ఫైల్ చేయడానికి వీలుండదు. వారు ఖచ్చితంగా ఐటీఆర్-2నే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా విదేశాల్లో నివసించే ఎన్నారైలు, ఆర్‌ఎన్‌ఓఆర్ స్టేటస్ ఉన్నవారు, ఏదైనా కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నవారు, అన్‌లిస్టెడ్ కంపెనీల షేర్లు కలిగి ఉన్న వ్యక్తులు కూడా తమ అదనపు వివరాలను చూపించడానికి ఐటీఆర్-2 నే వాడాలి.

విదేశీ ఆస్తులు, లాటరీ ఆదాయం ఉన్నా సరే

కేవలం జీతాలే కాకుండా లాటరీలు, గుర్రపు పందాల్లో గెలిచిన డబ్బులు లేదా ఇతర అయాచితంగా వచ్చిన ఆదాయాల వివరాలను కూడా ఐటీఆర్-2 లోనే పొందుపరచాలి. అలాగే రూ.5,000 కంటే ఎక్కువ వ్యవసాయ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు కూడా ఈ ఫామ్ నింపాల్సి రావచ్చు. ముఖ్యంగా విదేశాలలో ఆస్తులు ఉన్నా, అక్కడ బ్యాంక్ అకౌంట్లు ఉన్నా లేదా విదేశాల నుండి ఏదైనా ఆదాయం వస్తున్నా వాటి పూర్తి సమాచారాన్ని ఈ రిటర్న్‌లో పక్కాగా చూపించడం చట్టరీత్యా అవసరం.

నోటీసులు రాకుండా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి

చాలామంది టాక్స్ పేయర్స్ క్యాపిటల్ గెయిన్స్ లెక్కించడంలో లేదా వాటిని తప్పుడు కేటగిరీలో చూపించడంలో పెద్ద తప్పులు చేస్తుంటారని టాక్స్ నిపుణులు చెప్తున్నారు. అలాగే ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన షెడ్యూల్ 112A వివరాలను సగం సగమే నింపుతుంటారు. మీ రెసిడెన్షియల్ స్టేటస్ (నివాసి లేదా ప్రవాసి) సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోయినా టాక్స్ లెక్కింపు మారిపోతుంది. కాబట్టి ఐటీఆర్-2 ఫైల్ చేసే ముందు మీ ఫామ్ 26AS, ఏఐఎస్‎లతో మీ ఆదాయాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం మర్చిపోకండి. మీ బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులు, ఆభరణాల వివరాలు కరెక్ట్‌గా ఇస్తే ఎలాంటి నోటీసులు, పెనాల్టీల భయం ఉండదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story