రేర్ ఎర్త్ మెటల్స్ కోసం రష్యాతో భారత్ చర్చలు

Rare Earth Metals : భారత్, పొరుగు దేశమైన చైనా మధ్య మరో కొత్త వివాదం మొదలవుతున్నట్లు కనిపిస్తోంది. చైనా రేర్ ఎర్త్ మెటల్స్, పర్మనెంట్ మాగ్నెట్ సరఫరాపై మరింత కంట్రోల్ విధించింది. భారతదేశం తన అవసరాలలో దాదాపు 65 శాతం రేర్ ఎర్త్ మెటల్‌ను చైనా నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ పరిస్థితిలో చైనాపై భారతదేశం ఆధారపడటం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ మధ్యే ఒక సానుకూల వార్త వెలుగులోకి వచ్చింది. భారత కంపెనీలు ఈ సమస్యకు పరిష్కారం కోసం రష్యాలో అవకాశాలను వెతుకుతున్నాయి.

భారత్, రష్యా మధ్య రేర్ ఎర్త్ మెటల్స్‌పై చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ వైపు వేగంగా అడుగులు వేయాలని కోరుకుంటుంది. అందుకే, విదేశీ దిగుమతులకు ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం విదేశాల నుండి దాదాపు 2270 టన్నుల రేర్ ఎర్త్ మెటల్‌ను దిగుమతి చేసుకుంది. చైనా సరఫరాపై అదనపు నియంత్రణ విధించడంతో భారతదేశం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది.

కేంద్ర ప్రభుత్వం రష్యాతో చర్చల కోసం లోహుమ్, మిడ్‌వెస్ట్ (Midwest) అనే రెండు భారతీయ కంపెనీలను సెలక్ట్ చేసింది. ఈ రెండు కంపెనీలు రష్యాలోని ఖనిజ సంబంధిత కంపెనీలతో కలిసి భారతదేశం కోసం కొత్త అవకాశాలను అన్వేషిస్తాయి. భారత ప్రభుత్వం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీలకు రష్యా కంపెనీల టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి మొత్తం ప్రాసెసింగ్ గురించిన సమాచారాన్ని సేకరించడానికి ఆదేశాలు జారీ చేసింది. రష్యా తరపున నోర్నికల్, రోసాటమ్ అనే ప్రభుత్వ కంపెనీలు ఈ భాగస్వామ్యంలో పాల్గొనే అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో దాదాపు 90 శాతం రేర్ ఎర్త్ ప్రాసెసింగ్‌ను చైనా నియంత్రిస్తోంది. అంటే, ప్రపంచవ్యాప్తంగా దాదాపు మొత్తం రేర్ ఎర్త్ ఎగుమతులు చైనా నుంచే జరుగుతున్నాయి. రష్యా గత కొన్ని సంవత్సరాలుగా రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ టెక్నాలజీలపై చాలా పని చేసింది. భారతదేశంతో కలిసి ఈ టెక్నాలజీలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలని రష్యా యోచిస్తోంది. ఇది సాధ్యమైతే భారతదేశం, రష్యా రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ ప్రపంచంలో రెండు కొత్త శక్తివంతమైన దేశాలుగా అవతరిస్తాయి. దీనివల్ల చైనాపై ఆధారపడటం తగ్గడమే కాకుండా, ఎగుమతులకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story