Petrol Price: ఇక పై పెట్రోల్ పై ట్యాక్స్ జీరో.. మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం
మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Petrol Price:స్వాతంత్ర్య దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై విధించే పన్నులను ఆగస్టు 15 నుంచి తగ్గించింది. ఎగుమతిదారులతో పాటు ఇంధన రంగానికి ఈ నిర్ణయం పెద్ద ఊరట నివ్వనుంది. భారత ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చేలా ఇంధన ఎగుమతి సుంకాలను తగ్గించింది. విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్‌పై విధించే సుంకాన్ని ఏకంగా శూన్యానికి అంటే సున్నాకు తగ్గించడం గమనార్హం. లీటర్ పెట్రోల్‌పై గతంలో ఉన్న రూ.3.50 పన్నును పూర్తిగా తొలగించారు. డీజెల్ ఎగుమతులపై పన్నును లీటరుకు రూ.25.50 నుంచి రూ.24కు తగ్గించారు. విమానాల్లో వాడే ఏటీఎఫ్ ఇంధనంపై సుంకాన్ని లీటరుకు రూ.22 నుంచి రూ.19.50కు తగ్గించారు. విదేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేసే కంపెనీలకు ఇది భారీ ఆర్థిక లబ్ధి చేకూర్చనుంది.
సాధారణ ప్రయాణికులపై దీని ప్రభావం ఎంత?
ఈ పన్ను తగ్గింపు కేవలం విదేశాలకు ఎగుమతి చేసే ఇంధన ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తుంది. దేశీయ మార్కెట్‌లో మనం రోజువారీ వాహనాల్లో వాడే పెట్రోల్, డీజిల్ ధరలపై లేదా వాటిపై ఉండే ఎక్సైజ్ సుంకాలపై దీని ప్రభావం ఏమాత్రం ఉండదు. సాధారణ పౌరులు రోజువారీ కొనుగోలు చేసే ధరలలో ఎలాంటి మార్పు ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. కేవలం విదేశీ వాణిజ్యాన్ని, ఇంధన ఎగుమతులను ప్రోత్సహించడానికే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
పన్ను సమీక్ష ఎలా జరుగుతుంది?
కేంద్ర ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం ధరలను సమీక్షిస్తుంది. గ్లోబల్ మార్కెట్‌లో రేట్ల తీవ్రతను బట్టి పన్నులను మారుస్తుంటుంది. కొన్ని రోజుల క్రితం ఆగస్టు 3న పెట్రోల్ ఎగుమతి పన్నును లీటరుకు రూ.2.50 నుంచి రూ.3.50కి, డీజిల్ పన్నును రూ.15.50 నుంచి రూ.25.50కి పెంచారు. విదేశాల్లో క్రూడ్ రేట్ల హెచ్చుతగ్గుల ఆధారంగా స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా ఈ మార్పులు చేపడతారు.
మళ్లీ పన్నులు ఎందుకు విధించాల్సి వచ్చింది?
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఒక్కసారిగా మండిపోయాయి. విదేశాల్లో అధిక లాభాలు వస్తుండటంతో భారతీయ రిఫైనరీలు ఇంధనాన్ని విదేశాలకే ఎక్కువ ఎగుమతి చేయడం ప్రారంభించాయి. దేశీయంగా డీజిల్, ఏటీఎఫ్ కొరత రాకుండా చూసేందుకు 2026 మార్చి నుంచి ఎగుమతి సుంకాలను ప్రభుత్వం తిరిగి అమల్లోకి తెచ్చింది. క్రమంగా పరిస్థితులు కుదుటపడటంతో ఇప్పుడు పన్నులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

