రూ.4లక్షల కోట్ల ఎగుమతులతో ప్రపంచం షాక్

Electronics Exports : భారతదేశం ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ప్రపంచ పటంలో నిలుస్తోంది. 2025 సంవత్సరంలో దేశం నుంచి జరిగిన ఎలక్ట్రానిక్ ఎగుమతులు ఏకంగా రూ.4 లక్షల కోట్ల మార్కును దాటేశాయి. ఇది గత ఏడాది కంటే ఎంతో మెరుగైన ప్రదర్శన. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా ఈ అద్భుతమైన విజయాన్ని పంచుకున్నారు. ఈ ఏడాదిలో దేశంలో నాలుగు సెమీకండక్టర్ ప్లాంట్లు ఉత్పత్తిని ప్రారంభించబోతుండటంతో, 2026 నాటికి ఈ ఎగుమతులు మరిన్ని రెట్లు పెరిగే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ రంగం సుమారు 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది.

భారత్ సాధించిన ఈ విజయంలో యాపిల్ ఐఫోన్ల పాత్ర చాలా కీలకం. 2024లో భారత్ నుంచి రూ.1.1 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లు ఎగుమతి అవ్వగా, 2025 నాటికి అది ఏకంగా రూ.2.03 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే కేవలం ఏడాది కాలంలోనే ఐఫోన్ల ఎగుమతి రెట్టింపు అయ్యింది. ఐసీఈఏ అంచనాల ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి భారత్‌లో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి రూ.6.76 లక్షల కోట్లకు చేరుకుంటుంది. ఇందులో దాదాపు రూ.2.7 లక్షల కోట్లు కేవలం ఎగుమతుల ద్వారానే లభిస్తుంది.

రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ ప్రకారం.. భారత్ ఇప్పుడు ప్రపంచ మొబైల్ మార్కెట్‌లో కీలక శక్తిగా ఎదిగింది. 2025లో భారత్‌లో తయారయ్యే ప్రతి నాలుగు స్మార్ట్‌ఫోన్లలో ఒకటి విదేశాలకు ఎగుమతి అవుతోంది. చైనా నుంచి తన వ్యాపారాలను ఇతర దేశాలకు విస్తరించాలని చూస్తున్న యాపిల్ లాంటి కంపెనీలకు భారత్ ఇప్పుడు ఒక సురక్షితమైన, లాభదాయకమైన వేదికగా మారింది. ముఖ్యంగా రూ.50 వేల కంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల విభాగంలో భారత్ నుంచి సరఫరా భారీగా పెరిగింది.

మొబైల్ ఫోన్ల తయారీలో ఇప్పటికే సత్తా చాటిన భారత్, ఇప్పుడు సెమీకండక్టర్ చిప్ తయారీపై దృష్టి పెట్టింది. 2026లో ప్రారంభం కానున్న నాలుగు ప్రధాన ప్లాంట్ల ద్వారా విదేశీ మారక ద్రవ్యం మరింత పెరగడమే కాకుండా, విదేశాలపై మన ఆధారపడటం తగ్గుతుంది. ఇది కేవలం ఎగుమతులకే పరిమితం కాకుండా, దేశీయంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గడానికి కూడా దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి చైనాకు బలమైన పోటీ ఇస్తూ, మేక్ ఇన్ ఇండియా తన విశ్వరూపాన్ని చూపిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story