LPG Import : భారత ఇంధన కష్టాలకు అర్జెంటీనా చెక్.. గల్ఫ్ యుద్ధం వేళ పెరిగిన ఎల్‌పీజీ సరఫరా
గల్ఫ్ యుద్ధం వేళ పెరిగిన ఎల్‌పీజీ సరఫరా

LPG Import : పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ దేశాల నుంచి చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి గడ్డు కాలంలో భారతదేశానికి ఒక నమ్మకమైన స్నేహితుడు దొరికాడు. అదే దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనా. గల్ఫ్ దేశాలపై ఆధారపడటం తగ్గించి, మన వంటగదిలో గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు అర్జెంటీనా నుంచి ఎల్‌పీజీ దిగుమతులను భారత్ భారీగా పెంచింది. దీనివల్ల యుద్ధం జరుగుతున్నా మన దేశంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు.
యుద్ధం ఉన్నా గ్యాస్ ఆగదు
సాధారణంగా గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం మొదలైతే చమురు, గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా సరఫరా కూడా నిలిచిపోతుంది. కానీ భారత్ ఈసారి ముందుగానే మేల్కొంది. 2026 మొదటి మూడు నెలల్లోనే అర్జెంటీనా నుంచి భారత్ సుమారు 50,000 టన్నుల ఎల్‌పీజీని దిగుమతి చేసుకుంది. 2025లో ఇదే సమయంలో కేవలం 22,000 టన్నులు మాత్రమే వచ్చేది. అంటే దిగుమతులు రెట్టింపు కంటే ఎక్కువయ్యాయి. యుద్ధం తీవ్రరూపం దాల్చకముందే అర్జెంటీనాలోని బాహియా బ్లాంకా ఓడరేవు నుంచి 39,000 టన్నుల గ్యాస్ భారత్ బయలుదేరింది. ఆ తర్వాత మార్చి 5న మరో 11,000 టన్నుల గ్యాస్ కార్గో భారత్‌కు చేరుకుంది.
శూన్యం నుంచి అగ్రగామి సరఫరాదారుగా..
ఒకప్పుడు అర్జెంటీనా నుంచి మనం గ్యాస్ కొనేవాళ్ళం కాదు. 2024 వరకు అసలు అక్కడ నుంచి దిగుమతులే లేవు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అర్జెంటీనా తన ఎల్‌పీజీ ఉత్పత్తిని భారీగా పెంచింది. 2026 జనవరిలోనే ఆ దేశం 2,59,000 టన్నుల ఎల్‌పీజీని ఉత్పత్తి చేసింది. కేవలం ఉత్పత్తి చేయడమే కాకుండా, తన గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లలో కొత్త యూనిట్లను ఏర్పాటు చేస్తూ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. దీనివల్ల భవిష్యత్తులో కూడా భారత్ వంటి పెద్ద దేశాలకు గ్యాస్ సరఫరా చేయడంలో అర్జెంటీనా ఒక కీలక భాగస్వామిగా నిలవబోతోంది.
కేవలం గ్యాస్ మాత్రమే కాదు..
భారత్, అర్జెంటీనా మధ్య సంబంధాలు కేవలం గ్యాస్ దిగుమతులకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది ఒక లోతైన ఆర్థిక బంధంగా మారుతోంది. 2025 జనవరి నుంచి నవంబర్ మధ్య రెండు దేశాల మధ్య వ్యాపారం 36.77 శాతం పెరిగి 6.34 బిలియన్ డాలర్లకు చేరింది. మనం వంటల్లో వాడే సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ కూడా ఎక్కువగా అర్జెంటీనా నుంచే వస్తుంది. వీటితో పాటు ధాన్యాలు, పప్పు దినుసులు, లెదర్, రసాయనాలను కూడా మనం అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటున్నాము. ప్రస్తుతం అర్జెంటీనాకు భారత్ ఐదవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఎదిగింది.
భవిష్యత్తు అవసరాలపై కన్ను
రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమయ్యే లిథియం కోసం కూడా భారత్ అర్జెంటీనాపైనే ఆశలు పెట్టుకుంది. 2024లో భారత్ కు చెందిన కబిల్ సంస్థ అర్జెంటీనాలో ఐదు లిథియం బ్లాకులను లీజుకు తీసుకుని చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. అలాగే చమురు, గ్యాస్ రంగాల్లో సహకారం కోసం ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్ కూడా అక్కడి ప్రభుత్వ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ విధంగా కేవలం ప్రస్తుత యుద్ధ సంక్షోభమే కాకుండా, రాబోయే తరాల ఇంధన అవసరాల కోసం కూడా భారత్ అర్జెంటీనాతో చేతులు కలిపింది.

