Income Tax: రక్షాబంధన్ వేళ సోదరులు తమ అక్కాచెల్లెళ్లకు ఇచ్చే కానుకల విషయంలో ఆదాయపు పన్ను శాఖ కీలక నిబంధనలు అమలు చేస్తోంది. సొంత అన్నయ్య ఇచ్చే గిఫ్ట్ ఎంతైనా పన్ను మినహాయింపు ఉంటుంది. అదే వరుసకు సోదరులు లేదా స్నేహితులు ఇచ్చే కానుకలు యాభై వేల రూపాయిలు దాటితే ఐటీ పన్ను పడుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2)(x) ప్రకారం బంధువుల నుంచి లభించే కానుకలకు పన్ను నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. చట్టప్రకారం బంధువుల జాబితాలో తోడబుట్టిన సోదరుడు ఉంటాడు. రాఖీ పండుగకు సొంత అన్నయ్య ఎంతటి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినా చెల్లెలు రూపాయి కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు అన్నయ్య లక్ష రూపాయిల నగదుతో పాటు రెండు లక్షల విలువైన బంగారు గొలుసు ఇచ్చినప్పటికీ, ఆ మొత్తంపై ఐటీ శాఖకు ఒక్క పైసా కట్టక్కర్లేదు.

కజిన్స్ ఇచ్చే కానుకల విషయంలో జాగ్రత్త తప్పనిసరి

చాలా కుటుంబాలు బంధుత్వాల విషయంలో ఒక చిన్న పొరపాటు చేస్తుంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం సొంత అన్నదమ్ములను బంధువులుగా గుర్తించినప్పటికీ, బాబాయ్ లేదా పెద్దనాన్న కొడుకులను (కజిన్స్) ఆ బంధువుల జాబితా నుంచి మినహాయించారు. ఉదాహరణకు సొంత సోదరుడు రూ.75 వేల విలువైన గిఫ్ట్ ఇస్తే టాక్స్ పడదు. అదే రూ.75 వేల విలువైన కానుకను బాబాయ్ కొడుకు ఇస్తే మాత్రం ఆ మొత్తంపై పూర్తి పన్ను చెల్లించాల్సిందే. ఆర్థిక సంవత్సరంలో స్నేహితులు లేదా కజిన్స్ నుంచి వచ్చిన కానుకల మొత్తం రూ.50 వేలు దాటితే మొత్తం అమౌంట్‌ను ఇతర రూపాల నుంచి వచ్చిన ఆదాయంగా పరిగణించి పన్ను విధిస్తారు.

రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు తీసుకుంటే భారీ జరిమానా

అభిమానంతో అన్నయ్య ఎంత పెద్ద మొత్తాన్ని అయినా కానుకగా ఇవ్వవచ్చు, కానీ నగదు రూపంలో ఇచ్చేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 269ST ప్రకారం ఏ ఒక్క వ్యక్తి నుంచి కూడా ఒక్క రోజులో రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు స్వీకరించకూడదు. సొంత అన్నయ్య కానుకగా ఇచ్చినా సరే, రూ.2 లక్షల నగదు తీసుకుంటే సెక్షన్ 271DA కింద తీసుకున్న మొత్తానికి సమానమైన 100 శాతం జరిమానా విధించే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో కానుకలు ఇవ్వాలనుకున్నప్పుడు బ్యాంక్ చెక్, నెఫ్ట్ లేదా యుపిఐ మార్గాల ద్వారా పంపడమే సురక్షితం.

ఆస్తి కానుకలు, డిపాజిట్లపై వచ్చే వడ్డీకి పన్ను నిబంధనలు

రాఖీ సందర్భంగా ఫ్లాట్ లేదా ప్లాట్ వంటి స్థిరాస్తులను గిఫ్ట్‌గా ఇచ్చినప్పుడు కూడా కొన్ని రూల్స్ వర్తిస్తాయి. సొంత అన్నయ్య రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ద్వారా ఎంత విలువైన ఆస్తిని ఇచ్చినా టాక్స్ ఉండదు. అదే స్నేహితులు ఇస్తే స్టాంప్ డ్యూటీ విలువ ఆధారంగా పన్ను కట్టాలి. ఇక అన్నయ్య ఇచ్చిన డబ్బులను చెల్లెలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, దానిపై వచ్చే వడ్డీ ఆదాయానికి సదరు చెల్లెలే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Next Story