విదేశీ బీరు సగం ధరకే..లక్కంటే మీదే బాస్

India EU FTA : సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య సుమారు 18 ఏళ్ల పాటు సాగిన చర్చలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. జనవరి 27న ఇరు పక్షాలు చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో అటు యూరప్ మార్కెట్లోకి వెళ్లే భారతీయ వస్తువుల ధరలు తగ్గడమే కాకుండా, ఇటు ఇండియాలోకి వచ్చే విదేశీ వస్తువుల ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి. ముఖ్యంగా మందుబాబులకు, చాక్లెట్ ప్రేమికులకు, లగ్జరీ కార్లు ఇష్టపడే వారికి ఈ డీల్ ఒక పెద్ద పండగ లాంటిదని చెప్పవచ్చు.

ఈ ఒప్పందం వల్ల భారతీయ వినియోగదారులకు కలిగే అతిపెద్ద ప్రయోజనం ధరల తగ్గింపు. నివేదికల ప్రకారం.. యూరప్ నుంచి వచ్చే బీర్ ధరలు ఏకంగా 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. అలాగే విదేశీ వైన్ ధరలు 20 నుంచి 30 శాతం వరకు దిగిరానున్నాయి. ఇక ఫుడ్ ఐటమ్స్ విషయానికి వస్తే.. పాస్తా, చాక్లెట్లపై ఇప్పటివరకు ఉన్న 50 శాతం దిగుమతి సుంకం పూర్తిగా రద్దు కానుంది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు కూడా విదేశీ బ్రాండ్లను తక్కువ ధరకే ఎంజాయ్ చేయవచ్చు. ఆటోమొబైల్ రంగంలో కూడా పెను మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం విదేశీ కార్లపై ఉన్న 110 శాతం టారిఫ్, ఈ ఒప్పందంతో కేవలం 10 శాతానికి పడిపోయే అవకాశం ఉంది.

భారతదేశానికి ఈ ఒప్పందం వ్యూహాత్మకంగా చాలా కీలకం. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయ వస్తువులపై 50 శాతం వరకు టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భారత్ తన ఎగుమతుల కోసం యూరప్ వైపు చూడటం సరైన నిర్ణయమని నిపుణులు అంటున్నారు. ఈ ఒప్పందం వల్ల యూరప్‌కు పంపే దాదాపు 97 శాతం భారతీయ ఉత్పత్తులపై పన్నులు రద్దవుతాయి. దీనివల్ల మన దేశానికి ఏటా సుమారు 75 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.3 లక్షల కోట్లు) కస్టమ్స్ డ్యూటీ ఆదా అవుతుందని అంచనా.

యూరోపియన్ యూనియన్ కూడా తన మార్కెట్‌ను విస్తరించుకోవడంలో భాగంగా భారత్‌ను ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎంచుకుంది. ఇటీవల లాటిన్ అమెరికా దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్న ఈయూ, ఇప్పుడు భారత్‌తో చేతులు కలపడం ద్వారా ఆసియాలో తన పట్టును బలపరుచుకోవాలని చూస్తోంది. ఈ ఒప్పందం ద్వారా 2032 నాటికి 96 శాతం వస్తువులపై టారిఫ్‌లను పూర్తిగా తొలగించాలని ఈయూ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల అటు యూరోపియన్ కంపెనీలకు కూడా ఏడాదికి 4 బిలియన్ డాలర్ల వరకు లాభం చేకూరుతుంది.

మొత్తానికి భారత్-ఈయూ మధ్య కుదిరిన ఈ మహా ఒప్పందం ఇరు పక్షాలకు లాభదాయకంగా ఉండటమే కాకుండా, సామాన్య వినియోగదారులకు నాణ్యమైన విదేశీ వస్తువులను సరసమైన ధరలకే అందించనుంది. వస్త్ర పరిశ్రమ, లెదర్, అగ్రికల్చర్ రంగాల్లోని భారతీయ ఎగుమతిదారులకు యూరప్ ఒక పెద్ద మార్కెట్‌గా మారబోతోంది. దీనివల్ల దేశంలో లక్షలాది మందికి కొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story