Income Tax Rules : ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కమ్ టాక్స్ రూల్స్.. ఈ మార్పులు తెలిస్తే పన్ను ఆదా సులభం
ఈ మార్పులు తెలిస్తే పన్ను ఆదా సులభం

Income Tax Rules : వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం కావడానికి ముందే పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ అండ్ సర్ప్రైజ్ ఇచ్చింది. 'ఆదాయపు పన్ను నిబంధనలు 2026' పేరుతో సరికొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి పన్ను స్లాబ్‌లలో మార్పులు లేకపోయినా, మనం రోజూ వాడే అలవెన్సులు, డిజిటల్ లావాదేవీల నియమాల్లో భారీ మార్పులు చేసింది. ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త రూల్స్ వల్ల కొందరికి జీతం పెరిగినంత ఆనందం కలిగితే, మరికొందరికి నిరాశ తప్పదు.
హైదరాబాద్, బెంగళూరు వాసులకు బంపర్ ఆఫర్
ఇన్నాళ్లూ కేవలం ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో ఉండేవారికి మాత్రమే 50 శాతం హెచ్‌ఆర్‌ఏ పన్ను మినహాయింపు ఉండేది. మిగిలిన నగరాల వారికి 40 శాతమే వర్తించేది. కానీ ఇప్పుడు కేంద్రం ఈ జాబితాను పెంచింది. హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ వంటి నగరాల్లో పనిచేసే సాఫ్ట్‌వేర్ మరియు కార్పొరేట్ ఉద్యోగులు ఇకపై 50 శాతం హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పొందవచ్చు. దీనివల్ల మీ చేతికి వచ్చే జీతం పెరుగుతుంది. అయితే, నోయిడా, గురుగ్రామ్ వంటి నగరాల్లో ఉండే వారికి మాత్రం ఇంకా 40 శాతమే కొనసాగించడం గమనార్హం.
ఎలక్ట్రిక్ వాహనదారులకు పన్ను రాయితీలు
పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వాహనాలు వాడే వారికి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చే ఈవీ అలవెన్సులపై ఇక నుంచి పన్ను మినహాయింపు స్పష్టంగా ఉంటుంది. ఒకవేళ ఆ ఈవీ కారు ఖర్చు కంపెనీ భరిస్తే నెలకు రూ.5,000 (డ్రైవర్ ఉంటే మరో రూ.3,000) వరకు పన్ను రాయితీ పొందవచ్చు. అదే సొంతంగా ఈవీ మెయింటైన్ చేస్తే నెలకు రూ.2,000 రాయితీ లభిస్తుంది. పాత కాలం నాటి ఇంజిన్ సామర్థ్యం (CC) లెక్కల స్థానంలో ఈవీల కోసం ప్రత్యేక నిబంధనలు రావడం నిజంగా గొప్ప విషయం.
క్రిప్టో, డిజిటల్ కరెన్సీలపై నిఘా
ప్రభుత్వం ఇప్పుడు టెక్నాలజీన వాడుకుని టాక్స్ దొంగలను పట్టేయాలని చూస్తోంది. క్రిప్టో కరెన్సీలు, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు లేదా ఇతర ఈ-మనీ వాడుతున్నారా? అయితే జాగ్రత్త! ఇకపై ఈ లావాదేవీలన్నీ ఆదాయపు పన్ను శాఖకు స్పష్టంగా నివేదించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం డిజిటల్ ఆస్తుల నుంచి వచ్చే లాభాలపై నిఘా పెంచారు. మీరు దేశంలో ఉన్నా, విదేశాల్లో డిజిటల్ ట్రేడింగ్ చేసినా టాక్స్ కట్టాల్సిందే.
ట్రస్టులు, బిజినెస్ రూల్స్ సరళీకృతం
చారిటబుల్ ట్రస్టులు నడిపే వారికి ప్రభుత్వం పనిని సులభతరం చేసింది. రిజిస్ట్రేషన్ కోసం ఇకపై పదుల కొద్దీ ఫారాలు నింపక్కర్లేదు, ఒకే ఒక ఫారంతో పని పూర్తవుతుంది. అలాగే మునుపటిలా 10 ఏళ్ల రికార్డులను భద్రపరచాల్సిన అవసరం లేదు, 6 ఏళ్ల రికార్డులు ఉంటే సరిపోతుంది. డేటా సెంటర్ సేవలను కూడా పన్ను పరిధిలోకి తెస్తూ నిబంధనలను కట్టుదిట్టం చేశారు. దీనివల్ల కార్పొరేట్ సంస్థలకు కాస్త ఊరట లభించనుంది.

