Truecaller Report 2025 : స్కామర్ల అడ్డాగా భారత్.. నిమిషానికో మోసం..ఏడాదిలో 4,168 కోట్ల స్పామ్ కాల్స్
నిమిషానికో మోసం..ఏడాదిలో 4,168 కోట్ల స్పామ్ కాల్స్

Truecaller Report 2025 : ప్రస్తుతం మన దేశంలో స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య స్పూఫ్, స్పామ్ కాల్స్. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక తెలియని నంబర్ నుంచి కాల్ రావడం, తీరా ఎత్తితే లోన్ కావాలా? క్రెడిట్ కార్డ్ ఇస్తాం.. అంటూ విసిగించడం పరిపాటిగా మారింది. అయితే, తాజాగా ట్రూ కాలర్ విడుదల చేసిన 2025 ఇండియా ఇన్‌సైట్స్ రిపోర్ట్ దిగ్భ్రాంతికరమైన నిజాలను బయటపెట్టింది. గత ఏడాది కాలంలో భారతీయులపై స్కామర్లు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో ఈ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది.
ప్రస్తుతం భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యంతో డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో దూసుకుపోతుంటే, మరోవైపు స్పామ్ కాల్స్, సైబర్ నేరాలు దేశ పురోగతికి పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 4,168 కోట్ల స్పామ్ కాల్స్ నమోదయ్యాయి. వీటిలో వినియోగదారులు సుమారు 1,189 కోట్ల కాల్స్‌ను బ్లాక్ చేయగలిగారు. అయితే ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. సుమారు 770 కోట్ల కాల్స్ నేరుగా ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో వచ్చినవే. ప్రతి స్పామ్ కాల్ సగటున 1.8 నిమిషాల వినియోగదారుల విలువైన సమయాన్ని వృధా చేస్తోంది. కాల్స్ కంటే ఎక్కువగా స్పామ్ మెసేజ్‌ల ఉధృతి కొనసాగుతోంది.. సుమారు 12,903 కోట్ల మెసేజులు ఫోన్లను ముంచెత్తాయి. ముఖ్యంగా 2025 ద్వితీయార్థంలో ఈ బెడద విపరీతంగా పెరిగింది. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, పేమెంట్ యాప్స్, ప్రముఖ బ్రాండ్ల పేర్లతో మోసగాళ్లు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు.
కమ్యూనికేషన్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లితే అది వ్యాపార లావాదేవీలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే, ట్రూ కాలర్ వంటి టెక్నాలజీ టూల్స్ సహాయంతో కోట్ల కొద్దీ కాల్స్ వినియోగదారుల వరకు చేరకుండానే ఆగిపోవడం కొంత ఊరటనిచ్చే అంశం. ఈ డిజిటల్ యుగంలో అప్రమత్తతే మనకు శ్రీరామరక్ష. మీ కేవైసీ అప్‌డేట్ చేయాలని లేదా అకౌంట్ బ్లాక్ అయిందని ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే స్పందించకుండా కాల్ కట్ చేయడం ఉత్తమం. అలాగే వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే అపరిచిత లింకులపై క్లిక్ చేయకూడదు, ముఖ్యంగా ఏపీకే (APK) ఫైల్స్‌ను డౌన్లోడ్ చేయవద్దు. ఓటీపీ (OTP), పిన్ (PIN), పాస్‌వర్డ్స్ వంటి వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు. ఏదైనా అనుమానాస్పద నంబర్ కనిపిస్తే వెంటనే దాన్ని స్పామ్‌గా రిపోర్ట్ చేయడం ద్వారా ఇతరులను కూడా కాపాడిన వారవుతారు.

