India Post : ఇండియా పోస్ట్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. స్పీడ్ పోస్ట్, పార్శిల్ బుకింగ్ క్యాన్సిల్ చేస్తే డబ్బులు రీఫండ్
డబ్బులు రీఫండ్

India Post : భారతీయ తపాలా శాఖ కోట్లాది మంది తమ కస్టమర్లకు, డిజిటల్ సేవలను ఉపయోగించే వారికి ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. సాధారణంగా స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ లేదా పార్శిల్ బుకింగ్ చేసిన తర్వాత ఏదైనా కారణం వల్ల దానిని రద్దు చేసుకుంటే పాత నిబంధనల ప్రకారం కట్టిన డబ్బులు తిరిగి వచ్చేవి కావు. కానీ ఇప్పుడు కస్టమర్ల సొమ్ము వృధా కాకుండా ఉండేందుకు పోస్టల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్న తపాలా ఛార్జీలను కస్టమర్లకు తిరిగి రీఫండ్ ఇచ్చేలా నిబంధనలను సవరించింది. ఇండియా పోస్ట్ తీసుకున్న ఈ నిర్ణయం తన సేవలను మరింత పారదర్శకంగా, కస్టమర్ ఫ్రెండ్లీగా మార్చడంలో ఒక మైలురాయిగా నిలవనుంది.
అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన తపాలా శాఖ
ఈ సరికొత్త రీఫండ్ విధానానికి సంబంధించి ఇండియా పోస్ట్ అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆన్‌లైన్ వెబ్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా సొంతంగా పోస్టల్ ఆర్టికల్స్ బుక్ చేసుకునే వెండర్లు లేదా కస్టమర్లకు ఇందులో పెద్ద లబ్ధి చేకూరనుంది. వారు బుక్ చేసిన పార్శిల్‌ను పోస్ట్ ఆఫీస్ సిబ్బంది అధికారికంగా స్వీకరించి, ప్రాసెస్ చేయకముందే ఆన్‌లైన్‌లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలా క్యాన్సిల్ చేసిన వెంటనే వారు చెల్లించిన పోస్టేజ్ ఫీజు రీఫండ్ కోసం క్లెయిమ్ చేసుకోవడానికి ఈ కొత్త నిబంధనలు పూర్తి అనుమతిని ఇస్తున్నాయి.
పోస్ట్ ఆఫీస్ కౌంటర్ బుకింగ్స్‌కు కూడా వర్తింపు
ఆన్‌లైన్ లోనే కాకుండా నేరుగా పోస్ట్ ఆఫీస్ కౌంటర్ల వద్దకు వెళ్లి బుక్ చేసుకునే కస్టమర్లకు కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. కౌంటర్‌లో ఐటమ్ బుక్ చేసిన తర్వాత పంపేవారు బుకింగ్‌ను రద్దు చేయాలని కోరితే, అధికారులు దానిని క్యాన్సిల్ చేస్తారు. కొన్నిసార్లు పోస్ట్ ఆఫీస్ సిబ్బంది పొరపాటున తప్పుడు డేటా ఎంట్రీ చేసినా కూడా, బుకింగ్ చేసిన అదే రోజున దానిని రద్దు చేసి సరిచేసే అవకాశాన్ని కల్పించారు. ఈ రీఫండ్ ప్రక్రియ అంతా తపాలా శాఖ సమయానుకూలంగా జారీ చేసే పరిపాలనా మార్గదర్శకాలకు లోబడి కస్టమర్ల అకౌంట్లలో జమ అవుతుంది.
ఇంటర్నేషనల్ పార్సిళ్లకు సరికొత్త రూల్స్
ఈ కొత్త నిబంధనల ప్రకారం దేశీయ సేవలకే కాకుండా అంతర్జాతీయ పోస్టల్ సేవలకు కూడా పలు మార్పులు చేశారు. ట్రాకింగ్ సదుపాయం ఉన్న ఇంటర్నేషనల్ పార్సిళ్లను ఏదైనా అత్యవసర కారణం చేత పంపే వ్యక్తి బుకింగ్ ఆఫీస్ నుండి వెనక్కి రప్పించుకోవచ్చు. ఒకవేళ పార్శిల్ దేశం దాటి విదేశీ గమ్యస్థానాలకు చేరుకున్నా కూడా, అక్కడ వర్తించే పోస్టల్ నిబంధనల ప్రకారం సదరు విదేశీ తపాలా శాఖ అనుమతితో వస్తువును తిరిగి వెనక్కి తెప్పించుకోవడానికి లేదా మరో అడ్రస్‌కు మళ్లించడానికి ఈ కొత్త రూల్స్ ద్వారా వీలు కలుగుతుంది.
అడ్రస్ మారినా నో టెన్షన్
ఇకపై విదేశాల నుండి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ పార్సిళ్ల విషయంలో డెలివరీ అడ్రస్ మారితే కస్టమర్లకు ఒక సూపర్ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. పార్శిల్ అందుకోవాల్సిన వ్యక్తి నిర్దేశిత డెలివరీ ఆఫీస్‌కు కొంత పోస్టేజ్ ఫీజు చెల్లించి, ఆ వస్తువును వేరే కొత్త అడ్రస్‌కు రీడైరెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ కొత్త అడ్రస్ గనుక అదే పోస్ట్ ఆఫీస్ డెలివరీ పరిధిలోకి వస్తే మాత్రం కస్టమర్ల నుంచి ఎలాంటి అదనపు రుసుము లేదా ఫీజు వసూలు చేయరు. పూర్తిగా ఉచితంగానే కొత్త అడ్రస్‌కు డెలివరీ చేస్తారు. సేవలు నిలిచిపోయిన ప్రత్యేక పరిస్థితుల్లో కూడా ఎయిర్ సర్ఛార్జ్, ఇతర ఫీజులను రీఫండ్ చేయడానికి ఈ కొత్త చట్టం అనుమతి ఇస్తుంది.

