Income Tax : ఆదాయపు పన్ను శాఖ పన్ను ఎగవేతదారులకు, తప్పుడు డిడక్షన్స్ పొందే వారికి గట్టి షాక్ ఇచ్చింది. అడ్వాన్సుడ్ కంప్యూటర్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్ సాయంతో తప్పుడు ఆధారాలు చూపి పన్ను తగ్గించుకునే వారిని ఐటీ శాఖ గుర్తించింది. ఈ విషయాన్ని కేంద్ర విత్త సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో అధికారికంగా వెల్లడించారు. తప్పుడు పన్ను మినహాయింపులను పొందేందుకు కొందరు వ్యక్తులు, కంపెనీలు, మధ్యవర్తులు కలిసి చేస్తున్న మోసాలను తనిఖీల ద్వారా బయటపెట్టినట్లు తెలిపారు.

డేటా అనలిటిక్స్‌తో మోసాలను ఎలా పట్టుకుంటున్నారు?

ప్రస్తుతం ఐటీ శాఖ డిజిటల్ సిస్టమ్ ద్వారా పన్ను చెల్లింపుదారుల సమగ్ర సమాచారాన్ని విశ్లేషిస్తోంది. బ్యాంక్ లావాదేవీలు, జీఎస్టీ రికార్డులు, టీడీఎస్, టీసీఎస్ వివరాలు, ఆస్తుల కొనుగోలు రికార్డులను ఐటీ సిస్టమ్ ఆటోమేటిక్ గా నిశితంగా పరిశీలిస్తుంది. ఎవరైనా తమ అసలు ఆదాయాన్ని తగ్గించి చూపించినా లేదా అర్హత లేకపోయినా ఎక్కువగా టాక్స్ మినహాయింపులు క్లెయిమ్ చేసినా ఈ డేటా అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్ వెంటనే రెడ్ ఫ్లాగ్ చూపిస్తుంది. దీంతో సంబంధిత పన్ను చెల్లింపుదారుల రికార్డులను అధికారులు సమగ్రంగా తనిఖీ చేస్తున్నారు.

సక్షమ్ నడ్జ్ తో సరిదిద్దుకునే అవకాశం!

పన్ను చెల్లింపుదారులు చేసిన తప్పులను స్వచ్ఛందంగా సరిదిద్దుకునేందుకు ఐటీ శాఖ సక్షమ్ నడ్జ్ అనే ప్రత్యేక అవగాహనా ప్రచారాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో పొరపాట్లు లేదా తప్పుడు క్లెయిమ్‌లు చేసిన వారికి నోటీసులు పంపే ముందుగా హెచ్చరికలు లేదా అలర్ట్‌లు పంపుతారు. వినియోగదారులు నిర్దేశిత గడువులోగా తమ రిటర్న్‌లలోని తప్పులను సరిదిద్దుకుని, సరైన సమాచారంతో సవరించిన రిటర్న్‌లను దాఖలు చేయవచ్చని అధికారులు వెల్లడించారు.

నకిలీ క్లెయిమ్‌లు చేయించే ఏజెంట్లపై కఠిన చర్యలు

తప్పుడు పన్ను దావాలు వేయడంలో పన్ను చెల్లింపుదారులకు సాయం చేస్తున్న కొందరు రిటర్న్ ప్రిపేరర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, మధ్యవర్తుల గుర్తింపును ఐటీ శాఖ ఇతర విచారణ సంస్థల సాయంతో పూర్తి చేసింది. ఇటువంటి అక్రమ మార్గాలను ప్రోత్సహించే వారిపై ఈ-వెరిఫికేషన్, సర్వేలు, సోదాలు, పునర్విచారణ, జరిమానాలు విధించడమే కాకుండా అవసరమైతే క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story