జనవరి 27న చారిత్రాత్మక ఒప్పందం ఖరారు

India-EU FTA Deal : భారతదేశం, ఐరోపా సమాఖ్య మధ్య గత కొన్నేళ్లుగా సాగుతున్న వాణిజ్య చర్చలు ఫలించాయి. జనవరి 27న న్యూఢిల్లీలో జరగబోయే శిఖరాగ్ర సమావేశంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పూర్తయినట్లు ఇరు పక్షాలు అధికారికంగా ప్రకటించనున్నాయి. కేవలం వాణిజ్యమే కాకుండా, రక్షణ, భద్రతా రంగాల్లో కూడా వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం జనవరి 25 నుంచి 27 వరకు భారత్‌లో పర్యటించనున్నారు.

ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు మరింత ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఎందుకంటే జనవరి 26న కర్తవ్య పథ్‌లో జరిగే పరేడ్‌లో మొదటిసారిగా ఐరోపా సమాఖ్యకు చెందిన ఒక చిన్న సైనిక దళం కూడా పాల్గొనబోతోంది. ఈయూ అగ్రనేతలు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేయడం భారత్ అంతర్జాతీయ పరపతికి నిదర్శనం. శిఖరాగ్ర సమావేశం ముగిసిన వెంటనే భారత్-ఈయూ బిజినెస్ ఫోరం సమావేశం జరుగుతుంది. ఇందులో రెండు ప్రాంతాల మధ్య పన్నుల తగ్గింపు, పెట్టుబడుల సరళీకరణ మరియు ఐటీ సేవలకు మార్గం సుగమం చేయడంపై స్పష్టమైన ప్రణాళికను విడుదల చేస్తారు.

వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించినట్లుగా.. ఇది ఇప్పటి వరకు భారత్ చేసుకున్న ఒప్పందాలన్నింటిలోనూ అత్యంత భారీ ఒప్పందం. ఈ ఒప్పందం వల్ల భారతీయ వస్త్రాలు, తోలు వస్తువులు మరియు వ్యవసాయ ఉత్పత్తులకు ఐరోపా మార్కెట్‌లో సులభంగా ప్రవేశం లభిస్తుంది. అదే సమయంలో ఐరోపాకు చెందిన ఖరీదైన యంత్రాలు, వైన్, ఆటోమొబైల్ ఉత్పత్తులు భారత మార్కెట్లోకి తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, రక్షణ పరికరాల కొనుగోలు, టెక్నాలజీ బదిలీకి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

న్యాయపరమైన ప్రక్రియలు, ఐరోపా పార్లమెంట్ ఆమోదం తర్వాత కొన్ని నెలల్లో ఈ ఒప్పందంపై తుది సంతకాలు జరుగుతాయి. 2026 చివరి నాటికి సమాచార భద్రతకు సంబంధించి మరో ప్రత్యేక ఒప్పందంపై కూడా చర్చలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఒప్పందం ద్వారా అటు ఐరోపాకు, ఇటు భారత్‌కు ఆర్థికంగా భారీ ప్రయోజనాలు కలగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఈ ప్రజాస్వామ్య భాగస్వామ్యం ఒక బలమైన వేదికగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story