అమెరికాకు తపాలా సేవలను నిలిపేసిన భారత్

Postal Services : అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా భారతదేశం సహా అనేక దేశాలు పోస్టల్ సేవలను నిలిపివేస్తున్నాయి. ఆగస్టు 25 నుండి భారతదేశం అమెరికాకు అన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. కొత్త అమెరికా సుంకాలు అమల్లోకి రావడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఐరోపా దేశాలు కూడా అమెరికాకు అన్ని పోస్టల్ సేవలను నిలిపివేశాయి. ఇది ప్రపంచ వాణిజ్యంలో కొత్త సవాళ్లను సృష్టిస్తోంది.

అమెరికా సుంకాల ప్రభావం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు మొదట భారతదేశంపై 25 శాతం సుంకం విధించారు. ఆ తర్వాత, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా ఆగస్టు 29 నుంచి అదనంగా మరో 25 శాతం సుంకం విధిస్తామని అమెరికా ప్రకటించింది. దీనితో భారతీయ వస్తువులపై మొత్తం 50 శాతం సుంకం చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల భారతీయ వ్యాపారులపై భారీ భారం పడుతోంది.

తక్షణమే నిలిచిపోయిన పోస్టల్ సేవలు

పోస్టల్ డిపార్ట్‌మెంట్ తమ ప్రకటనలో.. “అమెరికాకు పంపే అంతర్జాతీయ పోస్టల్ వస్తువులన్నింటికీ ఆయా దేశాల నిర్దిష్ట సుంకాలు వర్తిస్తాయి” అని తెలిపింది. ఒకవేళ 100డాలర్ల వరకు విలువ చేసే బహుమతులపై మాత్రం ఈ సుంకాలు ఉండవు. అయితే, ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికాకు వస్తువులను రవాణా చేసే కంపెనీలు ఆగస్టు 25 తర్వాత తమ సేవలను అందించలేమని భారతీయ అధికారులకు తెలియజేశాయి. ఈ కారణంగానే పోస్టల్ శాఖ అమెరికాకు పోస్టుల బుకింగ్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది.

ఐరోపా దేశాలూ అదే బాటలో

అదే సుంకాల సమస్య కారణంగా ఐరోపా దేశాలు కూడా అమెరికాకు పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఇప్పటికే జర్మనీ, డెన్మార్క్, స్వీడన్, ఇటలీ నుండి నిన్నటి నుండి పోస్టల్ సేవలు ఆగిపోయాయి. ఫ్రాన్స్, ఆస్ట్రియా నుండి కూడా సేవలు నిలిచిపోయాయి. బ్రిటన్ రాయల్ మెయిల్ కూడా ఆగస్టు 26 నుంచి సేవలను నిలిపివేయనుంది. పోస్టులపై సుంకాలు విధించినట్లయితే ఆ ఖర్చు ఎవరు భరిస్తారనే విషయంపై స్పష్టత లేకపోవడం కూడా ఈ సేవలను నిలిపివేయడానికి ఒక కారణం.

భారత వాణిజ్యంపై ప్రభావం

ఈ నిర్ణయం వల్ల చిన్న మరియు మధ్య తరహా వ్యాపారులపై, ముఖ్యంగా ఈ-కామర్స్, హస్తకళాకారులపై తీవ్ర ప్రభావం పడుతుంది. వారు అమెరికాకు వస్తువులను ఎగుమతి చేయడానికి పోస్టల్ సేవలను ఎక్కువగా ఉపయోగిస్తారు. పోస్టల్ సేవలు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను వెతుక్కోవాల్సి వస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story