Income Tax: ఐటీ రీఫండ్ ఇంకా రాలేదా? తప్పుగా నోటీసు వచ్చిందా?.. ఇలా కంప్లైంట్ చేయండి
ఇలా కంప్లైంట్ చేయండి

Income Tax: దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్ దాఖలు చేశాక తమ ఖాతాలోకి డబ్బులు ఎప్పుడు జమ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఆదాయ పన్ను శాఖ ఈసారి వేగంగా రిటర్నులను ప్రాసెస్ చేసినప్పటికీ, వేలాది మందికి రీఫండ్ల రాక ఆలస్యమవుతోంది. బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో తప్పులు దొర్లడం, పన్ను రికార్డులలో వ్యత్యాసాలు ఉండటం లేదా ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల ఇవి నిలిచిపోతుంటాయి. ఇటువంటి పరిస్థితులలో భయాందోళన చెందకుండా ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.
ఈ-ఫైలింగ్ పోర్టల్ వేదికగా రీఫండ్ ఫిర్యాదు చేసే మార్గం
రీఫండ్ ఇంకా జమ కాకపోతే ముందుగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ ప్రాసెసింగ్ నిలిచిపోయినట్లు తేలితే, పోర్టల్‌లోని Submit Grievance ఆప్షన్ ద్వారా నేరుగా ఐటీ శాఖ దృష్టికి తీసుకెళ్లవచ్చు. దీనితో పాటు ఐటీ శాఖ హెల్ప్‌డెస్క్ కాల్ సెంటర్ నంబర్లు 1800 103 0025, 1800 419 0025 లేదా +91-80-46122000, +91-80-61464700 లకు సంప్రదించి సమాచారం తెలుసుకోవచ్చు. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
తప్పుడు ఆదాయ పన్ను నోటీసులు వస్తే ఏం చేయాలి?
అంచనా వేసిన ఆదాయంలో తేడాలు, టీడీఎస్ లెక్కల్లో పొరపాట్లు లేదా అదనపు పన్ను డిమాండ్ చేస్తూ నోటీసు అందిన సందర్భంలో సాధారణ ఫిర్యాదు చేస్తే సరిపోదు. అటువంటి సమయంలో ఈ-ఫైలింగ్ పోర్టల్ లాగిన్ అయి 'Response/Submit Response' లేదా 'Rectification' అనే ప్రత్యమ్నాయాన్ని ఎంచుకోవాలి. ప్రభుత్వం పంపిన నోటీసులోని డిమాండ్‌పై మీ వద్ద ఉన్న ఆధారాలను అప్‌లోడ్ చేస్తూ స్పందించాల్సి ఉంటుంది. దీనివల్ల శాఖాధికారులు మీ దరఖాస్తును పునఃపరిశీలించి తగిన ఉపశమనం కలిగిస్తారు.
ఫిర్యాదు పరిస్కారం కాకపోతే తదుపరి చర్యలు
ఒకసారి గ్రీవెన్స్ సబ్మిట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన టికెట్ నంబరును జాగ్రత్తగా దాచుకోవాలి. దాని సహాయంతో ఎప్పటికప్పుడు స్టేటస్ ట్రాక్ చేయవచ్చు. అధికారుల నుంచి సరైన స్పందన రాకపోయినా, లేదా మీ ఫిర్యాదు పెండింగ్‌లో ఉన్నా ఉన్నతాధికారులకు లేదా ఆయా ప్రాంతీయ గ్రీవెన్స్ అధికారులకు అపీల్ చేసుకునే వెసులుబాటు కలదు. ట్యాక్స్ రికార్డుల్లో స్పష్టత ఉంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి ప్రతిబంధకాలకు అడ్డుకట్ట వేయవచ్చు.

