తొలిసారి లక్ష దాటిన పేటెంట్ దరఖాస్తులు

Patent: భారతదేశం ఒక పవర్ఫుల్ ఇన్నోవేషన్, రీసెర్చ్ హబ్‌గా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. దీనికి నిదర్శనంగా ఆర్థిక సంవత్సరం 2024-25లో దేశీయ ఐపీ (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ) ఆఫీసులో దాఖలైన పేటెంట్ దరఖాస్తుల సంఖ్య తొలిసారిగా లక్ష మార్కును దాటింది. 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1.1 లక్షల కంటే ఎక్కువ పేటెంట్ దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇది అంతకుముందు సంవత్సరం (FY24 లో 92,168) కంటే దాదాపు 20% ఎక్కువ. ఈ దరఖాస్తులలో దాదాపు 62% దేశీయ ఇన్నోవేటర్ల నుంచి రావడం విశేషం. ఇది భారతదేశంలో పెరుగుతున్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్థాయిని, ఆత్మనిర్భర్ ఇన్నోవేషన్ వైపు దేశం నిబద్ధతను స్పష్టంగా తెలియజేస్తోంది.

పేటెంట్లతో పాటు మొత్తం మేధో సంపత్తి హక్కుల (IPR) ఫైలింగ్‌లలో 18% కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది. 2025 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం IPR ఫైలింగ్‌లు 6.3 లక్షల నుంచి 7.4 లక్షలకు పెరిగాయి. పారిశ్రామిక రంగంలో, వినియోగదారుల విభాగంలో డిజైన్, ఇన్నోవేషన్ పెరుగుదలను సూచిస్తూ, డిజైన్ దరఖాస్తులు ఏకంగా 41.5% పెరిగి 43,005 కు చేరాయి. దేశంలో అత్యధికంగా ఉపయోగించే వాణిజ్య IPR అయిన ట్రేడ్‌మార్క్ దరఖాస్తులు కూడా 16% పెరిగి 5.5 లక్షలకు చేరాయి. అంతేకాకుండా కాపీరైట్, భౌగోళిక సూచిక (GI) దరఖాస్తులలో కూడా దాదాపు 20% పెరుగుదల కనిపించింది. ఇది సాంప్రదాయ జ్ఞానం, క్రియేటివిటీ పనులకు పెరుగుతున్న గుర్తింపును చూపుతుంది.

ఐపీఆర్ ఫైలింగ్‌లలో ఈ వేగవంతమైన వృద్ధికి ప్రధాన కారణం, ప్రభుత్వం చేపట్టిన పాలసీ, పరిపాలనా సంస్కరణలే అని ఐపీ కార్యాలయం పేర్కొంది. పేటెంట్ నిబంధనలు, 2024 వంటి సంస్కరణలు పేటెంట్ ప్రక్రియలను సులభతరం చేసి, వేగవంతం చేశాయి. అలాగే, అంతర్జాతీయ వర్గీకరణను స్వీకరించడం ద్వారా డిజైన్ ఫైలింగ్ సరళీకృతం చేయబడింది. సాంకేతిక పురోగతి కూడా ఇందులో కీలక పాత్ర పోషించింది. ఏఐ ఆధారిత టూల్స్ (ట్రేడ్‌మార్క్ సెర్చ్ టెక్నాలజీ, ఐపీ సారథి చాట్‌బాట్ వంటివి) ప్రవేశపెట్టడం వలన తనిఖీ వేగం, ఖచ్చితత్వం పెరిగాయి. తద్వారా వాటాదారులకు 24 గంటలు సహాయం లభించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story