Semiconductor: భారత్‌ను ప్రపంచ తయారీ రంగానికి చిరునామాగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సెమీకండక్టర్లు, ఆటోమొబైల్ విడిభాగాల తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు 60 రోజుల్లో కొత్త నిబంధనలు తేనుంది. నిబంధనల పీటముడిని సడలించి ప్యాక్టరీల ఏర్పాటును సులభతరం చేస్తామని టోక్యో వేదికగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. భారత్‌లో తయారీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా మోదీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించిన నిక్కీ ఆసియా సమావేశంలో పాల్గొన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ విదేశీ పెట్టుబడిదారులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. సెమీకండక్టర్ ఎక్విప్‌మెంట్, ఆటోమోటివ్ కాంపోనెంట్ విభాగాల్లోని గ్లోబల్ కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన నియంత్రణ (రెగ్యులేటరీ) ఆటంకాలను పరిష్కరించేందుకు రాబోయే రెండు నెలల్లో సమూల మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించారు. భారత్‌లో తయారీ ప్రాజెక్టులను ప్రారంభించేటప్పుడు కంపెనీలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

కంపెనీలు ప్లాంట్లను వేగంగా ప్రారంభించడంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిబంధనలు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ఆ ప్రక్రియ మొత్తాన్ని కేంద్రం సరళీకరిస్తోంది. నాణ్యతా ప్రమాణాల తనిఖీ వ్యవస్థను సులభతరం చేస్తూ క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేయడానికి చర్యలు ప్రారంభించింది. నిబంధనల పరిధిలోకి రాని విదేశీ సరఫరాదారులకు కూడా సులువైన మార్గాలు కల్పిస్తోంది. అదే సమయంలో చౌకధరలకు వస్తువులను మార్కెట్లోకి పంపి స్థానిక పరిశ్రమలను దెబ్బతీసే అక్రమ వ్యాపార ధోరణులను (ప్రిడేటరీ ప్రైసింగ్) ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మంత్రి చాలా స్పష్టంగా స్పష్టం చేశారు.

రూ. 1.27 లక్షల కోట్లతో సెమీకాన్ 2.0 మిషన్

దేశంలో మైక్రోచిప్‌ల రూపకల్పన, తయారీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు కేంద్ర కేబినెట్ ఇటీవల రూ. 1,27,500 కోట్ల అంచనా వ్యయంతో సెమీకాన్ 2.0 మిషన్‌కు ఆమోదం తెలిపింది. ఈ భారీ కేటాయింపులతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యంతో వచ్చే ఏడాదిన్నర కాలంలో సెమీకండక్టర్, దాని అనుబంధ రంగాల్లో దాదాపు 50 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 4.15 లక్షల కోట్లు) పెట్టుబడులు రాబట్టాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ దశ విజయవంతంగా పూర్తయిన తర్వాత 'సెమీకండక్టర్ 3.0'ని కూడా తీసుకువస్తామని, ఇది ఒక నిరంతర వికాస ప్రయాణమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ప్లస్ వన్ కాదు.. అసలైన గ్లోబల్ డెస్టినేషన్

ప్రపంచ దేశాలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ను కేవలం ఒక 'ప్లస్ వన్' ఆప్షన్‌గా మాత్రమే చూడటం సరైంది కాదని గోయల్ అభిప్రాయపడ్డారు. నాణ్యత, సాంకేతికత, నైపుణ్యంతో కూడిన మానవ వనరుల లభ్యతలో భారతదేశం ప్రధాన తయారీ కేంద్రంగా ఎదుగుతోందని ఆయన ఉద్ఘాటించారు. 60 రోజుల వ్యవధిలో రాబోయే నిబంధనల మార్పులు విదేశీ దిగ్గజాలకు భారత్‌లో సులభంగా వ్యాపారం చేసుకునే అనుకూల వాతావరణాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) కల్పిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story