ITR Filing : పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఐటీఆర్ గడువు తేదీలలో ఊహించని మార్పులు
ఐటీఆర్ గడువు తేదీలలో ఊహించని మార్పులు

ITR Filing : ఆదాయ పన్ను శాఖ ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించి టాక్స్ ఫైలింగ్ క్యాలెండర్‌లో కీలక మార్పులు చేసింది. మీరు గనుక ఉద్యోగం చేసేవారైతే మీకోసం పాత నిబంధనలే వర్తిస్తాయి. కానీ, టాక్స్ ఆడిట్ పరిధిలోకి రాని చిన్న వ్యాపారస్తులకు, ఫ్రీలాన్సర్లు లేదా వివిధ వృత్తుల్లో ఉన్న నిపుణులకు మాత్రం ఆదాయ పన్ను శాఖ భారీ ఊరటనిచ్చింది. వీరందరికీ ఐటీఆర్ దాఖలు చేయడానికి ఒక నెల అదనపు సమయాన్ని కేటాయించింది. దీనితో పాటు, ఒకవేళ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఏవైనా పొరపాట్లు జరిగితే, వాటిని సరిదిద్దుకోవడానికి కూడా మునుపటి కంటే ఎక్కువ సమయాన్ని ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
ఎవరికి ఊరట లభించింది?
ఇన్కమ్ టాక్స్ శాఖ ప్రవేశపెట్టిన ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం.. అతిపెద్ద మార్పు ఐటీఆర్-3, ఐటీఆర్-4 ఫారమ్‌లను ఫైల్ చేసే వారి కోసం చేయబడింది. తమ వ్యాపార లేదా వృత్తిపరమైన ఆదాయంపై ఎలాంటి టాక్స్ ఆడిట్ అవసరం లేని చిన్న వ్యాపారస్తులు, ఫ్రీలాన్సర్లు ఇకపై జూలై 31కి బదులుగా ఆగస్టు 31, 2026 వరకు తమ టాక్స్ రిటర్న్స్‌ను సమర్పించవచ్చు. సాధారణంగా ఫ్రీలాన్సర్లు లేదా చిన్న వ్యాపారస్తుల బ్యాలెన్స్ షీట్ ఫైనల్ కావడానికి కొంత సమయం పడుతుంది, కాబట్టి ఈ అదనపు నెల రోజుల గడువు వారికి చాలా బాగా ఉపయోగపడనుంది. మరోవైపు, జీతాలు వచ్చే ఉద్యోగులు, పెన్షనర్లు, క్యాపిటల్ గెయిన్స్ కలిగి ఉండి ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 ఫారమ్‌లు నింపే పన్ను చెల్లింపుదారులకు మాత్రం ఎలాంటి మార్పు లేదు. వీరు పాత గడువు అయిన జూలై 31, 2026 లోపే తమ ఐటీఆర్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.
పొరపాట్లను సరిదిద్దుకోవడానికి లభించిన అదనపు అవకాశం
చాలా సందర్భాలలో టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు సెక్షన్ 80C కింద మినహాయింపులు క్లెయిమ్ చేయడం మర్చిపోతుంటారు. లేదా బ్రోకర్ల నుంచి స్టేట్‌మెంట్లు ఆలస్యంగా రావడం వల్ల క్యాపిటల్ గెయిన్స్ ఖచ్చితమైన వివరాలను నమోదు చేయలేకపోతుంటారు. గతంలో ఇలాంటి తప్పులను సరిచేసుకుంటూ రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేయడానికి ఆయా అసెస్మెంట్ ఇయర్ డిసెంబర్ 31 వరకు మాత్రమే గడువు ఉండేది. ఇప్పుడు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ గడువును భారీగా పెంచుతూ మార్చి 31, 2027 వరకు సమయం ఇచ్చింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారుల వార్షిక సమాచార నివేదిక (AIS)లో ఏవైనా తేడాలు ఉంటే, వాటిని సరిచేసుకోవడానికి పూర్తి మూడు నెలల అదనపు సమయం దొరికినట్లయింది.
వివిధ కేటగిరీల కొత్త గడువు తేదీల పూర్తి సమాచారం
ఆదాయ పన్ను శాఖ ప్రకటించిన కొత్త క్యాలెండర్ ప్రకారం.. జీతం, పెన్షన్, క్యాపిటల్ గెయిన్స్ ద్వారా ఆదాయం పొంది ఐటీఆర్-1, ఐటీఆర్-2 దాఖలు చేసేవారికి చివరి తేదీ జూలై 31, 2026గా ఉంది. అలాగే, ఎలాంటి ఆడిట్ అవసరం లేని వ్యాపార లేదా ప్రొఫెషనల్ ఆదాయం ఉండి ఐటీఆర్-3, ఐటీఆర్-4 ఫైల్ చేసేవారికి చివరి తేదీని ఆగస్టు 31, 2026 వరకు పొడిగించారు. ఒకవేళ వ్యాపారానికి టాక్స్ ఆడిట్ గనుక అవసరమైతే, అటువంటి కేసులలో ఐటీఆర్-3, ఐటీఆర్-4 దాఖలు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 31, 2026గా నిర్ణయించబడింది.
ఇక అంతర్జాతీయ లేదా దేశీయ లావాదేవీల కొరకు ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ రిపోర్ట్ సమర్పించాల్సిన వ్యాపార సంస్థలకు చివరి తేదీ నవంబర్ 30, 2026 కాగా.. గడువు ముగిసిన తర్వాత జరిమానాతో లేట్ ఫైలింగ్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2026 వరకు అవకాశం ఉంటుంది. పైన చెప్పుకున్నట్లుగా రిటర్న్స్‌లో తప్పులను సరిదిద్దుకునే రివైజ్డ్ రిటర్న్ కోసం మార్చి 31, 2027 వరకు గడువు ఇవ్వగా, గతంలో అస్సలు ఫైల్ చేయని లేదా భారీగా ఆదాయాన్ని చూపించని వారు అప్‌డేటెడ్ రిటర్న్ దాఖలు చేయడానికి మార్చి 31, 2031 వరకు సుదీర్ఘ సమయాన్ని కేటాయించారు.

