Airport Rules: విదేశాలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్..సెప్టెంబర్ 1 నుంచి ఎయిర్‌పోర్ట్ నిబంధనల్లో మార్పులు
ఎయిర్‌పోర్ట్ నిబంధనల్లో మార్పులు

Airport Rules: విదేశాలకు ప్రయాణించే ప్యాసింజర్లకు కేంద్ర హోమ్‌శాఖ పరిధిలోని ఇమ్మిగ్రేషన్ బ్యూరో తీపి కబురు అందించింది. దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సెప్టెంబర్ 1 నుంచి బోర్డింగ్ పాస్‌లపై ఫిజికల్ సీలింగ్ వేసే విధానాన్ని శాశ్వతంగా స్వస్తి పలకనుంది. ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద తమ స్మార్ట్‌ఫోన్‌లోని ఈ-బోర్డింగ్ పాస్‌ను చూపిస్తే సరిపోతుంది. ప్రయాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కోసం క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి కాగితపు బోర్డింగ్ పాస్‌లపై సీల్ వేయించుకునే పాత పద్ధతికి త్వరలోనే కాలం చెల్లనుంది. సెప్టెంబర్ 1 నుంచి దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బోర్డింగ్ పాస్‌లపై ఫిజికల్ స్టాంపింగ్ నిబంధనను తొలగించాలని ఇమ్మిగ్రేషన్ బ్యూరో అధికారులను ఆదేశించింది. దీనివల్ల ప్రయాణికులు ఇకపై తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే ఈ-బోర్డింగ్ పాస్‌ను మాత్రమే చూపిస్తే క్లియరెన్స్ లభిస్తుంది. పేపర్‌లెస్ ప్రయాణాన్ని ప్రోత్సహించడంలో ఇది పెద్ద ముందడుగుగా మారనుంది.
పాత పద్ధతిలో ఇబ్బందులు.. కేంద్రం రివ్యూ
ఇప్పటివరకు అమల్లో ఉన్న స్టాంపింగ్ విధానం వల్ల అనేక రకాల సాంకేతిక, ఆచరణాత్మక సమస్యలు తలెత్తేవి. కొన్నిసార్లు బోర్డింగ్ పాస్‌లపై ముద్రించే స్టాంపింగ్ స్పష్టంగా పడకపోవడం లేదా తప్పుడు స్థానంలో పడటం వల్ల ప్రయాణికులు విమానం ఎక్కే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్ష జరిపిన ఇమ్మిగ్రేషన్ బ్యూరో, బోర్డింగ్ పాస్‌లపై సీల్ వేసే అవసరమే లేకుండా డిజిటల్ తనిఖీలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
కేవలం ఇమ్మిగ్రేషన్ స్టాంపింగ్‌కే ఈ మినహాయింపు
ఈ కొత్త వెసులుబాటు వల్ల బోర్డింగ్ పాస్ అవసరమే లేదని భావించకూడదు. ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలోకి ప్రవేశించడం, సెక్యూరిటీ చెకింగ్, విమానం ఎక్కే సమయాల్లో బోర్డింగ్ పాస్ తప్పనిసరి. అయితే దాన్ని కాగితం రూపంలో కాకుండా డిజిటల్ రూపంలో మొబైల్‌లో చూపిస్తే సరిపోతుంది. ఇప్పటికే CISF భద్రతా బలగాలు సెక్యూరిటీ చెకింగ్ సమయంలో బోర్డింగ్ పాస్‌లపై సీలింగ్ వేసే విధానాన్ని కొన్నేళ్ల కిందటే నిలిపివేసాయి. ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ విభాగానికి కూడా ఇది వర్తిస్తుంది.
మున్ముందు పాస్‌పోర్ట్ స్టాంపింగ్ కూడా రద్దు?
ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ రికార్డులను పూర్తిగా డిజిటలైజ్ చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి భారతీయ పాస్‌పోర్ట్ దారులకు ఎంట్రీ, ఎగ్జిట్ ఇమ్మిగ్రేషన్ స్టాంపింగ్‌ను కూడా తొలగించేందుకు ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉంది. ఇది విజయవంతమైతే రాబోయే రోజుల్లో పాస్‌పోర్ట్‌లపై సీలింగ్ వేసే విధానం కూడా పూర్తిగా ముగిసిపోనుంది. కేంద్రం తీసుకున్న ఈ డిజిటల్ విప్లవాత్మక నిర్ణయం వల్ల ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద నిరీక్షణ సమయం గణనీయంగా తగ్గనుంది. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు తమ స్మార్ట్‌ఫోన్‌లను ఎల్లప్పుడూ ఛార్జింగ్‌లో ఉంచుకోవడం లేదా ఈ-బోర్డింగ్ పాస్‌ను ఆఫ్‌లైన్‌లో సేవ్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

