India Indonesia Trade : అంతర్జాతీయ ఆర్థిక రంగంలో అమెరికా డాలర్ గుత్తాధిపత్యానికి గండి కొడుతూ భారత్, ఇండోనేషియా దేశాలు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. ఇరు దేశాల మధ్య డిజిటల్ ఆర్థిక బంధాన్ని, వాణిజ్యాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లే దిశగా ఒక కీలక ఒప్పందం కుదిరింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో దీనిని అధికారికంగా ప్రకటించారు. రెండు దేశాల మధ్య క్రాస్-బోర్డర్ క్యూఆర్ పేమెంట్స్ లింకేజ్, లోకల్ కరెన్సీ ట్రాన్సాక్షన్ విధానాన్ని వేగంగా అమలు చేయాలని ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు. దీనికోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఇండోనేషియా ఇప్పటికే సంయుక్తంగా పనులను ప్రారంభించాయి.

ఇండోనేషియాలోనూ మన యూపీఐ హవా

ఈ సరికొత్త ఒప్పందం ప్రకారం, భారతీయ పర్యాటకులు ఇండోనేషియా వెళ్ళినప్పుడు కరెన్సీ మార్పిడి కోసం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇండోనేషియాలో ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలంటే అంతర్జాతీయ క్రెడిట్, డెబిట్ కార్డులు లేదా అమెరికా డాలర్లను ఉపయోగించాల్సి వస్తోంది. దీనివల్ల బ్యాంకులు విదేశీ మారక ద్రవ్య రుసుములు, అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. కానీ, ఈ కొత్త విధానం అందుబాటులోకి వచ్చాక, భారతీయులు తమ ఫోన్లలోని యూపీఐ యాప్స్ ద్వారా ఇండోనేషియాలోని స్థానిక క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి నేరుగా రూపాయల్లోనే చెల్లింపులు చేయవచ్చు. అదేవిధంగా, ఇండోనేషియా పౌరులు భారతదేశానికి వచ్చినప్పుడు వారి దేశ క్యూఆర్ సిస్టమ్ ద్వారా ఇక్కడ సులభంగా పేమెంట్స్ చేయవచ్చు. దీనివల్ల డాలర్ల అవసరం పూర్తిగా తగ్గిపోతుంది.

అసలేమిటీ లోకల్ కరెన్సీ ట్రాన్సాక్షన్ ?

లోకల్ కరెన్సీ ట్రాన్సాక్షన్ అంటే భారత్, ఇండోనేషియా దేశాల మధ్య జరిగే దిగుమతులు, ఎగుమతుల వ్యాపారానికి సంబంధించిన బిల్లులను నేరుగా భారత రూపాయి, ఇండోనేషియా రుపియా కరెన్సీల్లోనే చెల్లించడం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ భాగం అంతర్జాతీయ వ్యాపారం అమెరికా డాలర్లలోనే జరుగుతుంది. ఉదాహరణకు, ఒక భారతీయ వ్యాపారి ఇండోనేషియా నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటే, మొదట రూపాయలను డాలర్లుగా మార్చాలి. ఆ తర్వాత ఇండోనేషియా వ్యాపారి ఆ డాలర్లను వారి దేశ కరెన్సీ అయిన రుపియాలోకి మార్చుకోవాలి. ఈ డబుల్ కన్వర్షన్ ప్రక్రియ వల్ల వ్యాపారులకు అదనపు ఖర్చులు అవ్వడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ రేటు హెచ్చుతగ్గుల వల్ల భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. కొత్త విధానం వల్ల ఈ తలనొప్పులన్నీ తొలగిపోయి నేరుగా రూపాయి-రుపియాలోనే వ్యాపారం సాగుతుంది.

డాలర్ల టెన్షన్ లేదు.. మనీ ఎక్స్ఛేంజ్ బాధలుండవు

ఈ రెండు సరికొత్త ఆర్థిక విధానాల వల్ల ఇరు దేశాల ప్రజలకు, ముఖ్యంగా నాలుగు వర్గాలకు ఊహించని లాభాలు కలగనున్నాయి:

* పర్యాటకులు: భారతీయ టూరిస్టులు ఇండోనేషియా వెళ్ళినప్పుడు చేతిలో క్యాష్ లేదా డాలర్లు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. మనీ ఎక్స్ఛేంజ్ కమీషన్లు పూర్తిగా మిగులుతాయి. కేవలం మొబైల్ ద్వారా స్కాన్ చేసి క్షణాల్లో సురక్షితంగా బిల్లులు కట్టవచ్చు.

* విద్యార్థులు: ఇండోనేషియాలో చదువుకునే భారతీయ విద్యార్థులకు, అలాగే భారతదేశంలో చదువుకుంటున్న ఇండోనేషియా విద్యార్థులకు కాలేజీ ఫీజులు, హాస్టల్ ఖర్చులు, రోజువారీ అవసరాలకు డబ్బులు పంపించడం ఎంతో సులువుగా, చౌకగా మారుతుంది.

* చిన్న వ్యాపారులకు, పెట్టుబడిదారులకు భారీ ఊరట.. ఇకపై తగ్గనున్న అంతర్జాతీయ బదిలీల ఖర్చులు!

చిన్న వ్యాపారులు & MSME రంగు: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME) నడిపే చిన్న వ్యాపారస్తులకు ఇకపై అమెరికా డాలర్ల కొరతతో పనిలేదు. లావాదేవీల ఖర్చులు భారీగా తగ్గడం వల్ల, చెల్లింపులు వేగంగా జరగడం వల్ల ఇరు దేశాల మధ్య వ్యాపార అవకాశాలు విపరీతంగా పెరుగుతాయి.

* పెట్టుబడిదారులు: స్థానిక కరెన్సీలోనే పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండటం వల్ల విదేశీ మార్కెట్లలో వచ్చే కరెన్సీ రేట్ల హెచ్చుతగ్గుల రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. ఇది ఇరు దేశాల మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. గ్లోబల్ మార్కెట్లో బ్రిక్స్ లాంటి కూటములు కూడా డాలర్ రహిత వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో, భారత్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

వ్యూహాత్మక సబాంగ్ పోర్ట్ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం

ఆర్థిక, డిజిటల్ రంగాతో పాటు వ్యూహాత్మక రక్షణ రంగంలోనూ భారత్ ఒక అడుగు ముందుకు వేసింది. ఇండోనేషియాలోని అత్యంత కీలకమైన సబాంగ్ పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్టులో భారతదేశం భాగస్వామ్యం కావడంపై ఇండోనేషియా ప్రభుత్వం పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు యొక్క ఆర్థిక నమూనా, నిర్మాణం మరియు నిర్వహణపై కలిసి పనిచేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ సబాంగ్ పోర్ట్ ఇండోనేషియాలోని ఆచే ప్రాంతంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర వ్యాపార మార్గమైన మలక్కా స్ట్రెయిట్ ప్రవేశ ద్వారానికి అత్యంత సమీపంలో ఉంటుంది. పశ్చిమ ఆసియా నుండి తూర్పు ఆసియా దేశాలకు వెళ్లే మెజారిటీ చమురు రవాణా నౌకలు, భారీ కార్గో షిప్పులు ఈ మార్గం గుండానే ప్రయాణిస్తాయి. అందువల్ల ఈ పోర్ట్ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం కావడం చైనాకు చెక్ పెట్టడానికి, అలాగే రక్షణ పరంగా భారత్‌కు ఎంతో ప్రతిష్టాత్మకం కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story