Post Office : 5,800 కోట్లతో ఇండియన్ పోస్టల్ వ్యవస్థలో భారీ మార్పులు.. ఇక ప్రపంచ స్థాయి సంస్థగా!
ఇక ప్రపంచ స్థాయి సంస్థగా!

Post Office : ఇండియా పోస్ట్ సంస్థ రూ. 5,800 కోట్ల ఖర్చుతో అత్యంత అధునాతన పోస్టల్ టెక్నాలజీని అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే భారతదేశ పోస్టల్ శాఖ స్వరూపం పూర్తిగా మారిపోతుంది. ఇండియన్ పోస్ట్ ప్రపంచ స్థాయి పబ్లిక్ లాజిస్టిక్స్ సంస్థగా రూపాంతరం చెందుతుంది. ఆధునిక లాజిస్టిక్స్ కంపెనీల మాదిరిగానే పోస్ట్ ఆఫీసులు కూడా మౌలిక సదుపాయాలను కలిగి ఉంటాయి.
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ ముఖ్యమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ‘‘ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీని అమలు చేస్తోంది. ఇది భారతదేశ డిజిటల్ ప్రయాణంలో ఒక చారిత్రక ఘట్టం. ఐటీ 2.0 కింద రూ. 5,800 కోట్ల పెట్టుబడితో ఈ అడ్వాన్సుడ్ టెక్నాలజీ ఇండియా పోస్ట్‌ను ప్రపంచ స్థాయి పబ్లిక్ లాజిస్టిక్స్ సంస్థగా మార్చుతుంది" అని జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
ఈ అడ్వాన్సుడ్ టెక్నాలజీని అమలు చేయడం వల్ల పోస్ట్ ఆఫీసులు ఆధునికమయ్యాయి. కస్టమర్‌లు అనేక రకాల సౌకర్యాలను పొందవచ్చు. ఇప్పుడు ఏ బ్యాంకు కస్టమర్ అయినా పోస్ట్ ఆఫీసులలో డిజిటల్ లావాదేవీలు చేయడానికి వీలుంటుంది. ప్రస్తుతం పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి మాత్రమే పోస్ట్ ఆఫీసులలో యూపీఐ లావాదేవీలు చేసే అవకాశం ఉంది. కానీ కొత్త టెక్నాలజీతో ఏ బ్యాంక్ ఖాతా ఉన్న యూపీఐ ద్వారా అయినా పోస్ట్ ఆఫీసుల్లో సులభంగా చెల్లించవచ్చు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఆశయాల స్ఫూర్తితో ఈ అధునాతన పోస్టల్ టెక్నాలజీ పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేయబడింది. ఈ కొత్త టెక్నాలజీ రియల్ టైంలో నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది, ఇ-కామర్స్‌ను ప్రోత్సహిస్తుంది. కార్యకలాపాల ఖర్చులను తగ్గిస్తుందని మంత్రి చెప్పారు.
