రష్యా నుండి చమురు కొనుగోళ్లు పెంచిన భారత్

Crude Oil : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా నుండి ముడి చమురు దిగుమతులను ఆపడానికి అంగీకరించారని ఆయన అన్నారు. అయితే, ఈ ప్రకటన వెలువడక ముందే, రష్యా నుండి భారత్ ముడి చమురు దిగుమతులు ఊపందుకున్నాయని ఒక కొత్త నివేదిక వెల్లడించింది. గత మూడు నెలలుగా తగ్గుతూ వస్తున్న రష్యా చమురు కొనుగోళ్లు, అక్టోబర్ మొదటి పదిహేను రోజుల్లో మళ్లీ పెరిగాయి. జూలై నుండి సెప్టెంబర్ వరకు మూడు నెలల పాటు రష్యా నుండి భారత్ ముడి చమురు దిగుమతులు తగ్గుతూ వచ్చాయి. అయితే, అక్టోబర్ మొదటి పదిహేను రోజుల్లో మళ్లీ ఈ దిగుమతులు పెరిగినట్లు షిప్‌ల రాకపోకలకు సంబంధించిన డేటా వెల్లడించింది. పండుగల సీజన్ డిమాండ్‌ను తీర్చడానికి భారతీయ రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడమే ఈ దిగుమతుల పెరుగుదలకు ప్రధాన కారణం. గత జూన్‌లో రోజుకు 20 లక్షల బ్యారెల్స్ ఉన్న దిగుమతులు సెప్టెంబర్‌లో 16 లక్షల బ్యారెల్స్కి పడిపోయాయి. కానీ అక్టోబర్‌లో మళ్లీ మెరుగుదల కనిపించింది.

రష్యన్ గ్రేడ్ చమురు సరఫరా భారత్‌కు పెరిగింది. పశ్చిమ మార్కెట్లలో రష్యా చమురుకు డిమాండ్ తగ్గడం, కొత్త డిస్కౌంట్లు లభించడం దీనికి తోడ్పడింది. గ్లోబల్ ట్రేడ్ అనాలిసిస్ కంపెనీ కేప్లర్ ప్రాథమిక డేటా ప్రకారం.. అక్టోబర్‌లో భారత్ చమురు దిగుమతులు రోజుకు దాదాపు 18 లక్షల బ్యారెల్స్‌కు చేరుకున్నాయి. ఇది గత నెల కంటే సుమారు 2.5 లక్షల బ్యారెల్స్‌ ఎక్కువ. అయితే, ఈ నెల చివరి నాటికి ఈ అంకెలు మారే అవకాశం ఉందని కేప్లర్ తెలిపింది.

అక్టోబర్ 15న డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ రష్యా నుండి చమురు దిగుమతులను ఆపడానికి అంగీకరించారని ప్రకటించారు. అయితే, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ ప్రకటనను పూర్తిగా ఖండించారు. తనకు అలాంటి సంభాషణ గురించి ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. రష్యా నుండి వచ్చే చమురు భారతదేశ ఇంధన వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం అని ఆయన నొక్కి చెప్పారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story