NITI Aayog : ప్రపంచాన్ని ఏలేందుకు నీతి ఆయోగ్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. 150 బిలియన్ డాలర్ల వ్యూహం
150 బిలియన్ డాలర్ల వ్యూహం
NITI Aayog : మన చేతిలో ఉండే చిన్న స్మార్ట్‌ఫోన్ నుంచి రోడ్డుపై వేగంగా దూసుకెళ్లే స్మార్ట్ కార్ల వరకు.. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువు నడవాలన్నా చిప్ లేదా సెమీకండక్టర్ అనేది అత్యంత కీలకం. ఈ గ్లోబల్ చిప్స్ మార్కెట్లోనే సరికొత్త చరిత్ర సృష్టించేందుకు భారతదేశం ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. రాబోయే 2035 సంవత్సరం నాటికి ప్రపంచ సెమీకండక్టర్ రంగానికి ఇండియాను గ్లోబల్ కింగ్‌గా మార్చడమే లక్ష్యంగా నీతి ఆయోగ్ ఒక సంచలన నివేదికను విడుదల చేసింది. భారతదేశం కేవలం విదేశీ చిప్‌లకు ఒక పెద్ద మార్కెట్‌గా మిగిలిపోకుండా.. సొంతంగా 150 బిలియన్ డాలర్ల భారీ వాల్యూ చైన్‌ను నిర్మించి ప్రపంచ దేశాలకు లీడర్‌గా మారాలని ఈ రిపోర్టులో స్పష్టం చేశారు.
నీతి ఆయోగ్ తాజాగా భారత సెమీకండక్టర్ పరిశ్రమ భవిష్యత్తు పేరుతో ఒక ప్రత్యేక బ్లూప్రింట్‌ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ప్రపంచ దేశాల వెనుక నడవడం కాకుండా.. గ్లోబల్ సప్లై చైన్‌లో భారతదేశం ఒక ప్రధాన కేంద్రంగా మారాలని ఈ నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుతం మన దేశానికి కావాల్సిన సెమీకండక్టర్లలో దాదాపు 90 నుంచి 95 శాతం చిప్‌లను చైనా, తైవాన్ వంటి ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. అయితే 2035 నాటికి కేవలం భారతదేశంలోనే చిప్‌ల డిమాండ్ ఏకంగా 200 బిలియన్ డాలర్లకు పైగా దాటుతుందని అంచనా వేశారు. ఇంత భారీ మొత్తంలో విదేశాల నుంచి కొనుగోలు చేస్తే దేశ సంపద అంతా బయటకు పోవడమే కాకుండా.. అంతర్జాతీయంగా సప్లై ఆగిపోతే మన దేశీయ పరిశ్రమలు కుప్పకూలే ప్రమాదం ఉంది. అందుకే ఈ విదేశీ డిపెండెన్సీని పూర్తిగా తుడిచిపెట్టడమే ఈ మాస్టర్ ప్లాన్ ముఖ్య ఉద్దేశం.
దేశంలో కేవలం చిప్స్ డిజైనింగ్ మాత్రమే కాకుండా.. వాటి తయారీ, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ వంటి భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడానికి భారీగా పెట్టుబడులు అవసరమవుతాయి. నీతి ఆయోగ్ అంచనా ప్రకారం వచ్చే ఒక దశాబ్ద కాలంలో ఈ రంగానికి సుమారు 135 నుంచి 180 బిలియన్ డాలర్ల మొత్తం పెట్టుబడి అవసరం అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ప్రైవేట్ కంపెనీలు ముందుకు రావాలంటే వారిలో నమ్మకం కలిగించాలి. అందుకే నీతి ఆయోగ్ ప్రభుత్వానికి ఒక అదిరిపోయే సలహా ఇచ్చింది. ఈ టోటల్ ఇన్వెస్ట్‌మెంట్‌లో కనీసం మూడో వంతు ఖర్చును భారత ప్రభుత్వమే స్వయంగా భరించాలని ప్రతిపాదించింది. ప్రభుత్వం ముందుండి ఫ్యాక్టరీల నిర్మాణానికి సాయం చేస్తే ప్రాజెక్టుల రిస్క్ తగ్గి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ప్రైవేట్ కంపెనీలు భారత్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడతాయని వివరించింది.
ఈ నివేదికపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ లాహిరి స్పందిస్తూ.. భారతదేశం ఒక వికసిత దేశంగా మారాలంటే వేరే దేశాల టెక్నాలజీపై ఆధారపడటం పూర్తిగా బంద్ చేయాలని చెప్పారు. దీనినే వారు సాంకేతిక సార్వభౌమత్వం అని పిలిచారు. నేటి తరం టెక్నాలజీలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ రంగ ఆయుధాలు, టెలికాం సెక్టార్, రవాణా రంగం, నిత్యావసర డిజిటల్ సేవలు అన్నీ కూడా ఈ చిన్న చిప్ ఆధారంగానే నడుస్తున్నాయి. 2014 నుంచి 2024 మధ్య కాలంలో ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ ఏడాదికి 6.5 శాతం చొప్పున వృద్ధి చెందగా.. రాబోయే రోజుల్లో ఇది 8.5 శాతం వేగంతో దూసుకుపోనుందని, కాబట్టి భారత్ ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదని వారు స్పష్టం చేశారు.

