Crude Oil: చమురు మార్కెట్‌లో పెరిగిన ఉద్రిక్తత.. ఇరాక్ స్థానాన్ని భర్తీ చేసిన రష్యా
ఇరాక్ స్థానాన్ని భర్తీ చేసిన రష్యా

Crude Oil: ఇరాన్ యుద్ధ సంక్షోభం వేళ గ్లోబల్ మార్కెట్‌లో సప్లై చైన్ దెబ్బతింటుందనే భయాలు ఉన్నప్పటికీ, భారత్ తెలివిగా వ్యవహరించింది. ఏకంగా 31 దేశాల నుంచి ముడిచమురు దిగుమతి చేసుకుంటూ సజావుగా సరఫరా సాగిస్తోంది. పలు దేశాల వైపు మొగ్గు చూపినా రష్యానే భారత్‌కు అతిపెద్ద సప్లయర్‌గా అవతరించింది. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు వ్యవస్థలో హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. ఈ ప్రతికూల వాతావరణంలో భారత రీఫైనరీలు తమ వ్యూహాలను మార్చుకున్నాయి. కేప్లర్ సంస్థ గణాంకాల ప్రకారం మార్చి నుంచి ఆగస్టు మధ్య భారత్ మొత్తం 31 దేశాల తలుపు తట్టింది. ఇందులో 10 కొత్త దేశాలు కూడా ఉన్నాయి. సరఫరా మార్గాలను విస్తరించడం ద్వారా ఏ ఒక్క ప్రాంతం పైన ఆధారపడకుండా నిరంతరంగా చమురు అందేలా ప్రణాళికలు అమలు చేశాయి.
పడిపోయిన ఇరాక్ వాటా.. పెరిగిన రష్యా ఆధిపత్యం
ఎంత మంది కొత్త సప్లయర్లు వచ్చినా రష్యా ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. గత ఆరు నెలల్లో భారత మొత్తం దిగుమతుల్లో రష్యా వాటా 29 శాతం నుంచి ఏకంగా 47 శాతానికి ఎగబాకింది. ఇదే సమయంలో మరో ప్రధాన సప్లయర్ ఇరాక్ వాటా 18 శాతం నుంచి 2 శాతానికి దారుణంగా పడిపోయింది. ఇరాక్ నుంచి తగ్గిన రోజువారీ 8.2 లక్షల బారెళ్ల చమురు లోటును రష్యా నుంచి పెరిగిన 7.7 లక్షల బారెళ్ల దిగుమతులతో భర్తీ చేశారు. ప్రస్తుతం రష్యా నుంచి ప్రతిరోజూ 2.25 మిలియన్ బారెళ్ల క్రూడ్ భారత్‌కు వస్తోంది.
టాప్ 5 జాబితా నుంచి అమెరికా అవుట్
భారత్‌కు ఎక్కువ చమురు సరఫరా చేసే తొలి ఐదు దేశాల జాబితాలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో కీలకంగా ఉన్న అమెరికా, నైజీరియా ఈ జాబితా నుంచి బయటకు వెళ్లిపోయాయి. వీటి స్థానాల్లోకి వెనెజులా, బ్రెజిల్ వచ్చి చేరాయి. రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇప్పటికీ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి. కొత్తగా రంగంలోకి దిగిన 10 దేశాల్లో వెనెజులా ఒక్కటే 5 శాతం వాటాను కైవసం చేసుకోగా, మిగిలిన 9 దేశాల వాటా కేవలం 1.4 శాతానికే పరిమితమైంది.
పెరుగుతున్న బ్రెంట్ క్రూడ్ ధరల భయం
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముడిచమురు ధరలు ఆరు వారాల గరిష్ఠ స్థాయికి చేరాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర బ్యారెల్‌కు 97.04 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ క్లిష్ట సమయంలో భారత్ తన దిగుమతుల ప్రణాళికను మార్చుకోవడం ద్వారా దేశీయంగా చమురు కొరత రాకుండా అడ్డుకోగలిగింది.

