UPI : ఇక ఫారిన్ అతిథులు కూడా క్యూఆర్ కోడ్ చూపించు భయ్యా అంటారు..యూపీఐ వన్ వరల్డ్ ధమాకా
యూపీఐ వన్ వరల్డ్ ధమాకా

UPI : న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సరికొత్త సాంకేతిక విప్లవానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఒకవైపు ప్రపంచ దిగ్గజాలు కృత్రిమ మేధ పై మేధోమథనం చేస్తుంటే, మరోవైపు భారత్ తన డిజిటల్ చెల్లింపుల సత్తాను ప్రపంచానికి చాటిచెప్పేందుకు సిద్ధమైంది. విదేశీయులకు సైతం చిల్లర కష్టాలు లేకుండా, నగదుతో పనిలేకుండా చెల్లింపులు చేసుకునేలా యూపీఐ వన్ వరల్డ్ వాలెట్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. ఇకపై విదేశీ అతిథులు కూడా మనలాగే స్టైల్‌గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి భయ్యా.. పేమెంట్ అయిపోయింది అని చెప్పే రోజులు వచ్చేశాయి.
సాధారణంగా విదేశీయులు భారత్ వచ్చినప్పుడు పేమెంట్స్ చేయడం పెద్ద సమస్యగా ఉండేది. కానీ ఈ వాలెట్ ద్వారా 40 కంటే ఎక్కువ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు స్థానికుల తరహాలోనే డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. దీనికి భారతీయ బ్యాంక్ అకౌంట్ కానీ, లోకల్ మొబైల్ నంబర్ కానీ అవసరం లేదు. కేవలం తమ ఫోన్‌లో యాప్ ఉంటే చాలు. ఢిల్లీ వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ ఆస్వాదించినా, భారతీయ కళాఖండాలు కొనుగోలు చేసినా.. కేవలం ఒక్క స్కాన్‌తో పని పూర్తవుతుంది. ఇది విదేశీ పర్యాటకుల అనుభవాన్ని మరింత మధురంగా మార్చనుంది.
ఈ వాలెట్ పొందడం చాలా సులభం. ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే దిగగానే ఈ సౌకర్యం పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. అలాగే సమ్మిట్ జరుగుతున్న భారత్ మండపంలో హాల్ నంబర్ 14 దగ్గర ఎన్‌పీసీఐ ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ పర్యాటకులు తమ వాలెట్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇందులో విదేశీ అతిథులు తమకు నచ్చినంత డబ్బును లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ వాలెట్‌లో డబ్బులు మిగిలిపోతే, పర్యాటక నిబంధనల ప్రకారం తిరిగి వారి మాతృదేశ కరెన్సీలోకి మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది.
ఈ డిజిటల్ వాలెట్‌ను యాక్టివేట్ చేయడం సోషల్ మీడియా యాప్ వాడటం కంటే సులభం. CheqUPI అనే యాప్ ద్వారా పర్యాటకులు ఈ సేవలను పొందవచ్చు. మొదట ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. పేరు, ఇమెయిల్ వంటి ప్రాథమిక వివరాలు ఇచ్చి ఫారం పూర్తి చేయాలి. సేఫ్టీ కోసం పాస్‌పోర్ట్, వీసా పత్రాలను అప్‌లోడ్ చేసి ఒక సెల్ఫీ తీసుకోవాలి. వెంటనే యూపీఐ పిన్ సెట్ చేసుకుంటే యూనిక్ యూపీఐ ఐడీ క్రియేట్ అవుతుంది. పర్యాటకులు తమ ఇంటర్నేషనల్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా ఒకేసారి రూ.25,000 వరకు లోడ్ చేసుకోవచ్చు. నెలకు గరిష్టంగా రూ.50,000 వరకు లావాదేవీలు చేసే అవకాశం కల్పించారు.
భారతదేశం రూపొందించిన ఈ యూపీఐ టెక్నాలజీ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. నగదు మార్పిడి కేంద్రాల చుట్టూ తిరిగే బాధ లేకుండా, విదేశీ కరెన్సీని జేబులో పెట్టుకుని భయపడే అవసరం లేకుండా భారత్ ఈ పరిష్కారాన్ని చూపింది. ఇది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, పర్యాటక రంగాన్ని కూడా బలోపేతం చేసే అద్భుతమైన అడుగు. ఈ డిజిటల్ వాలెట్ పుణ్యమా అని ఇక విదేశీయుల చేతుల్లో కూడా వాలెట్లు కాకుండా మొబైల్ ఫోన్లే ఎక్కువగా కనిపిస్తాయి.

